జైళ్ల ‘సంస్కరణ’ | reforms in indian jails | Sakshi
Sakshi News home page

జైళ్ల ‘సంస్కరణ’

Published Sat, Nov 5 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

జైళ్ల ‘సంస్కరణ’

జైళ్ల ‘సంస్కరణ’

మన జైళ్లలో ఖైదీల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని ఈమధ్యే విడుదలైన జాతీయ క్రైమ్‌ రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించింది. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని బెయిల్‌ ఇచ్చేవారు లభించక...అందుకు అవసరమైన స్తోమత లేక ఎందరో ఖైదీలు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఖైదీల్లో అత్యధికులు ఈ కేటగిరిలోనే ఉంటారు. ప్రతి 10మంది ఖైదీల్లో ఏడుగురు విచారణను ఎదుర్కొంటు న్నవారే! వీరికితోడు జీవిత ఖైదీల సంఖ్య కూడా రాను రాను పెరుగుతున్నదని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యావజ్జీవ శిక్ష పడి హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లినవారు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని గురు వారం ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు అలాంటివారికి ఉపశమనం కలిగించడంతో పాటు జైళ్లపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

యావజ్జీవ శిక్ష పడి ఐదేళ్ల శిక్షను అనుభవించినవారి అప్పీల్‌ పెండింగ్‌లో ఉంటే అలాంటివారికి బెయిల్‌ ఇవ్వొచ్చు నని జస్టిస్‌ సి. వి. నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎం. ఎస్‌. కె. జైశ్వాల్‌లతో కూడిన ధర్మా సనం చెబుతూనే అందుకు కొన్ని మార్గదర్శకాలు సూచించింది. బెయిల్‌ మంజూ రయ్యే వారికి రెండు షరతుల్ని కూడా విధించింది. ఈ మార్గదర్శకాలైనా, షరతు లైనా కరుడుగట్టిన నేరస్తుల విడుదలను నిరోధిస్తాయి. అదే సమయంలో విడుద లైనవారి కదలికలపై సైతం తగినంత నిఘా ఉండేలా చూస్తాయి. వీటితోపాటు ఆయా కేసుల ప్రత్యేక స్వభావాన్ని, అందులో ఇమిడివున్న పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్నాకే  బెయిల్‌ ఇవ్వడం, ఇవ్వకపోవడమన్న నిర్ణయం జరగాలని ధర్మాసనం చెబుతోంది.

మన జైళ్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఖైదీల సంఖ్య నానాటికీ పెరగడమేనని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోంది. జాతీయ స్థాయిలో ఖైదీల శాతం 114 దాటగా, తీహార్‌ జైల్లో అది 226 శాతంగా ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలే. ఇలా అధిక ఖైదీల సమస్యతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఉంది. పరిమితికి మించి ఖైదీలు ఉండటంవల్ల వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇంతమందిని అదుపు చేయడం అరకొరగా ఉండే సిబ్బందికి పెను సమస్య అవుతోంది. గార్డులకు సంబంధించి 33 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారుల స్థాయిలో ఇది 36 శాతంగా ఉన్నదని ఎన్‌సీఆర్‌బీ నివేదిక అంటున్నది. మొత్తంగా వివిధ జైళ్లలో 80,000 సిబ్బంది అవసరంకాగా అందులో 27,000కు పైగా పోస్టులు భర్తీ చేయలేదు. సిబ్బందికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రమే.

ఇలాంట పుడు వారినుంచి మెరుగైన పనిని ఆశించలేం. ఈమధ్యే చోటుచేసుకున్న భోపాల్‌ సెంట్రల్‌ జైలు ఉదంతంలోని నిజానిజాలేమిటన్న అంశాన్ని పక్కనబెడితే నిరుడు వివిధ జైళ్లనుంచి 200మంది పారిపోవడానికి కారణం తగినంతగా సిబ్బంది లేకపోవడమే. భోపాల్‌ సెంట్రల్‌ జైలే తీసుకుంటే అక్కడ గార్డుల పోస్టుల్లో 28 శాతం, అధికార్ల స్థాయిలో 35 శాతం ఖాళీలున్నాయి. పర్యవేక్షణ లోపం ఖైదీల పరా రీకి మాత్రమే కాదు...ఇతరత్రా సమస్యలకు కూడా దారితీస్తోంది. నిరుడు జైళ్లలో మొత్తంగా 1,584మంది మరణించారు. అంటే సగటున రోజుకు నలుగురన్న మాట! ఇందులో 1,469 సహజమరణాలని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోంది.

పోష కాహార లోపంవల్లనో, సకాలంలో అవసరమైన వైద్యం అందుబాటులో లేకపోవ డంవల్లనో మరణించినవారు కూడా ఈ ఖాతాలో జమ అయి ఉన్నా ఆశ్చర్యం లేదు. స్వతంత్ర సంస్థ ఏదైనా ఈ అధికారిక గణాంకాల లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తే మరిన్ని దిగ్భ్రాంతికర అంశాలు బయటపడవచ్చు. ఇవిగాక మిగిలిన 115 మర ణాలు అసహజమైనవిగా నివేదిక చెబుతోంది. ఇందులో 77 ఆత్మహత్యలున్నాయి. మిగిలినవి హత్యలు. ఇదొక విషాదకరమైన స్థితి. జాతీయ మానవ హక్కుల సంఘం ఈమధ్యే జైళ్లలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. వీటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ అంతంతమాత్రంగా ఉన్న సిబ్బందితో నెట్టుకొచ్చే జైళ్లు ఖైదీల మానసిక స్థితిని, వారిలో కనిపించే ఇతర లక్షణాలను పసిగట్ట స్థితిలో ఉన్నాయా అన్నది అనుమా నమే.

ఒకవేళ పసిగట్టినా అలాంటివారికి అవసరమైన వైద్యం అక్కడ అందుబా టులో ఉండదు. దేశంలోని ఖైదీలందరికీ అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టులైనా, సైకాలజిస్టులైనా కేవలం 18మంది మాత్రమే! అంటే ప్రతి 23,000మంది ఖైదీలకు ఒక సైకియాట్రిస్టు లేదా సైకాలజిస్టు ఉన్నారు. ఇంత అమానవీయమైన, అత్యంత దారుణమైన పరిస్థితులు మరెక్కడా ఉండవు. సిబ్బంది కొరత వల్ల జైళ్ల పర్యవేక్ష ణకు అధికారులు శిక్షపడిన ఖైదీల సాయం తీసుకుంటున్నారు. ఖైదీల్లో ఎవరికి ఆహారం, మందులు వగైరా అందాలో...ఎవరి ప్రవర్తన బాగోలేదో, వారిని దారికి తెచ్చేందుకు ఏం చేయాలో నిర్ణయించేది వారే. ఏమాత్రం శిక్షణలేకుండా, నేర ప్రవృత్తితో ఉండే ఇలాంటివారి దయాదాక్షిణ్యాలకు ఖైదీలను వదిలేయడంవల్ల మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి.

జైళ్ల గురించి ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన అంశాలు ఇక్కడి సామాజికార్ధిక అస మానతలకు అద్దంపడతాయి. మన జైళ్లలో సర్వసాధారణంగా ఖైదీ అణగారిన కులాలకు లేదా ఆదివాసీ వర్గానికి చెంది, చదువుసంధ్యలు లేని నిరుపేద అయి ఉంటాడని నివేదిక అంటున్నది. ప్రతి ముగ్గురు ఖైదీల్లో ఇద్దరు దళితులు. అత్యధికులు పదో తరగతికి ముందే చదువు మానేసినవారు. వారి సంఖ్య 57,610 ఉంటే... నిరక్షరాస్యులు 36,406మంది. మనిషిలో అమానవీయతనూ, నేరప్రవృ త్తినీ పెంచే జైళ్ల ప్రస్తుత స్థితి మారాలంటే సిబ్బందిని పెంచడం, పర్యవేక్షణ సక్ర మంగా ఉండేలా చూడటంతోపాటు అందులో పరిమితికి మించి ఖైదీలు లేకుండా చర్యలు తీసుకోవడం కూడా అవసరం. ఆ దిశగా ఉమ్మడి హైకోర్టు తీర్పు దోహద పడుతుంది. మొత్తంగా జైళ్ల స్థితిగతులపై న్యాయస్థానాలు మరింత లోతుగా దృష్టి సారిస్తే అవి మెరుగుపడే ఆస్కారం ఉంటుంది. అధికార యంత్రాంగాలు ఈ విష యంలో తమంత తాము చర్యలు తీసుకోగలవన్న ఆశ ఎవరికీ లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement