
న్యూఢిల్లీ: కాలుష్య భూతానికి చెక్ పెట్టేలా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2023 వరకు పటాకులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం (సెప్టెంబర్ 7) సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలో కాలుష్య భూతంనుంచి ప్రజలను రక్షించడానికి, గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
తద్వారా కాలుష్య భూతంనుంచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చంటూ రాయ్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. జనవరి 1, 2023 వరకు పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని రాయ్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఏడాది దేశ రాజధానిలో ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం లేదా డెలివరీపై కూడా నిషేధం ఉంటుందని తెలిపారు.
నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. పండుగ సీజన్‌లో ముఖ్యంగా దీపావళి సందర్బంగా క్రాకర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలోని కాలుష్యం రికార్డు స్థాయికి చేరడంతో దీని నివారణకు అనేక చర్యల్ని చేపడుతోంది.
दिल्ली में लोगों को प्रदूषण के खतरे से बचाने के लिए पिछले साल की तरह ही इस बार भी सभी तरह के पटाखों के उत्पादन, भंडारण, बिक्री और उपयोग पर पूरी तरह प्रतिबंध लगाया जा रहा है, तांकि लोगों की जिंदगी बचाई जा सके।
— Gopal Rai (@AapKaGopalRai) September 7, 2022
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ‘పతాఖే నహీ దియే జలావో’ అంటూ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా పటాకుల అమ్మకాలను, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పటాకులు పేల్చి పట్టుబడిన వారికి రూ.1,000 జరిమానా విధించగా, సైలెంట్ జోన్‌లలో అదే పని చేస్తూ పట్టుబడిన వారికి 3 వేల జరిమానా విధించారు. వివాహాలు, మతపరమైన పండుగలు లేదా ర్యాలీలు, బహిరంగ సభల్లో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నివాస, వాణిజ్యం ఆవాసాల్లో అయితే పదివేలు, కీలక జోన్లలో రూ. 20 వేలు చెల్లించేలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment