
9 మందికి తీవ్రగాయాలు..
పరిగి/పుంగనూరు: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన 13 మంది ఆదివారం ఉదయం హిందూపురం మండలం కొటిపి గ్రామంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. ధనాపురం సమీపంలో ఆటో డ్రైవర్ బాబుకు నిద్ర మత్తుగా ఉండటంతో మొహం కడుక్కోవాలని ఆటోను పక్కకు నిలిపి ఉంచగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పర అలివేలమ్మ (45), ఉప్పర సాకమ్మ(65), బోయ వెంకటలక్ష్మమ్మ (65) అనే మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా కూలీలే. ఆటోడ్రైవర్ సహా 11 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అతివేగంతో కారును ఢీకొన్న లారీ..
అతివేగంగా వస్తోన్న లారీ ఎదురుగా వస్తోన్న కారును ఢీకొనడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందగా ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సుగాలిమిట్ట వద్ద ఆదివారం జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నివాసి వెంకటరమణ (48) అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం సొంపల్లెలో స్కూల్ అసిస్టెంట్. ఆయన భార్య శారద (45) శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం బాలప్పగారిపల్లెలో టీచర్.
వీరికి కుమార్తె కీర్తన (17), కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. వెంకటరమణ భార్య, కుమార్తెతో కలిసి శనివారం తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వెళ్లాడు. ఆదివారం అక్కడి నుంచి కదిరికి బయలుదేరగా..సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందగా..వెంకటరమణ, కీర్తన తీవ్రంగా గాయపడ్డారు.