ఓలా, ఊబర్ లకు షాక్
బెంగళూరు: ప్రముఖ ట్యాక్సీ ఎగ్రిగేటర్స్ ఓలా, ఊబర్ ట్యాక్సీ సంస్థలకు ఢిల్లీ తర్వాత మరో రాష్ట్రంలో భారీ ఎదురు దెబ్బ తగలనుందా? కర్ణాటక రాష్ట్రంలో వీరి సర్వీసులు నిలిచి పోనున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఊబర్ లపై మరోసారి కన్నెర్రజేసిన తీరు ఈ అనుమానాలను బలపరుస్తోంది. తాజా ఆదేశాల ప్రకారం తక్షణమే లైసెన్స్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధలను బేఖాతరు చేసిన ట్యాక్సీల సేవలను తక్షణమే నిలిపివేయనున్నట్టు కర్ణాటక ప్రకటించింది. రవాణా కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రకారం, సంబంధిత అధికారులనుంచి లైసెన్స్ పొందని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. లెసెన్సులను తక్షణమే తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, పీక్ టైంలో వసూలు చేస్తున్న, అధిక రేట్లు , ట్రాన్స్ పోర్ట్ అధికారుల వద్ద నమోదు కాకపోవడం లాంటి ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.
ట్యాక్సీల నిర్వహణకు కంపెనీలు లైసెన్సు తీసుకోలేదని కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. ఇకముందు అనుమతి లేకుండా ట్యాక్సీలు నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రామెగౌడ హెచ్చరించారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ట్యాక్సీలు నడిపేందుకు అనుమతి లేదని స్పష్టంచేశారు. డ్రైవర్ల నియామకంలో వారి పూర్వపరాలను పరిశీలించాలనే నిబంధనను పట్టించకోవడం లేదని, ప్రభుత్వ నిబంధనలను పాటించలేదంటూ.ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలపై ఓలా స్పందించిందని కూడా ఆయన తెలిపారు.
కాగా బెంగళూరులో ట్యాక్సీ చార్జీల పెంపు నిర్ణయాన్ని గతంలో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో తమ సర్వీసులను కొనసాగించాలనుకుంటే తక్షణమే లైసెన్స్ తీసుకోవాలంటూ ఇటీవల కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు నెలల్లో ఓలా, ఉబర్ కు వ్యతిరేకంగా 300 కేసులు దాఖలయ్యాయి. సుమారు 1,000 టాక్సీలను జప్తు చేశారు. అయితే బెంగళూరులో ఆదివారం ఐపిల్ మ్యాచ్ కారణంగా ఈ క్యాబ్ లు యథావిధిగా తిరిగాయి. ఇండియన్ సిలికాన్ వ్యాలీ లో ఇప్పటికే బైక్ ట్యాక్సీ సర్వీసులపై కొరడా ఝళిపించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.