
స్వతహాగా నేను తెలివైనవాణ్ణే కానీ...
'స్వతహాగా నేను తెలివైనవాన్నే. కానీ ఈ విద్యావ్యవస్థ నన్ను నాశసనం చేసింది'- ఓ కుర్రాడు వేసుకున్న టీ-షర్టుపై ఉన్న కొటేషన్ ఇది. వర్తమాన సమాజంలో విద్యావ్యవస్థ తీరు చూస్తే ఈ మాట నిజమేననిపిస్తోంది. మార్కెట్ అవసరాలు తీర్చే మానవ వనరులను తయారుచేసే కార్మాగారాలుగా విద్యాలయాలు మారిపోతున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్టూడెంట్ సర్వోతోముఖాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే చదువులు అంజనం వేసి వెతికినా దొరికే పరిస్థితి కనిపించడం లేదిప్పుడు. డబ్బు సంపాదించే యంత్రాల్లా విద్యార్థులను తయారుచేస్తున్న పాఠశాలలే ఎక్కువయ్యాయి.
'వికాసం మిథ్య- లాభార్జనే ధ్యేయం'గా ఇటువంటి స్కూల్స్ నడుస్తున్నాయి. తమ లక్ష్యాలను నెరవేర్చకునేందుకు విద్యార్థులపై బలవంతపు చదువులు రుద్దుతున్నాయి. ఇష్టంలేని పాఠాలు వల్లించలేక, తల్లిదండ్రుల ఆశలు మోయలేక ఒత్తిడికి గురై విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలవుతున్నారు. అవమానభారంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు ఏడుగురు విద్యార్థులు ఇదే కారణంతో ఆత్మహత్యకు పాల్పతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.
పరీక్ష తప్పడంతో 2013లో దేశంలో 2,471 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని జాతీయ నేరాల నమోదు విభాగం తాజా నివేదిక వెల్లడించింది. 2012లో ఈ సంఖ్య 2,246గా ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఆత్మహత్యల్లో సగటున విద్యార్థుల సంఖ్యే 6.2 శాతంగా ఉండడం విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. విద్యార్థుల మోధో వికాసానికి దోహదం చేయాల్సిన విద్య వారి పాలిట వరంగా మారేవరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.