సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో చేస్తున్న నేరాలు జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఉన్నత చదువుల్లోనో, ఉద్యోగ వాపారాల్లోనో రాణించాల్సిన యువత జైలు గదుల్లో బందీ అవుతోంది. తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది యుక్త వయస్కులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు(2020) స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలోని మొత్తం 37 జైళ్లలో 6,114 మంది ఉండగా, వీరిలో 1,910 మంది వివిధ నేరాల్లో శిక్ష పడిన వారు కాగా, 3,946 మంది అండర్ ట్రయల్స్ (విచారణ ఖైదీలు), మరో 256 మంది డిటైనీస్ (ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్నవారు) ఉన్నారని ఎన్సీఆర్బీ పేర్కొంటోంది. అయితే వీరిలో ఎక్కువమంది 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కావడం గమనార్హం.
హత్యలు, లైంగిక దాడుల కేసులే అధికం
అండర్ ట్రయల్స్‌లో ఖైదీలుగా ఉన్న యుక్త వయస్కులు ఎక్కువగా హత్యలు, హత్యాప్రయత్నం, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, మద్యం, మాదకద్రవ్యాల సంబంధిత కేసులు, దొంగతనాల కేసుల్లో జైలు బాట పడుతున్నట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా శిక్ష అనుభవిస్తున్న కేటగిరీలోనూ హత్యలు, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు తదితర కేసుల వారు ఉన్నట్టు వెల్లడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment