ప్రముఖ ఆర్‌టిఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ ఢిల్లీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వ యంత్రాంగంలో సమాచార హక్కు చట్టాన్ని మెరుగ్గా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్‌టిఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ ఢిల్లీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వ యంత్రాంగంలో సమాచార హక్కు చట్టాన్ని మెరుగ్గా అమలుచేయడం కోసం ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారు. సుభాష్ చంద్ర అగర్వాల్‌ను పాలనా సంస్కరణల విభాగం కన్సల్టెంట్‌గా నియమిస్తూ పాలనా సంస్కరణల విభాగం డిప్యూటీ డెరైక్టర్ అమితాబ్ జోషీ ఉత్తర్వు జారీచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయన సమాచార హక్కు చట్టం - 2005 నియమ నిబంధనల గురించి ఢిల్లీ ప్రభుత్వం కిందనున్న పిఐవోలు/ఫస్ట్ అప్పిలే ట్ అథారిటీలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తారు. ఢిల్లీ పాలనా సంస్కరణల విభాగంతో కలిసి పనిచేస్తూ ఢిల్లీలో సమాచార హక్కు చట్టాన్ని మెరుగ్గా అమలుచేయడానికి సహకరిస్తారు.
సమాచార హక్కు చట్టం కింద అనేక కీలకమైన దరఖాస్తులు దాఖలుచేసిన ఘనత సుభాష్ చంద్ర అగర్వాల్‌కు ఉంది. ఆయన దరఖాస్తు మూలంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆర్‌టిఐ చట్టం కిందకు తీసుకువచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్‌తో పాటు అగర్వాల్ దాఖలు చేసిన నివేదిక కారణంగా ఆరు జాతీయస్థాయి రాజకీయ పార్టీలను ఆర్‌టిఐ చట్టం పరిధి కిందకుతెచ్చారు. ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల రికార్డుల నిర్వహణలో ప్రభుత్వం తెచ్చిన మార్పుల వెనుక కూడా అగర్వాల్ ఆర్‌టిఐ దరఖాస్తు ఉంది. ఆయన పత్రికా సంపాదకులకు రాసిన లేఖలు అత్యధిక సంఖ్యలో ప్రచురితమయ్యాయి. ఈ విషయంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు.
ఆర్‌టిఐ దరఖాన్తుల పరిశీలనలో ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, లోటుపాట్లపై దృష్టిపెడతానని అగర్వాల్ చెప్పారు. కేంద్ర సమాచార కమిషనర్లను, మాజీ కమిషనర్లను కూడా తాను సంప్రదిస్తానని, ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్ర సమాచార కమిషన్‌లో దాఖలైన ఆర్టీఐ పిటిషన్ల గురించి అడిగి తెలుసుకుంటానని చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ తనను కన్సల్టెంట్‌గా నియమించడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఆర్టీఐ దరఖాస్తులకు ప్రతిస్పందించడంలో ఢిల్లీ ప్రభుత్వం, దాని సంస్థలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.