రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్! | Farmers suicides are stopped | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్!

Published Mon, Aug 10 2015 1:32 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్! - Sakshi

రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్!

1995 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం రైతు ఆత్మహత్యల సంఖ్య 2014లో 3,00,000 మైలు రాయిని దాటింది. అయితే, 2014లోని రైతు ఆత్మ హత్యల గణాంకాలకు, అంతకు ముందటి 19 ఏళ్ల గణాంకాలకు పొంతనే లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అనుసరించే గణన విధానంలో వచ్చిన పెను మార్పుల ఫలితమిది.
 
 పద్ధతి మార్పుతో లెక్కల తారుమారు
 నూతన పారమితుల (కొలమానాల) ప్రకారం, 2014లో మొత్తం రైతు ఆత్మ హత్యలు 5,650కు పడిపోయాయి. అంటే 2013లోని 11,772 కంటే సగానికి పైగా తక్కువ. ఎన్‌సీఆర్‌బీ పట్టికల్లో కొత్త లేదా సవరించిన వర్గాలలోకి ఆత్మ హత్య సంఖ్యలను అటూ ఇటూ మార్చడం ద్వారా ఇది అతి సులుపుగా జరిగి పోయింది. రైతు ఆత్మహత్యల ‘‘తగ్గుదల’’తో పాటే ‘‘ఇతరుల’’ ఆత్మహత్య లు దిగ్భ్రాంతికరంగా పెరిగిపోవడమూ కనిపిస్తుంది. రైతు ఆత్మహత్యల్లో దేశంలో మొదటి నుంచి రెండో స్థానంలో ఉన్న కర్ణాటకలో 2014లో కేవలం 321 రైతు ఆత్మహత్యలు మాత్రమే జరిగాయి.
 
 అంతకు ముందటి ఏడాది 1,403తో పోలిస్తే ఇది చాలా పెద్ద తగ్గుదల. అదే 12 మాసాల్లో ‘‘ఇతరులు’’ కాలమ్‌లోని ఆత్మహత్యల సంఖ్య 245 శాతం, అంటే 1,482 నుంచి 5,120కి పెరిగిపోయింది. రైతు ఆత్మహత్యలు అతి ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సగటున ఈ ఒక్క ఏడాదే 128 శాతం ‘‘ఇతరుల’’ ఆత్మహత్యలు పెరిగాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వేలాది కౌలు రైతుల ఆత్మహ త్యలను పెద్ద ఎత్తున ‘‘వ్యవసాయ కూలీల’’ ఆత్మహత్య లుగా చూపాయి. తమ సరికొత్త గణాంకాలను సరిచూడలే దని ఎన్‌సీఆర్‌బీనే స్వయంగా అంగీకరించింది. ‘‘ఈ ఏడా ది గణాంకాలను యాదృచ్ఛికమైన ఎంపిక పద్ధతిలో క్రమబద్ధం చేయాలని చేయాలని ముందుగానే నిర్ణయించా రు.’’ ఇప్పటికే అధికారికమైవిగా ప్రకటించిన గణాంకాలనే ఇప్పుడు సరిచూస్తారని అర్థం.
 
 ‘‘జీరో’’ రైతు ఆత్మహత్యలు
 ఇంతేకాదు, 12 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను 2014లో ‘‘జీరో’’ రైతు ఆత్మహత్యల ప్రాంతాలుగా ప్రకటిం చారు. వీటి లో పెద్ద వ్యవసాయ రాష్ట్రాలైన పశ్చిమ బెంగా ల్, రాజస్థాన్, బిహార్ కూడా ఉన్నాయి. దీనికి విరుద్ధంగా  2010లో ఏ ఒక్క పెద్ద రాష్ట్రమూ ‘‘జీరో’’ రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా ప్రకటించుకోలేదు. కేవలం మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఆలా ప్రకటించుకున్నాయి. ఇప్పుడు అవే రాష్ట్రాలు తమ లక్షలాది రైతుల్లో ఏ ఒక్కరూ 2014 ఆత్మహత్య చేసుకోలేదని చెప్పుకుంటున్నాయి.  
 
 ఈ అంశాలకు సంబంధించి, ఈ గణాంకాలు అసాధారమైనవిగా భావిస్తున్నారు కాబట్టి ఎన్‌సీఆర్‌బీ సం బంధిత రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తాము వివరణను కోరవ చ్చని అంటోంది. ఎన్‌సీఆర్‌బీ భారత దేశంలో ప్రమాదాలలో మరణాలు, ఆత్మహత్యలు-2014 లోని ఈ కొత్త/సవరించిన వర్గాలకు సమాచారాన్ని ఎలా సేకరించారనేదానికి వివరణే లేదు. ఇక కారణాలకు వస్తే, ఎప్పటిలాగే  ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేట్టే బాధతో చేసుకున్న ఆత్మహత్యలుగా వాటిని పేర్కొంది.  
 
 అంకెల గారడీకి తెరిచిన తలుపులు

 మహారాష్ట్ర, ఏపీ (తెలంగాణ సహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లు రైతు ఆత్మహత్యల్లో ‘‘ఐదు పెద్ద’’ రాష్ట్రాలు. ఒక దశాబ్దిగా, ఆ ఐదే మొత్తంగా దేశవ్యాప్త రైతు ఆత్మహత్యల్లో సగటున మూడింట రెండు వంతులుగా ఉం డేవి. 2014లో అవి 90 శాతంకన్నా ఎక్కువని లెక్కించారు. మహారాష్ట్ర  20 ఏళ్లలో 63,318 రైతు ఆత్మహత్యలు జరిగినట్టు తేలగా అది 2014లో దేశ వ్యాప్తంగా మొత్తం రైతు ఆత్మహత్యలలో 45 శాతంగా మారింది. అయితే, వర్గీకరణలోని మార్పులకు సంబంధించిన తీవ్ర ప్రశ్నలకు జవాబులు లేవు. ఇక సమాచార సేకరణ విషయంలో మరింత సమస్యాత్మక ప్రశ్నలు అలాగే మిగిలాయి. ఎన్‌సీఆర్‌బీ సమాచార సేకరణ యంత్రాంగం కాదు. రాష్ట్రాల నుంచి వచ్చే గణాంకాలను సరిచూసి, ప్రోది చేసి పట్టికలను రూపొందిస్తుం ది. ఈ విషయానికి సంబంధించి దానికి అంకెలకు సంబంధించి స్వప్రయోజ నాలేమీ ఉండవు.  
 
 ఇలా భారీ ఎత్తున గణాంకాలను వక్రీకరించడం చత్తీస్‌గ ఢ్‌లో 2011లో మొదలైంది. 2006-10 మధ్య సగటున 1,555 రైతు ఆత్మహత్యలు జరిగిన ఆ రాష్ట్రంలో 2011లో రైతు ఆత్మహత్యలు లేనే లేవు. 2012లో నాలుగు, 2013లో మళ్లీ జీరో అని తేల్చారు. పశ్చిమబెంగాల్ 2012 నుంచి అదే బాట పట్టగా, ఇక ఇతరులు కూడా అంకెలకు చిత్రిక పట్టడం మొదలెట్టారు. రైతు ఆత్మహత్యలు రాజకీయంగా నష్టం కలుగజేసే సమస్య. ఇప్పుడు సరికొత్త వర్గాలు, కాలమ్స్‌తో మరింత సులువుగా ప్రధానమైన రైతు మరణాలను తగ్గించేయగలుగుతారు. భూ యజమానులైన  రైతులు, కాంట్రాక్టు/లీజుకు పనిచేసేవారు, వ్యవసాయ కూలీలు తదితర కొత్త ఉపవర్గాలను చేర్చారు. రైతు ఆత్మహత్యలను వీటిలో అటూ ఇటూ మార్చి గార డీ చేయగలుగుతారు. ‘‘పునర్వర్గీకరణేం లేదు’’ ‘‘కేవలం మరింతగా దేనికదిగావిభజించడం మా త్రమే ’’ జరిగిందని ఎన్‌సీఆర్‌బీ అంటోంది. ఎన్‌సీఆర్‌బీ అంటున్నట్టుగా గతంలో ఎన్నడూ, ఎక్కడా వ్వయసాయ కూలీలను ‘‘స్వయం ఉపాధిగల వారు’’గా పేర్కొనలేదు. అసలు వ్యవసాయ కూలీలంటేనే స్వయం ఉపాధి లేనివారని అర్థం. ఇతరుల వద్ద పనుల కోసం పల్లెల్లో తిరుగుతుంటారు.
 
 పోలీసు కానిస్టేబులే నిర్ణేత
 ఇంకా చూస్తే ఇది మరింత అధ్వానంగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్నది ఎవరో నిర్ధారించేది దిగువస్థాయి పోలీసు స్టేషన్లోని కానిస్టేబులే. అది  రైతా, భూయజమానా, వ్యవసాయదారా, కౌలుదారా, వ్యవసాయ కూలీనా అనే దాన్ని నిర్ధారించడం శిక్షణ పొందిన సర్వేయరుకు సైతం కొన్ని సందర్భాల్లో కష్టమే. కానిస్టేబుల్ సులువుగా చేసేస్తాడు.  కానీ ఎన్‌సీఆర్‌బీ మాత్రం ‘‘ఆత్మ హత్యలపై పోలీసు స్టేషన్లలోని అధికారిక సమాచారంపై ఆధారపడ్డ గణాం కాలు’’ అంటుంది. గత ఏడాది ‘‘శిక్షకులకు ఒక నెలపాటూ కఠోర శిక్షణ ను’’నిర్వహించామని అంటోంది. అది రాష్ట్ర రాజధానుల్లో ఉండేవారికే, తప్ప స్థానిక పోలీసు స్టేషన్లలో వారికి కాదు. స్టేట్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అధికారు లు జిల్లా/పోలీసు స్టేషన్ల స్థాయిలో వారికి శిక్షణ ఇచ్చినట్టు చెప్పుకుంటోంది. అదసలెన్నడూ జరగనే లేదు.
 
 రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే మహారాష్ట్రలోని విదర్భ, కర్ణాటక లోని మాండ్య వంటి ప్రాంతాలలోని పోలీసు స్టేషన్లలో ఈ విషయమై అడి గితే వారు విస్తుపోయారు. అలాగే ‘‘ఐదు పెద్ద’’ రాష్ట్రాల అత్యున్నత పోలీసు అధికారులు కూడానూ. ఏపీలో ఓ సీనియర్ అత్యున్నత పోలీసు అధి కారి ఒకరు అలాంటి సర్క్యులర్ ఏదీ రాలేదని స్పష్టంచేశారు.  తెలంగాణ లోని ఒక అత్యున్నత స్థాయి పోలీసు అధికారి ఈ పని అసలు కానిస్టేబుల్‌దే కాద ని, తహసీల్దార్‌దని, పోలీసులు అత్మహత్యకు కనిపించే కారణాలను మాత్రమే నమోదు చేస్తారు అని తెలిపారు.
 
 అంటే ఎవరు రైతో కాదో తేల్చా ల్సిందే రెవెన్యూ శాఖే. అంటే రెవెన్యూ శాఖలోనో లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డుల శాఖలో నో ఈ వర్గీకరణ జరగాల్సి ఉంటుంది. ఆ పోలీసు అధికారే అన్నట్టు అనుమా నం ఉంటే దాన్ని ‘‘ఇతరులు’’గా వర్గీకరిస్తారు. వేలాది సందర్భాల్లో ఆ పనే జరిగి ఉంటుంది. రైతు ఆత్మహత్యలను జిల్లా కలెక్టర్లకు నివేదించమని మాత్ర మే 2006లో ఓ సర్క్యులర్ వచ్చిందని మహారాష్ట్రలోని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆత్మహత్యలు ఎక్కువగా జరుగు తున్న కర్ణాటకలోని పోలీసులు ఈ కొత్త వర్గీకణ తమకు అంతుబట్టనిదిగా ఉందన్నా రు. అసలు ఎఫ్‌ఐఆర్‌లో అలాంటివి నమోదు చేయాలని కూడా తెలియద న్నారు. మధ్యప్రదేశ్ పోలీసులదీ అదే పరిస్థితి.
 
 కౌలు రైతులంతా వ్యవసాయ కూలీలే
 ఈ కొత్త చర్యలతో తలెత్తిన గందరగోళం అసలు ఆ ఎన్‌సీఆర్‌బీ నివేదికలోనే కనిపిస్తోంది. రైతు ఆత్మహత్యలపై రెండో పేరా ఇలా పేర్కోంది:‘‘రైతులలో భూమికి యజమానులై పొలంలో  పనిచేసేవారితో పాటూ పనికి పెట్టుకునే వారు/పొలం పనులకు కూలీలను పెట్టుకునేవారు కూడా వస్తారు. వ్యవ సాయ కూలీలు ఇందులోకి రారు ’’అలాంటప్పుడు వారు పట్టికలోని ‘‘స్వయం ఉపాధికలవారు’’ పట్టికలోకి ఎలా చేరుతారు?
 
 ఇతరులు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసే కౌలుదార్లేనే తీసు కోండి. వారిలో చాలా మందికి కౌలు ఒప్పందాలే ఉండవు. కాబట్టి బ్యాంకు రుణాలు అందవు. వడ్డీవ్యాపారుల వల్ల పీకల్లోతు అప్పుల్లో కూరుకుపో తారు. వారిలో చాలామంది ఆత్మహత్యలు చేసుసుకున్నారు. అయితే ఎలాం టి గుర్తింపు రికార్డు లేక అలాంటివారినందరినీ రైతు ఆత్మహత్యల నుంచి తొలగించేసేవారు. ఇప్పుడు మరింత జోరుగా అది సాగుతుంది. ఆత్మహత్య లకు పాల్పడ్డ కౌలుదార్లలో ఒక చిన్న భాగమే రైతు ఆత్మహత్యల వర్గం కింద కు వస్తారు. వారిలో చాలా మందిని వ్యవసాయ కూలీలుగా లెక్కించేస్తారు. తాజా 2014 సమాచారంలో ఇది చాలా స్పష్టంగానే జరిగింది. అది మొత్తం వ్యవసాయ కూలీల ఆత్మహత్యలను 6,710గా, అంటే రైతు ఆత్మహత్యల కంటే వెయ్యి ఎక్కువగా చూపింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 2014లో కేవలం 160 మంది రైతులే ఆత్మహత్య చేసుకోగా, వ్యవసాయ కూలీలు దాని కి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడ్డారని నివేదిక  తెలుపుతోంది.
 
 ఎన్‌సీఆర్‌బీ మాత్రం ‘‘సంబంధిత పోలీసు స్టేషన్లు బాధితులు రైతులా, వ్యవసాయా కూలీలో నిర్ధారించుకునే ఆయా వర్గాలలో చేరుస్తాయని’’ భావిస్తామంటోంది. అయితే, ఈ విషయం సమస్యాత్మకమైనదయ్యే అవకా శం ఉన్నందున సంబంధిత రాష్ట్రాల నుంచి ఈ విషయంలో వివరణ కోరుతా మని ఆ సంస్థ తెలిపింది. దానికి ఈ సమస్య తెలుసు. కేవలం కౌలు రికార్డు లు ఉన్న వారిని మాత్రమే లెక్కిస్తారని బ్యూరోకు చెందిన ఒక సీనియర్ అధి కారి తెలిపారు.
 
 అయినా అది మాత్రం ‘‘రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉండే కౌలు హక్కులు/సమస్యల విషయమై వివరమైన అధ్యయనమేదీ చేపట్టబోవ డం లేదు.’’ సరిగ్గా అదీ అసలు కారణం. కౌలు రైతు రికార్డులు నమోదు కాక పోవడం లే దా లేకపోవడం అనేదే 2014 సమాచారాన్నంతటినీ గందరగోళ పరించింది.  ‘‘ఎన్‌సీఆర్‌బీ 2014 కౌలుదార్లను వ్యవసాయ కూలీలుగా తప్పు గా వర్గీకరించింది’’ అని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకేఎస్) ఉపాధ్యక్షులు మల్లా రెడ్డి అన్నారు. కిసాన్ సభ పట్టుబట్టగా ఏపీ ప్రభుత్వం కౌల్దార్లకు స్పష్టమైన గుర్తింపును ఇవ్వడం కోసం లెసైన్సుడ్ కౌల్దార్ల చట్టం తెచ్చింది. ‘‘వారికి బ్యాంకు రుణ అర్హత కార్డులు’’ ఇవ్వాల్సి ఉండింది. కానీ 32 లక్షల కౌలు రైతుల్లో 90 శాతానికి ఆ కార్డులు ఇవ్వ లేదు  అని ఆయన అన్నారు.  
 
 ఈ కౌలుదార్ల సమస్యకు తోడు, తాజా రైతు ఆత్మహత్యల గణాంక సమాచారానికి అప్రతిష్టకు గురిచేసే ఇతర అంశాలు కూడా  ఉన్నాయి. వీటి లో కీలకమైనది నమోదైన ఆత్మహత్యలలో బ్రహ్మాండంగా పెరిగిపోయిన ‘‘ఇతరులు.’’ ప్రత్యేకించి ‘‘పెద్ద ఐదు’’ రాష్ట్రాల్లో అవి 2014లో రెట్టింప య్యాయి. కర్ణాటకలో అది ఒక్క ఏడాదిలో 245 శాతం పెరగగా, ఏపీలో 138 శాతం, మహారాష్ట్రలో 94 శాతం, మధ్యప్రదేశ్‌లో 89 శాతం, చత్తీస్‌గఢ్‌లో 30 శాతం పెరిగాయి.   
 
 ఇతరులు విభాగంలో పెరిగిన ఆత్మహత్యలు
 2011-14 కాలంలో రైతుల ఆత్మహత్యలు సున్నాకు (లేదా సింగిల్ డిజిట్‌కు) చేరుకున్నాయని చత్తీస్‌గడ్ రాష్ట్రం ప్రకటించినప్పుడు ‘‘ఇతరులు’’ విభాగం లో ఆత్మహత్యల సగటు 83 శాతం వృద్ధితో, 1,472కు చేరింది.  ఈ కేటగిరీలో 2013లో 24,809 ఆత్మహత్యలు నమోదుకాగా, 2014లో ఇవి 41,216కు చేరుకున్నాయి. ఆశ్చర్యకరంగా, ‘‘రోజుకూలీకి పని చేసేవారు’’ అనే కొత్త విభాగం కల్పన కోసం ‘‘ఇతరులు’’ విభాగం నుంచి 15,735 మంది మరణా లను ఉపసంహరించినప్పటికీ, అదే విభాగంలో ఇన్ని మరణాలు నమోదయ్యాయి. 2014లో ‘‘ఇతరులు’’ విభాగం దేశంలో సంభవించిన మొత్తం ఆత్మహత్యలలో 31.3 శాతంతో మూ డో స్థానంలో నిలిచింది. ఆత్మహత్యలు అధికంగా జరుగుతు న్న తొలి 5 రాష్ట్రాల్లోనే ఈ విభాగంలో 16,234 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. 2013లో ఈ అయిదు రాష్ట్రాల్లో ఆత్మ హత్యల సంఖ్య 7,107 మాత్రమే.
 
 ఆత్మహత్యల సంఖ్యను తగ్గించి చూపిన ఈ ఫారంలోనే స్వయం ఉపాధి కలవారు (ఎస్‌ఈపీ -ఇతరులు) అనే కాల మ్ ఉంది. చత్తీస్‌గడ్‌లో రైతుల ఆత్మహత్యలకు, ఎస్‌ఈపీ కాలమ్‌లకు మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. 2009లో అత్యధిక రైతు ఆత్మహత్యలను (1,802) నివేదించిన రాష్ట్రం లో దాని ఎస్‌ఈపీ (ఇతరులు) ఆత్మహత్యల సంఖ్య 861గా ఉండేది. 2013లో రైతుల ఆత్మహత్యలు లేనే లేవని ఆ రాష్ట్రం ప్రకటించినప్పుడు (వరుసగా మూడో సంవత్సరం) ఎస్‌ఈ పీ (ఇతరులు) విభాగంలో ఆత్మహత్యలు 2,077కు చేరుకు న్నాయి. 2011-13 వరకుగల మూడేళ్ల కాలంలో ఎస్‌ఈపీ (ఇతరులు)నీ, ‘‘ఇతరులు’’ విభాగాలను మనం కలిపి చూ సినట్లయితే, రాష్ట్రంలోని మొత్తం ఆత్మహత్యల్లో ఇవి 60 శాతంగా నమోదవుతాయి.
 
  ఆత్మ హత్యలు జరగనే లేదంటూ ‘జీరో’ ప్రకటనలు చేస్తున్న ధోరణి మరింత తీవ్ర మైంది. ఈ సంవత్సరం మరింత వక్రీకరణ జరిగింది. కానీ ఆత్మ వంచన ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మనకు సంఖ్యల గురించి తెలీనట్లయితే ఏ సమస్యా లేదు. లెక్కించే పద్ధతిని మార్చండి, అప్పుడు లెక్కింపే మారిపోతుంది. దాంతో గ్రామీణ ప్రాంతం ప్రశాంతంగా సాగిపోతున్నట్లే లెక్క.
 
 ‘‘ఇతరులు’’ -  ఇతరులు
 ‘‘ఇతరులు’’ కాలమ్‌కు చాలాకాలంగా ఒక ఘనమైన చరిత్రే ఉంది. 1997- 2000 మధ్య అనంతపూర్ జిల్లాలో సంభవించిన 1,061 ఆత్మహత్యలకు అస్వస్థత కారణమని 2001లో జిల్లా నేర రికార్డుల బ్యూరో తేల్చేసింది. అనేక సందర్భాల్లో ఈ అస్వస్థతను భరించరాని కడుపునొప్పిగా నివేదించారు. క్రిమిసంహారక మందులను తాగితే చావుకు ముందు భయంకరమైన కడుపు నొప్పితో విలవిల్లాడతారు. కానీ కడుపునొప్పిని తట్టుకోలేక రైతులు తమను తాము చంపుకుంటున్నారని పోలీసులు నమోదు చేసేశారు.
 
 ఇతర తప్పులేవీ లేవని దీనర్థం కాదు. మహిళా రైతుల ఆత్మహత్యలను ఎన్నడూ లెక్కలోకి తీసుకోరు. సాంప్రదాయిక సమాజాలు చాలావరకు మహిళలను రైతులుగా గుర్తించవు. హక్కుపత్రాలు, పట్టాలపై మహిళల పేర్లు ఉండటం చాలా తక్కువ. దీని ఫలితమేమిటంటే, మహిళా రైతుల ఆత్మహత్య లు సున్నాగా ప్రభుత్వాలు నమోదు చేసిన కాలంలో ‘‘గృహిణులు’’ విభాగం అమాంతంగా విస్తరించింది. కొన్ని రాష్ట్రాల్లో,  కొన్ని సంవత్సరాల్లో జరిగిన మహిళల ఆత్మహత్యలలో 70 శాతంవరకు ‘‘గృహిణులు’’ ఉన్నారు. ఆత్మ హత్యలు చేసుకున్న వారు రైతులా కాదా అని నిర్ణయించడంలో కుల దురభి మానం కూడా తన ప్రభావం చూపింది. హక్కుపత్రాలపై దళితుల, ఆదివా సుల పేర్లు ఉండటం చాలా అరుదు. వీరిని తరచుగా భూ ఆక్రమణదారులు గానూ మరింత ఘోరమైన ముద్రలతోనూ చూస్తుంటారు.  
 
 ఇలా తక్కువ చేసి చూపే దురభిప్రాయాలు చాలా కాలం నుంచి ఉనికి లో ఉండటం వాస్తవం కాగా, కొత్త వ్యవస్థ వాటిని చట్టబద్ధం, వ్యవస్థీకృతం చేయడమే సమస్య. ఇంతవరకూ నిర్హేతుకమైన, అస్వాభావికమైనదిగా ఉంటూ వచ్చిన విషయం ఇప్పుడు సాధారణమైన విషయంగా మారిపోతోం ది. చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో 2011-12 సంవత్సరాల్లో ప్రారంభమైన ఒక తప్పుడుధోరణిని ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ చట్టబద్ధంగానే అమలు చేస్తూ వస్తున్నాయి. రాష్ట్ర రాజధానుల్లో ప్రభుత్వ అధికారులు చలాయిస్తున్న అధికారం అపారమైంది. రాజకీయ పరిస్థితికి అనుగుణంగా వీరు సంఖ్యల ను మార్చేస్తుంటారు. ఎన్ని లోపాలున్నప్పటికీ ఎన్‌సీఆర్‌బీ డేటా ఒకవైపు రాష్ట్రాల వద్ద ఉన్న డేటాలోని కొన్ని తప్పులను ప్రతిబింబిస్తూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న దానికన్నా కాస్త భిన్నమైన చిత్రణనే మనకు అందిస్తుంటుంది. ఉదాహరణకు, మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో 1,296మంది రైతుల ఆత్మహత్యలను ప్రకటించింది.
 
అదే సంవత్సరం ఎన్‌సీఆర్‌బీ ఆ రాష్ట్రంలో 3,146మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపింది. 2011-12 సంవత్సరాల్లో కూడా ఇదే వ్యత్యాసం కనిపించింది. 2014లో మాత్రమే ఎన్‌సీఆర్‌బీ పొందుపర్చిన 2,568 ఆత్మహత్యల సంఖ్య మహారాష్ట్ర ప్రకటించిన 1,981 మంది ఆత్మహత్యలకు కాస్త సమీపంలోకి వచ్చి నిలిచింది. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రాల రాజధానుల్లో అధికారులు వండి వార్చిన సంఖ్యలను మాత్రమే మీరు పొందవచ్చు. బహుశా వాటిపై ఎన్‌సీఆర్‌బీ రాజముద్ర ఉంటుంది కామోసు.
 
వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయులు
 psainath@gmail.com
 - పి. సాయినాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement