
న్యూఢిల్లీ: దేశంలో 2017–19 సంవత్సరాల మధ్య 14–18 ఏళ్ల వయస్సున్న బాలలు 24 వేల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులోని 4 వేల కేసులకు పరీక్షల్లో ఫెయిల్ కావడమే ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ క్రైం రికార్డ్స్‌బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదికను ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించింది. 2017–19 సంవత్సరాల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన 24,568 మంది 14–18 ఏళ్ల గ్రూపులో 13,325 మంది బాలికలున్నట్లు ఆ డేటా పేర్కొంది. ఈ గ్రూపులో.. 2017లో 8,029 మంది, 2018లో 8,162 మంది చనిపోగా 2019 నాటికి వీరి సంఖ్య 8,377కు పెరిగింది.
ఈ కాలంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,115 మంది తనువు చాలించగా బెంగాల్‌లో 2,802 మంది, మహారాష్ట్రలో 2,527 మంది, తమిళనాడులో 2,035 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రధానంగా పరీక్షల్లో ఫెయిలవ్వడం కారణంగా 4,046 మంది, వివాహ సంబంధ విషయాలతో 639 మంది చనిపోగా వీరిలో 411 మంది బాలికలున్నారు. ప్రేమ వైఫల్యంతో 3,315 మంది, అనారోగ్యంతో 2,567 మంది, భౌతిక దాడుల కారణంగా 81 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, ఆత్మీయులను కోల్పోవడం, మద్యం, డ్రగ్స్ వ్యసనం, అక్రమ గర్భం, మనస్తాపం, నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలు కూడా ఉన్నట్లు ఆ డేటా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment