పింప్రి, న్యూస్‌లైన్: దేశంలో గత సంవత్సరం 1.34 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడగా, వీరిలో అత్యధికులు మహారాష్ట్రవాసులే కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. నిరాశ, నిస్పృహ, కుటుంబ కలహాల కారణంగానే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతునట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సామాజిక నిపుణులను అన్నింటి కంటే ఎక్కువ బాధకు గురి చేస్తున్న విషయం ఏమంటే... పరీక్షలలో ఉత్తీర్ణత చెందని/చెందిన విద్యార్థుల్లోనూ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండడం. గత సంవత్సరం వీరి సంఖ్య 2,500 మందికిపైగానే ఉంది. ఏటా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉందని ఎన్సీఆర్బీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
2013లో దేశవ్యాప్తంగా సంభవించిన నేరాలు, ఆత్మహత్యలు, ప్రమాదాల వివరాలను ఈ సంస్థ ఇటీవల వెల్లడించింది. గత సంవత్సరం దేశంలో మొత్తం 1,43,799 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీరిలో అత్యధికులే పురుషులేనని తేలింది. అత్యధికంగా మహారాష్ట్రలో 16,622 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయంలో 2011,12 సంవత్సరాల్లో మహారాష్ట్ర రెండోస్థానంలో ఉండగా, 2013లో మొదటిస్థానానికి రావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో ఈ విషయంపై ప్రభుత్వం, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, ప్రస్తుతం వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు.
అత్యధికంగా ఆత్మహత్యలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు (16,500 మంది) రెండు, ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉంది. మొత్తం ఆత్మహత్యల సంఖ్యలో ఈ మూడు రాష్ట్రాల నుంచే 34 శాతం నమోదయ్యాయి. కుటుంబం కలహాల కారణంగా 24 శాతం, జీవితంపై విరక్తితో 19.6 శాతం ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ నివేదిక విశ్లేషించింది. ప్రతిరోజు దాదాపు 250 మంది పరుషులు, 121 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపింది.
దేశంలో నానాటికి పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించడానికి ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ర్యాంకుల విధానాన్ని రద్దు చేశాయి. అయినప్పటికీ పరీక్షల్లో విఫలమయ్యే విద్యార్థుల్లో గత సంవత్సరం 2,471 మంది ఆత్మహత్య చేసుకోగా, 2012 సంవత్సరంలో వీరి సంఖ్య 2,246కు చేరింది. ప్రేమ విఫలం, మనసుపడ్డ వారితో విభేదాలు తదితర కారణాల వల్ల 4,500 మంది ఆత్మహత్య చేసుకోగా, ఇందులో అత్యధికులు యువతేనని తేలింది. నిరుద్యోగం కారణంగా రెండు వేల మంది రాష్ట్రవాసులు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
అయితే ఇవన్నీ పోలీసులు అందజేసిన గణాంకాలేనని, వివరాలు నమోదు కానివి ఆత్మహత్యలు మరెన్నో ఉంటాయని సామాజిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు అన్నారు. యువత , విద్యార్థులు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చని ఆయన అన్నారు. వ్యవసాయ సంక్షోభం వల్ల విదర్భ ప్రాంతం ఆత్మహత్యలకు నిలయంగా మారింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం అన్నదాతల ఆత్మహత్యల్లోనూ మహారాష్ట్రది మొదటిస్థానం. గత ఏడాది మొత్తం 3,146 మంది ప్రాణాలు తీసుకున్నారు. 1995 నుంచి గత ఏడాది వరకు 60,768 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది.
చోరీల్లోనూ ఫస్టే
చోరీ కేసుల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహరాష్ట్ర ముందంజలో ఉంది. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల మేరకు.. 2013లో రాష్ట్రవ్యాప్తంగా రూ.4,315 కోట్ల విలువైన, ముంబైలో రూ.1,637 కోట్లు, పుణేలో రూ.237 కోట్లు, నాగ్‌పూర్‌లో 192 కోట్లు, ఔరంగాబాద్‌లో రూ.44 కోట్లు, నాసిక్‌లో రూ.34 కోట్ల విలువజేసే వస్తువులు చోరికి గురయ్యాయి. ఇతర నగరాలతో పోల్చినా, ముంబై కూడా చోరీల కేసుల్లో తొలిస్థానంలో నిలిచినట్లు ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక్కడ కూడా గత ఏడాది రూ.1,637 కోట్ల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. మెట్రో నగరాల జనాభా కూడా క్రమేపీ పెరుగుతూనే ఉండడంతో నేరాల రేటు కూడా ఇదే రేటులో పెరుగుతోందని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ వ్యాపార, వాణిజ్య అవకాశాలు ఎక్కువగా కాబట్టి చాలా మంది మెట్రోలకు వలస వస్తుంటారు. అందుకే దొంగతనాలు కూడా అధికంగా జరుగుతున్నాయి.
ఎన్‌సీఆర్‌బీ గణాంకాల గురించి రాష్ట్ర పోలీసుశాఖ స్పెషల్ ఐజీ (శాంతి భద్రతలు) దేవెన్ భారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముంబై లాంటి మహా నగరాల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువ. దీంతో సులభంగా డబ్బు సంపాదించడానికి కొందరు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌కు అలవాటు పడుతున్నారు. వలస వస్తున్నవారిలో కొందరు బృందాలుగా ఏర్పడి చోరీలు, నేరాలకు పాల్పడుతున్నారు’ అని వివరించారు. మెట్రో నగరాల్లో ద్విచక్ర వాహనాల చోరీలతోపాటు చైన్ స్నాచింగుల కేసులు గణనీయంగానమోదవుతున్నాయి. పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేసి నేరగాళ్ల బృందాలను పట్టుకోవాలని ముంబైకర్లు కోరుకుంటున్నారు. ఈ బృందాలు రోజుకో వినూత్న పద్దతిలో చోరీలకు పాల్పడుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తలుపు తడతారు.
సేల్స్‌మేన్‌గా చెప్పుకుంటూ లోపలికి ప్రవేశించి చోరీలు, దోపిడీలకు పాల్పడుతుంటారు. ట్రాఫిక్ జంక్షన్లలో కార్లను నిలిపి బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడుతుంటారని భారతి చెప్పారు. బాగా రద్దీ చోట్ల కూడా వీళ్లు చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతుండడం విశేషం. తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు గట్టి నిఘా ఉంచడం లేదని వాదనలు ఉన్నాయి. నేర చరిత్ర కలిగిన చోరులను కఠినంగా శిక్షిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుందని పరేల్‌వాసి ఒకరు అన్నారు. ఇళ్లలో నౌకర్లు, డ్రైవర్లను నియమించే ముందు వారి నేపథ్యం తనిఖీ చేయాలని సూచించారు.
కొందరు నేరగాళ్లు నౌకర్లుగా ఇంట్లో ప్రవేశించి నేరాలకు పాల్పడిన ఘటనలు ముంబై, ఢిల్లీలో చాలా జరిగాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు. ‘హౌసింగ్ సొసైటీలు తమ అపార్టుమెంట్లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి. సీసీటీవీలను అమర్చడం తప్పనిసరి. అంతేకాకుండా చోరులు అవలంభిస్తున్న తీరుతెన్నుల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాం. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం’ అని భారతి వివరించారు.
ఆత్మహత్యల అలజడి
Published Tue, Jul 15 2014 11:13 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement