న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్లను అక్రమంగా రీఫిల్లింగ్ చేసే వారిపై అధికారులు విరుచుకుపడుతున్నారు. నగరవ్యాప్తంగా గురువారం 164 చోట్ల దాడులు నిర్వహించిన అధికారుల బృందం 293 సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. దుకాణదారులు పెద్ద సిలిండర్ల నుంచి అక్రమంగా గ్యాస్ తీసి చిన్నవాటిలో నింపుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు 32 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ‘గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ చాలా ప్రమాదకరం. పేలుళ్లు, అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. చిన్న సిలిండర్లను స్థానికంగానే తయారు చేస్తున్నారు.
వీటి వినియోగమూ చాలా ప్రమాదకరం. తక్కువ బరువున్న సిలిండర్లను సరఫరా చేస్తూ నిందితులు వినియోగదారులను మోసగిస్తున్నారు’ అని ఆహార సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాలశాఖ కమిషనర్ ఎస్‌ఎస్ యాదవ్ ఈ సందర్భంగా అన్నారు. నిందితులపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పేర్కొన్నారు. దీని కింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలుశిక్ష పడుతుందని యాదవ్ అన్నారు. ఈ చట్టం ప్రకారం ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా కలిగి ఉండడం, సరఫరా చేయడాన్ని పూర్తిగా నిషేధించారని తెలిపారు.
పామాణిక బరువు కంటే ఎక్కువ లేదా తక్కువ బరువున్న సిలిండర్ల అమ్మకాన్ని కూడా నిషేధించారని వివరించారు. తాజాగా గురువారం సంత్‌నగర్, వాజీర్‌పూర్, బురారీ, రాజాపూర్, షాబాద్ దౌలత్‌పూర్, ఈస్ట్ వినోద్‌నగర్, మెహ్రౌలీ, కపషేరా, కలందర్ కాలనీ, దిల్షద్ గార్డెన్, గోకుల్‌పురి, సీమాపురి, మండోలీ, సదర్ బజార్, బల్లిమారన్, ఠాగూర్ గార్డెన్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని చెప్పారు. ఈ నెలలో దాడులు నిర్వహించడం ఇది రెండోసారని కమిషనర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ నెల ఐదున నిర్వహించిన తనిఖీల్లో 315 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, 34 క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఎస్‌ఎస్ యాదవ్ తెలిపారు.
అక్రమ రీఫిల్లింగ్‌పై ఉక్కుపాదం
Published Thu, Jun 26 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM
Advertisement