సాక్షి, ముంబై: నగరంలో బాలనేరస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ విషయం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ద్వారా వెల్లడైంది. మూడేళ్ల నుంచి బాల నేరస్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని బ్యూరో దర్యాప్తు అధికారులు, నిపుణులు తెలిపారు. చైన్ స్నాచింగ్, లోకల్ రైళ్లలో మహిళలు, యువతుల బ్యాగులు లాక్కోవడం, అమాయకంగా కనిపించే యువకులను కొట్టి దోచుకోవడం తదితర నేరాలకు పాల్పడుతున్నారని వారు స్పష్టం చేశారు. చట్టాల గురించి అవగాహన లేకపోవడంతో వారు భయం లేకుండా నేరాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల సిద్ధివినాయక్ మందిరానికి దర్శనం కోసం వచ్చిన భక్తులను దోచుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సుమారు 53 మంది మైనర్లను, యువకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా పలు సంఘటనలు వెలుగులోకి రావడంతో బాల నేరాల అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. 2012 సంవత్సరంలో ముంబైలో ప్రతిరోజూ కనీసం ఇద్దరు బాలనేరస్తులపై ఒక పెద్ద నేరం కేసు నమోదైందని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. ఎన్‌సీఆర్‌బీ తెలిపిన వివరాల ప్రకారం... 2011తో పోలిస్తే 2012లో ముంబైలో బాల నేరాల సంఖ్య 33.9 శాతం పెరిగాయి.
ఇక దేశంలో 2012లో 23.87 లక్షల కేసులు నమోదయ్యాయి. వాటిలో ప్రధాన నిందితులుగా మైనర్లే ఉన్నారు. మైనర్ నేరస్తుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఆ తర్వాత 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న బాల నేరస్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ వయసు నేరస్తుల సంఖ్య ముంబైలో 18.6 శాతం పెరిగింది. ఇక రాష్ట్రంలో 7.9 శాతం పెరిగింది. దర్యాప్తు అధికారి, నిపుణుల అభిప్రాయం మేరకు... డబ్బు ఆశ, చట్టాల గురించి అవగాహన లేకపోవడం, వాటిపై భయం లేకపోవడం వల్ల బాల నేరస్తుల సంఖ్య పెరుగుతోంది.కాగా మైనర్లకు పెద్ద నేరాలపై శిక్షలో మినహాయింపు ఉంటుంది. దీంతో వారు భయం లేకుండా రెచ్చిపోతున్నారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మైనర్లలో పెరుగుతున్న నేరప్రవృత్తి
Published Wed, Sep 11 2013 12:46 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement