
పంచుకోండి దించుకోండి
ఆత్మహత్య చేసుకోవడం అంటే సమస్యను పరిష్కరించుకోవడం కాదు, ఒక ‘జీవిత’ అవకాశాన్ని వృథా చేయడం. ఇది ఏటేటా పెరగడం ఒక సమస్య అయితే, ఆత్మహత్యలు చేసుకునే వారిలో మగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం మరో సమస్య!
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి పది లక్షలమంది ఆత్మహత్య చేసుకుంటుంటే, వాటిలో మన దేశ వాటా లక్షన్నర దాకా ఉంది. ఇందులో పురుషుల సంఖ్య బాగా ఎక్కువ. అందునా మధ్యవయస్కులు ఇంకా ఎక్కువ. 30 ఏళ్లలోపు మగవాళ్లు ఆత్మహత్య చేసుకోవడానికి నిరుద్యోగం, పేదరికం, పరీక్షల్లో పరాజయం ప్రధాన కారణాలు అయితే... 30 సంవత్సరాలు దాటి ఇంటి బాధ్యతలు చూస్తున్న పురుషుల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ప్రధాన కారణాలవుతున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి.) ప్రకారం రోజుకు 129 మహిళలు ఆత్మహత్య చేసుకుంటుండగా, పురుషుల సంఖ్య దీనికి దాదాపు రెట్టింపు. ఏడాదికి 242 మంది పురుషులు (తాజా లెక్కల ప్రకారం) ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం గత సంవత్సరం 79,773 మగాళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్త్రీల సంఖ్య ఇందులో దాదాపు సగం... అంటే 40,715. మగాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయి.
సమస్యలను ఇతరులతో చెప్పుకుని బరువు దించుకోవడాన్ని అవమానంగా ఫీలవడం మగాళ్లలో కాస్త ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత విషయాలను స్త్రీలు ఇతరులతో చర్చించినంత సులువుగా పురుషులు చర్చించలేరు.
ఏడుపు మనసును తేలికచేసేదే. దానికి అవమానంగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏడవడానికి నామోషీగా ఫీలవ్వాల్సిన పని లేదు. అంతేకాదు.. బాధ సమాజానికి సంబంధించినది కాదు, మన మనసుకు, మన దేహానికి సంబంధించినది. దాన్ని తొక్కిపెట్టకండి. ఆత్మహత్య ఆలోచనలు మిమ్మల్ని కమ్మేసినపుడు మీ అంతట మీకు మంచి పరిష్కారాలు దొరక్కపోవచ్చు. కనీసం సన్నిహితులతో పంచుకోండి. వాళ్లు మీ సమస్యను పరిష్కరించవచ్చు. లేదంటే... కనీసం మనసు తేలికపడుతుంది కదా!
తెలుసుకోవల్సిన మూడు విషయాలు...
1. నువ్వు ఎలా ఉన్నా నీలో లోపాలు వెతికేవాళ్లుంటారు.
2. జీవితంలో ఒకసారి జీరో నుంచి మొదలై ఇక్కడి దాకా వచ్చిన వాళ్లకి, ఆ పని ఇంకోసారి చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
3. జీవితంలో 40-50 ఏళ్ల తర్వాత గొప్ప గొప్ప సంస్థలు పెట్టినవారు, గొప్ప విజయాలు సాధించిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి, తొందరపడి నడి వయసులోనే జీవితాన్ని అంతం చేసుకోకండి. విజయానికి తలుపులు ఎప్పటికీ తెరచే ఉంటాయి.