అది నేనే.. ఇదీ నేనే | Chandrababu dual stance on pension scheme | Sakshi
Sakshi News home page

అది నేనే.. ఇదీ నేనే

Published Mon, Aug 26 2024 4:21 AM | Last Updated on Mon, Aug 26 2024 7:48 AM

Chandrababu dual stance on pension scheme

పెన్షన్‌ స్కీమ్‌పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి

ఉద్యోగుల మేలు కోసం వైఎస్‌ జగన్‌ సర్కారు మెరుగైన జీపీఎస్‌ తెస్తే వ్యతిరేకం

ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్‌ స్కీమ్‌ తెస్తే నోరు మెదపని బాబు

కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా వ్యతిరేకించని వైనం

సీపీఎస్, జీపీఎస్‌ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారమంటూ మేనిఫెస్టోలో హామీ

సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్‌ అమలుకు గెజిట్‌ జారీ.. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులపై ఆగ్రహం పేరుతో డ్రామా

గెజిట్‌ నోటిఫికేషన్‌ నిలిపేయాలని ఆదేశించారంటూ ఎల్లో మీడియాలో కథనాలు 

ఇప్పటికీ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వని చంద్రబాబు

మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

యూపీఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నాం
కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉద్యోగులకు నష్టదాయకం. ఉద్యోగుల సంపదంతా ప్రభుత్వానికి పుణ్యానికి ఇవ్వడమే. ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పెన్షన్‌ అందించాలి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్‌ విధానాన్నే అమలు చేయాలి.  
– ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)ను తెస్తే ఆయన గగ్గోలు పెట్టారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని గుండెలు బాదుకున్నారు. 

ఇప్పుడు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌)ను తెస్తే బాబు కిమ్మనడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నా తనపై ఉన్న కేసులకు భయపడి యూపీఎస్‌ను వ్యతి రేకించే సాహసం చంద్రబాబు చేయడం లేదు. దీంతో ఆయన వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగులను నిలువెల్లా మోసం చేయడమే బాబు ఉద్దేశమని నిప్పులు చెరుగుతున్నారు.

సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగుల పింఛన్‌ విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మెరుగైన పింఛన్‌ వచ్చేలా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) తెస్తే చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. జీపీఎస్‌ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ప్రచా­రం చేశారని ఉద్యోగుల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. 

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సంయక్తంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్‌ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరి­ష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌) పేరుతో జీపీఎస్‌ తరహాలోనే తెచ్చినా నోరుమెదపకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి అద్దం పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

జీపీఎస్‌ తరహాలోనే యూపీఎస్‌ను తెచ్చినా..  
దాదాపు జీపీఎస్‌ తరహాలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను తెచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నా చంద్రబాబు వ్యతిరేకించకపోవడంపై మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు, కూటమి నేతలు సీపీఎస్‌ ఉద్యోగులను మోసం చేయడమేనని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జీపీఎస్‌ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన యూపీఎస్‌ వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నా నోరు విప్పకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులను దగా చేయడమే ఆయన ఉద్దేశమని దుయ్యబడుతున్నారు.  

బయటపడ్డ చంద్రబాబు మోసపూరిత నైజం..  
ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్, జీపీఎస్‌ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై 12న జీపీఎస్‌ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. 



మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు మెరుగైన విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించలేదని ధ్వజమెత్తుతున్నారు. జీపీఎస్‌ అమలు కోసం గెజిట్‌ విడుదల చేయించడంతోనే చంద్రబాబు మోసపూరిత నైజం బయటపడిందని నిప్పులు చెరుగుతున్నారు. గెజిట్‌ విడుదల విషయం మీడియాలో రావడంతో ‘చంద్రబాబు ఆగ్రహం’ అంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని, గెజిట్‌ అమలు నిలిపేయాలని ఆదేశించారంటూ కూడా కథనాలు అచ్చేశాయని గుర్తు చేస్తున్నారు. 

అయితే ఇప్పటివరకు గెజిట్‌ నిలుపుదల ఉత్తర్వులే జారీ కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాబు ఆగ్రహమనేది ఉత్తి మాటేననేది.. గెజిట్‌ నిలుపుదల చేయకపోవడంతోనే అర్థమైందని మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను చంద్రబాబు, కూటమి నేతలు వ్యతిరేకించకపోవడంతో ఆ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జీపీఎస్‌ అమలుకు గెజిట్‌ జారీ చేయించడంతో పాటు ఇప్పుడు కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను చంద్రబాబు వ్యతిరేకించలేదంటే సీపీఎస్‌ ఉద్యోగులను నిలువునా మోసం చేయడమేనని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందో మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడంలో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం యూపీఎస్‌ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూటమి నేతల ద్వంద్వ వైఖరికి అర్థం పడుతోందని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.  

పెన్షన్‌ భిక్ష కాదు.. ప్రాథమిక హక్కు..
తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్‌.. ఉద్యోగులను పూర్తిగా ముంచే స్కీమ్‌. చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పింఛన్‌ పథకాన్ని అందించాలి. పెన్షన్‌ భిక్ష కాదు.. ప్లాన్లతో వచ్చే డబ్బు కాదు. ఇది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఉద్యోగుల ఆకాంక్షలకు సోమనాథన్‌ కమిటీ పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడున్న ఎన్‌పీఎస్‌ పథకంలో రిటైరయ్యాక వచ్చే 60 శాతం మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెడితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. 

ఎలాంటి ప్లాన్లతో సంబంధం లేకుండా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి. 35, 40 ఏళ్ల పాటు ఉద్యోగి సర్వీసులో బేసిక్‌ పే, డీఏలో పది శాతం నొక్కేసి.. మ్యాచింగ్‌ గ్రాంట్‌ అంటూ దానికి కొంత పోగేసి, చివర్లో రిటైరయ్యాక మొత్తం కార్పస్‌ ఫండ్‌ను మింగేసే కుట్రే యూపీఎస్‌. ఉద్యోగుల పెన్షన్‌ సొమ్మును షేర్‌ మార్కెట్లో పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం?. 
– సీఎ దాస్, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

యూపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం
ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్‌ విధానాన్నే అమలు చేయాలి. తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్‌లో ప్రాన్‌ ఎమౌంట్‌ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుని 50 శాతం పింఛన్‌ను డీఆర్‌తో కలిపి ఇస్తారా? లేక ప్రస్తుత పింఛన్‌ పథకంలో ఉన్నట్లు 60 శాతం ప్రాన్‌ అమౌంట్‌ ఇస్తారా? అనేది తేల్చాలి. అలాగే యూపీఎస్‌ పెన్షన్‌ను ఏ విధంగా, ఎవరి ద్వారా చెల్లిస్తారనేదానిపైనా స్పష్టత ఇవ్వాలి. 

సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగికి కుటుంబ పింఛన్‌ 60 శాతం చెల్లిస్తారా? స్వచ్ఛంద పదవీ విరమణ విషయంలో కనీస సర్వీస్‌ ఎంతగా నిర్ణయిస్తారు? రిటైర్‌ అయ్యాక అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తం తిరిగి ఉద్యోగికి చెల్లిస్తారా? లేకపోతే యూపీఎస్, లంప్‌సమ్‌ ఎమౌంట్‌తో సరిపెడతారా? వీటన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలి.  
    – కె.సతీష్‌, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement