పరిచయస్తులతోనే మహిళలకు ముప్పు
రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఇరుగుపొరుగు వాళ్లు, పరిచయస్తులే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
2015లో లైంగికదాడి బాధితులు చేసిన ఫిర్యాదుల్లో 50 శాతమందికి పైగా నిందితుల్లో ఇరుగుపొరుగువారే ఉన్నారు. ఇక గతేడాది నమోదైన మొత్తం లైంగిక దాడి కేసుల్లో 95 శాతం మంది నిందితులు పరిచయస్తులే కావడం విస్తుగొలిపే విషయం. దేశ రాజధాని ఢిల్లీ సహా హిమచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, చండీగఢ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచే రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో మామ, తండ్రి, ఇతర మగవాళ్ల వేధింపులకు బలైన మహిళలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఓ మహిళా కార్యకర్త చెప్పారు. ఇక యుక్తవయసులో ఉన్న మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలియడం లేదని డీపీఎస్ బొకరా డైరెక్టర్ హేమలతా ఎస్ మోహన్ తెలిపారు.
'కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాల్లో పిల్లలకు చైతన్యం కలిగించడం లేదు. స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది' అని హేమలత చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో తండ్రి నుంచే అక్కాచెల్లెల్లకు వందలసార్లు వేధింపులు ఎదురయ్యాయి. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని తల్లి కూతుళ్లను వారించింది. చివరకు మహిళా కమిషన్ చొరవతో ఈ విషయం వెలుగుచూసింది.