
భారత ప్రభుత్వం దేశంలో ‘సహకర్ ట్యాక్సీ’ పేరుతో ట్యాక్సీ సర్వీసులు అందించాలని యోచిస్తోంది. ఓలా, ఉబెర్, రాపిడో, బ్లూస్మార్ట్.. వంటి పాపులర్ రైడింగ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంటులో ప్రణాళికలు ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపిన ‘సహకర్ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) విధానానికి అనుగుణంగా ఉంటుందన్నారు. కాగా, ప్రభుత్వ ప్రతిపాదిత సర్వీసు వల్ల ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు గట్టి పోటీ నెలకొననుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపిన వివరాల ప్రకారం.. అధిక జనాభా ఉన్న దేశంలో విస్తారమైన మార్కెట్ కోసం అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించాలని యోచిస్తున్న సహకర్ ట్యాక్సీలో భాగంగా టూ వీలర్ టాక్సీ, రిక్షాలు, ఫోర్ వీలర్ టాక్సీ సేవలు అందించబోతున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రస్తుతం ఇలాంటి సర్వీసుల వల్ల సమకూరే లాభాలను ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాల మాదిరిగా కాకుండా నేరుగా డ్రైవర్లకు చేరవేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు..
పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఇలాంటి నమూనా ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం ‘యాత్రి సతి’ అనే ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్‌ను గతంలోనే ప్రారంభించింది. మొదట్లో కోల్‌కతాలో ప్రవేశపెట్టిన ఈ సర్వీసు ఆ తర్వాత సిలిగురి, అసన్సోల్, దుర్గాపూర్ సహా ఇతర నగరాలకు విస్తరించింది. యాత్రి సతి త్వరగా వినియోగదారులను తమ గమ్యాలకు చేరవేస్తుంది. లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ (బెంగాలీ లేదా ఇంగ్లీష్)తో సరసమైన ఛార్జీలు, 24/7 కస్టమర్ సపోర్ట్‌ను అందిస్తుంది. కర్ణాటకలో ‘నమ్మ యాత్రి’ అనే ప్రైవేట్ యాజమాన్యంలోని టాక్సీ సేవల యాప్ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత నమూనాను అనుసరిస్తుంది. లాభాలన్నీ నేరుగా డ్రైవర్లకు వెళ్లేలా చేస్తుంది.
ఇదీ చదవండి: ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’కు సుంకాలతో ముప్పు
ప్రైవేట్ కంపెనీలపై విమర్శలు
ఓలా, ఉబెర్.. వంటి సంస్థలు అమలు చేస్తున్న అనుచిత ధరల విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. యూజర్ డివైజ్‌ల ఆధారంగా ఛార్జీల్లో వ్యత్యాసాలు నమోదవుతున్నట్లు ప్రైవేట్ కంపెనీ సర్వీసులు పొందుతువున్నవారు ఇటీవల పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సదరు కంపెనీలకు నోటీసులు జారీ చేయడంతో న్యాయమైన వాణిజ్య విధానాలపై చర్చ మరింత ముదిరింది.