
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు తాత్కాలికంగా నిరాశ మిగిలింది. నిర్భయ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలనీ, న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోవడానికి వారికి ఢిల్లీ హైకోర్టు గడువివ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఖైదీల ఉరితీతపై స్టేకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడానికి విముఖత వ్యక్తం చేసింది. దోషులకు నోటీసులు ఇవ్వాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనతో జస్టిస్ భానుమతి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు.
అది మరింత జాప్యానికి దారితీస్తుందని, దీనిపై 11వ తేదీన విచారిస్తామని తెలిపింది. అయితే ఉరిశిక్ష అమలులో జాప్యంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దేశం సహనాన్ని పరీక్షించింది చాలుననీ, ఇకపై వారిని ఉరితీసేందుకు అనుమతించాలనీ కోరారు. అయిదేళ్లుగా నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ క్షమాభిక్ష అర్జీ పెట్టుకోకపోగా ముకేశ్ కుమార్ న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నాడని వెల్లడించారు. అందుకే, ఒకే కేసులో దోషులను విడివిడిగా ఉరితీసే అంశంపై చట్టం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అయితే ఏ ఒక్కరూ తాము ప్రాణాలతో ఉండేందుకు కావాల్సిన అవకాశాలనూ వినియోగించుకోకుండా అడ్డుకోరాదని ధర్మాసనం తెలిపింది. మరో పరిణామం..నిర్భయ దోషుల ఉరి తీతకు కొత్త తేదీలను ఖరారు చేయాలంటూ తీహార్ జైలు అధికారులతోపాటు ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. ‘చట్టపరంగా జీవించే అవకాశం దోషులకు ఉండగా, ఉరితీయడం నేరపూరితమైన పాపం’అని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment