సైబర్ క్రైంలో ‘ఉద్యాన నగరి’ టాప్ | Cyber Crime 'udyana Nagari' to the top | Sakshi
Sakshi News home page

సైబర్ క్రైంలో ‘ఉద్యాన నగరి’ టాప్

Published Mon, Nov 17 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

సైబర్ క్రైంలో ‘ఉద్యాన నగరి’ టాప్

సైబర్ క్రైంలో ‘ఉద్యాన నగరి’ టాప్

గార్డెన్ సిటీ, భారత సిలికాన్ సిటీ, ఐటీహబ్ ఇలా ఎన్నో పేర్లతో ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నగరం ఇప్పుడు సైబర్ క్రైమ్ సిటి పేరును సైతం తన ఖాతాలో వేసుకుంది. ఐటీహబ్‌గా ఉన్న బెంగళూరు నగరం సైబర్ క్రైమ్‌కు సైతం వేదికగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2013 ఏడాదికి గాను బెంగళూరు నగరం సైబర్ క్రైమ్‌లో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది. సైబర్ క్రైమ్‌లో బాధితులు ఎక్కువమంది అమ్మాయిలేనన్న అంశం మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశం.                                      - సాక్షి, బెంగళూరు
 
     
* 2013లో ఒక్క బెంగళూరు నగరంలోనే 399 కేసులు              
* దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో కర్ణాటక            
* బాధితులు ఎక్కువ శాతం అమ్మాయిలే !
* సైబర్ నేరాల్లో ఉద్యాన నగరి టాప్.......
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2013 గణాం కాల ప్రకారం సైబర్ నేరాల్లో దేశంలోనే బెంగళూరు న గరం ప్రథమ స్థానంలో ఉంది. 2013లో ఒక్క బెంగళూరు నగరంలోనే 399 సైబర్ క్రైమ్ కేసులు న మోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 173 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 159 కేసులు నమోదయ్యాయి. పూణె నగరంలో సైబర్ నేరాల సంఖ్య 97గా నమోదు కాగా కోల్‌కత్తాలో 84 కేసులు, ఇక దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో 40 కేసులు నమోదయ్యాయి.
 
దేశంలోనే కర్ణాటక మూడో స్థానంలో...
ఇక రాష్ట్రాల వారీ లెక్కలను పరిశీలిస్తే సైబర్ నేరాల్లో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండగా, మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. 2013 ఏడాదికి గాను మహారాష్ట్రలో 681 సైబర్ కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) రాష్ట్రంలో 635 కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో 513 కేసులు నమోదయ్యాయి. ఇక తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (372), కేరళ (349) రాష్ట్రాలున్నాయి.
 
అపరిచితులను అంగీకరించొద్దు....
ప్రస్తుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తున్న వారు తమకెంత మంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే, అంత గొప్ప అన్న భావనలో ఉంటున్నారు. అందుకే ఎవరు రిక్వెస్ట్ పంపినా, వాటిని యాక్సెప్ట్ చేసి స్నేహానికి పచ్చజెండా ఊపేస్తున్నారు. దీని వల్ల రానురాను అనేక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలే ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో తప్పుడు సమాచారంతోనే చాలా మంది నెటిజన్‌లుగా మారుతున్నారు.

ఈ విషయాన్ని గమనించని చాలా మంది అమ్మాయిలు వారితో ఆన్‌లైన్ స్నేహం చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు అనంతరం వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీన్ని అరికట్టాలంటే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో మనతో బాగా పరిచయం ఉన్న వారి రిక్వెస్ట్‌లనే అంగీకరించి, ఏ విషయాలనైనా వారితో మాత్రమే షేర్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండడానికి వీలవుతుంది.
 
కుటుంబాల్లో చిచ్చు....
ఎప్పుడో కొన్నేళ్ల కిందట విడిపోయిన వారిని కలిపేందుకు ఉపయోగపడుతున్న నెట్‌వర్కింగ్ సైట్‌లు, కుటుంబాల్లో చిచ్చు రగలడానికీ కారణమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో చాలా మంది అమ్మాయిలు, గృహిణులు కాలేజీ రోజుల్లో తమ జీవితాల్లో జరిగిన ప్రేమ వ్యవహారాలు, ఇంట్లో భర్తతో ఉన్న విభేదాలు వంటి వాటిని షేర్ చేసుకుంటూ, అందుకు సంబంధించిన ఫొటోలను సైతం పోస్ట్ చేస్తుం డటంతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు కొన్ని కుటుంబాల్లో కలహాలకు దారితీస్తున్నాయి. తమ స్నేహితులు మాత్రమే చూస్తున్నారని భావిస్తూ అమ్మాయిలు పంపిస్తున్న పోస్టింగ్ లు, సైబర్ నేరగాళ్ల చేతిలో పడి ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
 
జాగ్రత్తలు తప్పనిసరి....
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఉపయోగించేటపుడు కాస్తంత జాగ్రత్తలు తప్పనిసరి అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో యువత, ముఖ్యంగా అమ్మాయిలు వీటి పట్ల మరింత అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. సాధారణ విషయాలు, ఎవరితో షేర్ చేసుకున్నా పరవాలేదు అనిపించే సంఘటనలను మాత్రమే సోషల్ నెట్‌వ ర్కింగ్ సైట్‌లలో షేర్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సెక్యూరిటీ ఆప్షన్స్ కలిగిఉన్న సైట్‌లను వినియోగించడం వల్ల సైబర్ నేరాల్లో చిక్కుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
 
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఏర్పడిన పరిచయాల కారణంగా అమ్మాయిలు ఎలా ఉచ్చులో చిక్కుకుంటున్నారో తెలిపేందుకు ఉడిపిలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...ఉడిపిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి కేరళకు చెందిన హరీష్ (23) అనే వ్యక్తితో ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విద్యార్థినిని కలిసేందుకు హరీష్ గత శుక్రవారం ఉడిపి నగరానికి వచ్చాడు. అక్కడ హరీష్‌ని కలిసిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను హరియడ్క సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అటవీ ప్రాంతంలో విద్యార్థిని అరుపులు విన్న కొంతమంది గిరిజనులు ఆ ప్రాంతానికి చేరుకొని విద్యార్థినిని రక్షించి, నిందితుడు హరీష్‌ని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement