సాక్షి, అమరావతి: ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టెక్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన దిశ యాప్ సత్ఫలితాలిస్తోంది. పోక్సో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం తదితర చర్యలతో పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతోంది.
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని జాతీయ నేర గణాంకాల నివేదిక (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)–2021) వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేరాలు గణనీయంగా తగ్గాయని ఆ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
తగ్గిన హత్యలు
► రాష్ట్రంలో హత్యలు గణనీయంగా తగ్గాయి. చంద్రబాబు ప్రభుత్వంలో 2014లో 1,175, 2015లో 1,099, 2016లో 1,123, 2017లో 2,154, 2018లో 935 హత్యలు జరిగాయి. అంటే ఏడాదికి సగటున 1,077 మంది హత్యకు గురయ్యారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో 870, 2020లో 853, 2021లో 956 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే సగటున 893 హత్యలు జరిగాయి. ఏడాదికి సగటున 63 వరకు తగ్గినట్టు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. రాష్ట్రంలో అల్లర్లు, అలజడుల కేసులు 2019లో 492 నమోదు కాగా 2021లో 444కు తగ్గాయి.
► రాష్ట్రంలో కిడ్నాప్ కేసులూ తగ్గాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014లో 1,066, 2015లో 917, 2016లో 917, 2017లో 1,018, 2018లో 1,055 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదికి సగటున 944 మంది కిడ్నాప్‌నకు గురయ్యారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో 902, 2020లో 737, 2021లో 835 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదికి సగటున 824 కిడ్నాప్‌లు జరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. డబ్బుల కోసం 2019లో 15 కిడ్నాప్‌లు జరగ్గా.. 2021లో 9 కేసులే నమోదయ్యాయి.
బడుగులకు భద్రత
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. అవగాహన సదస్సుల ద్వారా వారిలో చైతన్యం కలిగిస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలు తాము వేధింపులకు గురైతే ఇప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగలుగుతున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక గణాంకాలు వెల్లడించాయి.
► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు సంబంధించి 2014లో 2,113 కేసులు, 2015లో 2,263 కేసులు, 2016లో 2,335 కేసులు, 2017లో 1,969 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద టీడీపీ ప్రభుత్వ హయాంలో సగటున ఏడాదికి 2,103 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2021 వరకు సగటున 2,011 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో 2,014 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.
► టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు, 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 341 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున 365 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులే నమోదయ్యాయి. ఇక 2019 నుంచి 2021వరకు సగటున ఏడాదికి కేసుల సంఖ్య 337కు తగ్గింది.
► ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, రక్షణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019వరకు రూ.52.32కోట్లే పరిహారంగా అందించారు. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు మూడేళ్లలోనే బాధితులైన ఎస్సీ, ఎస్టీలకు పరిహారంగా రూ.120 కోట్లు ఇవ్వడం విశేషం.
పోలీసు సిబ్బందిపై కేసులు తగ్గుదల
రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై కేసులు కూడా తగ్గాయి. 2020లో 261 కేసులు నమోదు కాగా 2021లో 185 కేసులే నమోదయ్యాయి. లాకప్ మరణాలు 2020లో 8 జరగ్గా, 2021లో ఆరుకు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
చార్జిషీట్ల నమోదులో అగ్రస్థానం
కేసుల దర్యాప్తు, నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. నేర నిరూపణలో కీలకమైన చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయడంలో అగ్రస్థానాన్ని సాధించింది. గడువులోగా దేశంలో 77.1శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏకంగా 93.7 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తుండటం విశేషం.
ఒక కేసు దర్యాప్తునకు 2018లో సగటున 164 రోజుల సమయం పట్టగా.. 2021లో 42 రోజుల్లోనే పూర్తి చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయడం పోలీసు శాఖ సమర్థతకు నిదర్శనం. పోక్సో కేసుల్లో 60 రోజల్లోనే చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. 2019లో 14శాతం కేసుల్లోనే 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా.. 2021లో ఏకంగా 92.5 శాతం కేసుల్లో దాఖలు చేశారు.
మహిళా భద్రతకు భరోసా
► దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భరోసానిస్తోంది. 2019 నుంచి వారిపై నేరాలు పెరగకుండా సమర్థంగా కట్టడి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో మహిళలపై నేరాల కేసులు 16,362 నమోదు కాగా... 2017లో 17,909 నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మహిళలపై నేరాల కేసులు 17,752కు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
► తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదు అవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. కాగా ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి.
► ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి. అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు 8 శాతం తగ్గాయి. 2020లో 2,541 కేసులు నమోదు కాగా 2021లో 2,330 కేసులు నమోదయ్యాయి.
బాలలపై నేరాలు తగ్గుముఖం
బాలలపై నేరాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. 18ఏళ్ల లోపు వారిపై వేధింపుల కేసులు రాష్ట్రంలో తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. బాలికలపై దాడుల కేసులు 2020లో 513 నమోదు కాగా 2021లో 493కు తగ్గాయి. బాలలను వేధించేవారిపై పోక్సో చట్టం కింద నమోదు చేసే కేసులు 7శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. ఈ కేసులు 2019లో 502, 2021లో 466 నమోదయ్యాయి.
రైతు ఆత్మహత్యలపై తప్పుదోవ పట్టిస్తున్న ఎల్లో మీడియా
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్యపై ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో ఆత్మహత్యల సంఖ్యనే పేర్కొంటుంది. కానీ అందుకు కారణాలను ప్రత్యేకంగా పేర్కొనదు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతో నిమిత్తం లేదని కూడా ఎన్‌సీఆర్‌బీ స్పష్టం చేసింది. కానీ ఎల్లో మీడియా మాత్రం ఈ విషయాన్ని వక్రీకరిస్తూ వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురిస్తోంది.
వాస్తవానికి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వ్యక్తుల ఆత్మహత్యలు తగ్గాయి. 2019లో 628 మంది, 2020లో 564 మంది ఆత్మహత్య చేసుకోగా 2021లో ఆత్మహత్యలు 481కు తగ్గాయి. భూమి కలిగిన రైతుల ఆత్మహత్యల కేసులు 2019లో 438, 2020లో 424 నమోదు కాగా 2021లో 359కు తగ్గాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు 2019లో 190, 2020లో 140 కేసులు నమోదు కాగా 2021లో 122కు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment