ఆమె కన్నా అతడే ‘వీక్’!
ఆమె కన్నా అతడే ‘వీక్’!
మనోస్థైర్యం కోల్పోతున్న పురుషులు
ఆత్మహత్య కేసుల్లో మగవారిదే అధికం
దేశంలో పదో వంతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే
స్పష్టం చేస్తున్న ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు
హైదరాబాద్: మహిళలపై అకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) ప్రథమ స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేస్తోన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2013 గణాంకాలు మరో విషయాన్నీ బయటపెట్టాయి. రాష్ట్రంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువ ఉంటున్నాయని పేర్కొంటున్నాయి. మనోస్థైర్యం విషయంలో స్త్రీల కంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సగటున రోజుకు 40 ఉదంతాలతో గత ఏడాదికి సంబంధించి ఆత్మహత్యల సంఖ్యలో రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో నమోదవుతున్న వాటిలో పదో వంతు ఇక్కడివే కావడం ఆందోళన కలిగించే అంశం. అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే పురుషులు కష్టాలు ఎదురవగానే మాత్రం డీలాపడిపోతున్నారని.. అర్ధంతరంగా జీవితాలు ముగించడానికే మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా 1,34,799 ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కగా.. వీటిలో 14,607 రాష్ట్రానికి సంబంధించినవే. ప్రథమ స్థానంలో తమిళనాడు (16,927), ద్వితీయ స్థానంలో మహారాష్ట్ర (16,112) ఉండగా.. తరవాతి స్థానం ఏపీదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆత్మహత్య ఉదంతాల్లో 9,902 మంది పురుషులు, 4,705 మంది స్త్రీలు అసువులు బాశారు. 2013లో దేశ వ్యాప్తంగా 1,34,799 మంది ఆత్యహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పురుషులు 90,543 మంది ఉండగా.. స్త్రీలు 44,256 మంది ఉన్నారు.
అంటే మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమౌతోంది. వీరిలోనూ 30 - 44 ఏళ్ల మధ్య ఉన్న నడివయస్కులే 32,099 మంది వరకు ఉన్నారు. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా దోహదం చేస్తున్నాయని.. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 24 శాతం ఈ కారణాల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 2012లో 14,238 ఆత్మహత్యలు జరగ్గా.. గత ఏడాదికి ఆ సంఖ్య 2.6 శాతం పెరిగి 14,607కు చేరింది. 2013లో రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు వయస్సున్న పసివాళ్లు కూడా 149 మంది బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగించే అంశం.
ఆత్మహత్యలకు సంబంధించి 2011లో 11.1 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2013 నాటికి మూడో స్థానానికి ఎగబాకింది. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలకు సంబంధించి రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో చోటు చేసుకున్న బలవన్మరణాల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో జరిగిన ఉదంతాలే ఎక్కువ.వివాహం కావట్లేదనే కారణంతో ఉమ్మడి రాష్ట్రంలో 134 మంది (56 మంది యువకులు, 78 మంది యువతులు), సంతానం కలగట్లేదనే ఉద్దేశంతో 105 మంది (38 మంది పురుషులు, 67 మంది మహిళలు) బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక, నివారణ సాధ్యం కాని రోగాల కారణంగా మరో 210 మంది ఆత్మహత్య చేసుకోగా.. వీరిలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు.రాష్ట్రంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 0.7 శాతం మాత్రమే వరకట్న వేధింపుల వల్ల జరిగాయి. మాదకద్రవ్యాలకు బానిసై 282 మంది, పరీక్ష తప్పామనే కారణంగా మరో 235 మంది బలవన్మరణాలకు ఒడిగట్టారు.