న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ అన్న మాట నిలబెట్టుకున్నారు. అనైతికంగా ట్యాక్సీ రేట్లను పెంచి ప్రయాణీకుల్ని నిలువు దోపిడీ చేస్తున్నఊబర్, ఓలా ట్యాక్సీ ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేజ్రీవాల బుధవారం ట్వీట్ చేశారు. రేట్లను పెంచితే కఠినంగా వ్యవహరిస్తామని గతంలో కేజ్రీవాల్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు ప్రభుత్వ ధరలకు వ్యతిరేకంగా అదనపు చార్జీలను వసూలు చేస్తున్న 50 ట్యాక్సీలను సీజ్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తీసుకువస్తే దాన్ని ఆసరాగా చేసుకొని ఊబర్, ఓలా సర్వీసులు ఐదు రెట్లు తమ ట్యాక్పీ రేట్లను పెంచడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ట్యాక్సీ సర్వీసులపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానంలో కేసును సైతం దాఖలు చేశారు. టాక్సీ ధరలు పెంచడంతో అది మరింత మంది డ్రైవర్లను అందుబాటులో ఉండేలా చేస్తుందని డిమాండ్ మేరకు ఒక్కోసారి ధరలను పెంచాల్సి వస్తుందని ఊబర్ ట్వీట్ చేసింది. ఊబర్ వాదనతో విభేదించిన ప్రభుత్వం దీనిని 'పట్ట పగలే దోపిడి' గా అభివర్ణించింది. కర్ణాటక రాష్ర్టం కూడా గతంలో టాక్సీ ధరల పెంపుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.