NCRB report
-
శాంతికి భద్రత.. నేరానికి శిక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. హత్యలు, హింసాత్మక ఘటనలు, అవినీతి కేసులు బాగా తగ్గుముఖం పట్టడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు తగ్గుతున్నాయని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2022లో దేశంలో వివిధ నేరాల గణాంకాలను వెల్లడిస్తూ ఎన్సీఆర్బీ తాజా నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల నేరాలు తగ్గడంతోపాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ తాజా నివేదికలోని అంశాలు సంగ్రహంగా.. అన్ని రకాల నేరాల తగ్గుదల రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు తగ్గాయి. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు ప్రత్యేక స్థానిక చట్టాల కింద (స్పెషల్ లోకల్ లాస్ – ఎస్ఎల్ఎల్) నమోదు చేసే (ట్రాఫిక్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన వంటివి) కేసులు కూడా తగ్గడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2022లో రాష్ట్రంలో మొత్తం 1,95,284 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐపీసీ సెక్షన్ల కేసులు 1,56,503, ఎస్ఎల్ఎల్ కేసులు 36,737 ఉన్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఐపీసీ నేరాలు 11.72 శాతం, ఎస్ఎల్ఎల్ నేరాలు 13.73 శాతం తగ్గాయి. వెరసి రాష్ట్రం మొత్తం మీద 12.11 శాతం కేసులు తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడేవారికి న్యాయస్థానం ద్వారా శిక్షలు విధించేలా పర్యవేక్షించడంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అందుకోసం సత్వరం చార్జిషీట్లు దాఖలు చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. 2022లో ఐపీసీ కేసుల్లో 86.5 శాతం, ఎస్ఎల్ఎల్ కేసుల్లో 96.4 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధి 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం మీద 88.9 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధిలో చార్జిషీట్లు దాఖలు చేసింది. తగ్గిన హత్యలు అసాంఘిక శక్తుల ఆటకట్టించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో హత్యలు తగ్గడమే అందుకు నిదర్శనం. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా.. ఆ సంఖ్య 2022లో 925కి తగ్గింది. హత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల్లో మూడుశాతనికిపైగా ఉండగా.. తెలంగాణలో 2.5 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7 శాతం మాత్రమే. హత్యకేసుల్లో దేశంలో టాప్–20 రాష్ట్రాల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. ఘర్ణణలు, అల్లర్ల కట్టడి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అల్లరిమూకలు చేసే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేస్తోంది. ఘర్షణలు, అల్లర్ల కేసులు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 444 ఘర్షణలు, అల్లర్ల కేసులు నమోదు కాగా 2022లో వాటి సంఖ్య 304కు తగ్గడం శాంతిభద్రతల పరిరణక్షలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వెల్లడిస్తోంది. అత్యాచారాలు 47.72 శాతం తగ్గుదల, వరకట్న వేధింపుల కట్టడి దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలినిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం దీనికి నిదర్శనం. 2021లో రాష్ట్రంలో 1,188 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో 621 కేసులు నమోదయ్యాయి. అత్యాచారాల కేసులు దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలో 47.72 శాతం తగ్గడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక 2021లో రాష్ట్రంలో 111 వరకట్న కేసులు నమోదు కాగా 2022లో వందకు తగ్గాయి. వరకట్న కేసుల రేటు కేవలం 0.4 శాతానికే పరిమితమైంది. ఇక యాసిడ్ దాడుల కేసులు 2021లో ఏడు నమోదు కాగా 2022కు అవి నాలుగుకు తగ్గాయి. తగ్గిన రైతుల ఆత్మహత్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది. రైతు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విజయవంతమవుతున్నాయి. సాగు లాభసాటిగా మారడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది, కౌలురైతులు 122 మంది ఉన్నారు. 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369కి తగ్గాయి. వారిలో భూయజమానులైన రైతులు 309 మంది, కౌలురైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కి తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో ఆ సంఖ్య 917కు తగ్గింది. -
దేశంలో ప్రతి రోజు ఎంత మంది కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసా?
ఢిల్లీ: రైతులు, రోజువారి కూలీల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) సంచలన విషయాలను బయటపెట్టింది. దేశంలో ప్రతి రోజు 154 మంది రైతులు, రోజువారి కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో కుటుంబ సమస్యలు, అనారోగ్యం వల్లే అత్యధికంగా మరణిస్తున్నారని వెల్లడించింది. 2021లో ఈ సంఖ్య 144గా ఉంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో పనిచేసేవారు 6.6 శాతం కాగా.. రోజువారి కూలీలు 26.4 శాతం మేర ఉన్నారు. అంటే 2022 ఏడాదికి మొత్తం 1,70,924 మంది ఆత్మహత్య చేసుకోగా.. అందులో రోజువారి కూలీలే 44,713 మంది ఉన్నారు. ఇందులో మగవారి సంఖ్య 41,433 కాగా స్త్రీల సంఖ్య 3,752గా ఉంది. 2021లో ఆత్మహత్య చేసుకున్న రోజువారి కూలీలు 25.6 శాతంగా ఉన్నారు. 2022 నివేదిక ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న స్వయం ఉపాధి, వృత్తి నిపుణులు 9.6 శాతంగా ఉన్నారు. ఇందులో 14,395 మంది ఉద్యోగులు కాగా , 18,357 మంది స్వయం ఉపాధి వ్యక్తులు బాధితులుగా నమోదయ్యారు. 2022 ఏడాదికి మొత్తం ఆత్మహత్యల్లో నిరుద్యోగులు 9.2 శాతంగా ఉన్నారు. ఇందులో 12000 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022 సంవత్సరానికి దేశంలో మొత్తం 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1,64,033గా ఉంది. 2021తో పోల్చితే 2022లో దాదాపు 4% మేరకు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు(7,8776) మహారాష్ట్ర(6,275), మధ్యప్రదేశ్(5,371) తెలంగాణ(4,513) ముందు వరుసలో నిలిచాయి. ఇదీ చదవండి: National Crime Records Bureau: అయినా భర్త మారలేదు -
నేర నిలయాలు!
ఒక సమాజ నాగరికత స్థాయిని అంచనా వేయాలంటే అక్కడున్న జైళ్లను ముందుగా చూడాలన్నాడు విశ్వవిఖ్యాత రచయిత ఫ్యూదోర్ డాస్టోవిస్కీ. దాన్నే గీటురాయిగా తీసుకుంటే అన్ని వ్యవస్థలూ సిగ్గు పడాల్సిందే. మన దేశంలో జైళ్ల స్థితిగతుల గురించి ఏటా జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించే అంశాలు కంగారు పుట్టిస్తుంటాయి. ఇతర జైళ్ల సంగతలావుంచి దేశంలోనే అతి పెద్దదయిన తిహార్ జైలు గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఈ జైలు దేశంలో మాత్రమే కాదు...దక్షిణాసియా దేశాల్లోనే అతి పెద్దది. అలాంటిచోట నెలరోజుల వ్యవధిలో రెండో హత్య జరిగిందంటే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. గత నెల 14న రౌడీ షీటర్, ఒక హత్య కేసు ముద్దాయి అయిన ప్రిన్స్ తెవాతియా అనే యువకుణ్ణి అతని ప్రత్యర్థి వర్గం హతమార్చింది. రెండూ వర్గాలూ పదునైన ఆయుధాలతో దాడి చేసుకోవటంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకడైన తెవాతియా మరణించాడు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ, గతవారం టిల్లూ తాజ్‌పురియా అనే గూండాను ప్రత్యర్థివర్గం దాడిచేసి మట్టుబెట్టింది. నిరుడు ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన గూండా జితేందర్ గోగి మరణానికి టిల్లూ తిహార్ జైలునుంచే పథక రచన చేశాడని అప్పట్లో అధికారుల దర్యాప్తులో తేలింది. జైళ్లను సంస్కరణాలయాలుగా ఎంత చెప్పుకున్నా అందుకు అనుగుణమైన చర్యలు అంతంతమాత్రమే. ఏ నేరమూ చేయకుండానే కేసుల్లో ఇరుక్కుని వచ్చే అమాయకులతోపాటు రకరకాల నేరాలు చేసి అక్కడికొచ్చేవారు కూడా అధికంగా ఉంటారు జైళ్లలో పర్యవేక్షణ అంత సులభం కాదు. అందునా తిహార్ జైలు రాజకీయ నాయకులకూ, గూండాలకూ, కరడుగట్టిన నేరగాళ్లకూ, చిల్లర నేరగాళ్లకూ నిలయం. అక్కడ పరిస్థితి చేయిదాటిందంటే ఎంతటి ప్రమాదమైనా చోటుచేసుకోవచ్చు. అయితే సమస్య ఉందని గుర్తించి నపుడు దానికి తగిన పరిష్కారం వెదకాలి. ఎక్కడో ఒకచోట ఆ సమస్యకు అడ్డుకట్ట పడాలి. కానీ అది ఎవరికీ పట్టినట్టు లేదు. ఫలితంగా జైల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం, చంపుకోవటం, బయటనున్న ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి పథక రచన చేయటం యధేచ్ఛగా సాగిపోతోంది. మరీ ఘోరం జరిగితే తప్ప అన్నీ బయటకు రావు. తిహార్ జైలు 400 ఎకరాల విస్తీర్ణంలో 9 జైళ్లుగా ఉంటుంది. అక్కడ 10,026మందిని ఖైదు చేయ టానికి వీలుండగా, అంతకు రెట్టింపు మంది ఉంటారు. ఆ జైల్లో అత్యధికంగా ఉండేది ఉత్తరాదివారు గనుక జైలు భద్రతను తమిళనాడు స్పెషల్ పోలీస్(టీఎన్‌ఎస్‌పీ)కి అప్పగించారు. ఆ విభాగంనుంచి దాదాపు వేయిమంది సిబ్బంది తిహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారితోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే ఎదర్కొనడానికి ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీస్(ఐటీబీపీ) సన్నద్ధంగా ఉంటుంది. కానీ టిల్లూను ప్రత్యర్థివర్గం కొట్టిచంపినప్పుడు అందరూ ప్రేక్షకపాత్ర వహించారని సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. ఇప్పటికైతే ఏడుగురు టీఎన్‌ఎస్‌పీ అధికారులను సస్పెండ్ చేశారు. ఇందువల్ల అంతా మారిపోతుందనుకోవటం అత్యాశే. నిజానికి కొన్ని దేశాల జైళ్లతో పోలిస్తే మన జైళ్లు మరీ అంత కిక్కిరిసినట్టు భావించనక్కరలేదని కొందరి వాదన. అది నిజమే కావొచ్చు గానీ...మన జైళ్లు కూడా రకరకాల కారణాలతో పరిమితికి మించిన ఖైదీలతోనే నిండి ఉంటున్నాయి. జైళ్లలో ఉండేవారంతా నేరస్తులు కాదు. అందులో విచారణలో ఉన్న ఖైదీలు కూడా ఉంటారు. చెప్పా లంటే మన ప్రభుత్వాల విధానాల వల్లనో, అలసత్వం వల్లనో ఈ రెండో క్యాటగిరీవారే అధికం. విచారణలో ఉండే ఖైదీల్లో క్షణికావేశంలో ఏదో ఒక తప్పు చేసి కేసుల్లో ఇరుక్కొని వచ్చేవారు ఎక్కువ. అలాగే పల్లెటూళ్లలో పెత్తందార్ల ఆగ్రహానికిగురై అకారణంగా జైలుపాలైనవారూ ఉంటారు. అటువంటివారిని గుర్తించి వెంటవెంటనే విడుదల చేయగలిగితే జైళ్లు ఇంత చేటు కిక్కిరిసిపోయే అవకాశం ఉండదు. ఇలాంటివారిని జైళ్లలో ఉంచటం వల్ల కలిగే మరో అనర్థం ఏమంటే... తప్పు చేయటం పెద్ద నేరమేమీ కాదన్న భావన వారిలో కలిగినా కలగొచ్చు. ఎన్డీటీవీ యాంకర్‌గా పనిచేసిన సునేత్రా చౌదరి ఆరేళ్లక్రితం రాసిన ‘బిహైండ్ బార్స్’ అనే పుస్తకం ఈ సంగతినే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా తిహార్ జైల్లో అడుగడుగునా కనిపించే అవినీతిని, సంపన్నుల ఇంట పుట్టి నేరాల్లో ఇరుక్కొని జైలుకొచ్చేవారికి దక్కే రాచమర్యాదలనూ పుస్తకం వివరిస్తుంది. కిరణ్ బేడీ తిహార్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నకాలంలో అక్కడ సంస్కరణలు చేపట్టినట్టు, అందువల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడేవి. కానీ ఆ తర్వాత అంతా మామూలే. సిబ్బంది కొరత, విచారణలో ఉన్న ఖైదీలకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవటం వంటి కారణాలవల్ల ఖైదీల పర్యవేక్షణ సక్రమంగా ఉండటం లేదు. దీన్ని అధిగమించటం కోసం కొందరు ఖైదీలను పర్యవేక్షకులుగా ఉంచే సంస్కృతి అన్నిచోట్లా కనబడుతోంది. ఇందువల్ల ఏ ఖైదీ మానసిక స్థితి ఎలావుందో, ఎవరికి వైద్య సాయం అవసరమో తెలిసే పరిస్థితి ఉండటం లేదు. జైళ్లలో తగినమంది సిబ్బందిని నియమించటం, అనవసరంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించటం వంటివి చేయగలిగితే మెరుగైన పర్యవేక్షణకు వీలవుతుంది. అప్పుడు ఈ స్థాయిలో నేరగాళ్లు బరి తెగించే అవకాశం ఉండదు. సస్పెన్షన్లు, తొలగింపులు సిబ్బందిలో భయం కలిగిస్తాయన్నది నిజమే కావొచ్చు. కానీ అది తాత్కాలికమే. దానికి బదులు వారిపై పడే అదనపు భారాన్ని వదిలిస్తే సిబ్బంది మెరుగ్గా పనిచేయగలుగుతారు. అప్పుడు జైళ్లు నిజమైన సంస్కరణాలయాలుగా మారతాయి. -
Hyderabad: సాక్ష్యాలు లేక క్లోజవుతున్న కేసులు.. 2021లో ఎన్నో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగింది... ఫిర్యాదు అందింది... కేసు నమోదైంది... అయితే నిందితుడిని పట్టుకోవడానికి అవసరమైన సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నగరంలో అనేక కేసులు మూతపడుతున్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 23.66 శాతం కేసులు 2021లో క్లోజ్ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గత ఏడాది మొత్తమ్మీద 20,142 కేసులు నమోదు కాగా... వీటిలో 4,766 ఈ కారణంగానే మూతపడ్డాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణాన్నే పోలీసు పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్సఫీయంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’ అంటారు. ‘ఇలా మూతపడిన కేసులన్నీ గతేడాదికే సంబంధించినవి కాకపోవచ్చు. అంతకు ముందు సంవత్సరాల్లో రిజిస్టరైనవి కూడా ఉండి ఉంటాయి’ అని నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రెండు చట్టాల కింద కేసులు.. ► సాధారణంగా పోలీసులు రెండు రకాలైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తుంటారు. మొదటిని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అయితే... రెండోది ఎస్ఎల్ఎల్గా పిలిచే స్థానిక చట్టాలు. 2021కి సంబంధించి సిటీలో ఐపీసీ కేసులు 17,951, ఎస్ఎల్ఎల్ కేసులు 2191 నమోదయ్యాయి. వీటిలో 4034, 723 కేసులు ఇలా క్లోజ్ అయినవే. ► మహిళలపై జరిగే నేరాలకు ఇతర కేసుల కంటే ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ కేటగిరీకి చెందిన కేసులూ ఆధారాలు లేక క్లోజ్ అయిపోతున్నాయి. క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది మొత్తం 2755 కేసులు నమోదు కాగా వీటిలో 598 ఇలానే మూతపడ్డాయి. చిన్నారులపై జరిగిన నేరాలు కేసులు 621 రిజిస్టర్ కాగా... 89 ఇలా క్లోజ్ అయ్యాయి. వృద్ధులపై జరిగిన నేరాల సంఖ్య 314గా, మూతపడినవి 101గా ఉన్నాయి. ► షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాలకు సంబధించి 104 కేసులు నమోదు కాగా వీటిలో 34 ఆధారాలు లేక క్లోజ్ అయ్యాయి. షెడ్యూల్ తెగలకు సంబంధించి 28 నమోదు కాగా, 8 ఇలానే మూతపడ్డాయి. ఆర్థిక నేరాల కేసులు 4860 కాగా 1479 ఆధారాలు లభించక మూతపడ్డాయి. సైబర్ నేరాల విషయానికి వస్తే నమోదైన కేసులు 3303, ఇలా మూతపడినవి 1873గా ఉన్నాయి. నగరంలోనే ఎక్కువ.. ► ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకుని, దాడికి పాల్పడిన ఉదంతాలు 2021లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ 20గా ఉండగా... ముంబై 10, ఢిల్లీ 8, బెంగళూరు 7 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రవర్తించడం వంటి ఉదంతాలకు సంబంధించిన కేసుల విషయంలోనూ సిటీ మొదటి స్థానంలో ఉంది. ఈ కేటగిరీకి చెందిన కేసులు నగరంలో 28 రిజిస్టర్ కాగా... ఢిల్లీ 17, కోల్‌కతా 13, బెంగళూరు 10, ముంబై 5 నమోదయ్యాయి. ► వివిధ రకాలైన మోసాలతో కూడిన ఫ్రాడ్స్ కేటగిరీ కేసుల నమోదులోనూ హైదరాబాద్ కమిషనరేట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ కేటగిరీలకు చెందిన 2771 కేసులు నమోదయ్యాయి. ఇతర మెట్రో నగరాలైన జైపూర్, ఢిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరుల్లో వీటి సంఖ్య 1488, 1414, 970, 362గా ఉంది. (క్లిక్: హైదరాబాద్‌లో మరో నేతపై పీడీ యాక్ట్) -
తగ్గిన ప్రమాద మరణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు 2019తో పోలిస్తే 2020లో 18.3 శాతం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యా లు, రహదారి, రైల్వే, ఇతర ప్రమాదాల్లో 2019లో 17,938 మంది మృతిచెందగా, 2020లో ఆ మరణాల సంఖ్య 14,653కి తగ్గింది. మృతుల్లో 12,062 మంది పురుషులు, 2,590 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ప్రమాద మరణాలు–ఆత్మహత్యల నివేదిక–2020ను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసింది. ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రమాదాల్లో మరణించిన వారిలో 30నుంచి 45 ఏళ్ల వయసు వారు అత్యధికంగా 4,624 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గుదల 2019తో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గాయి. 2020లో 17,924 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. 19,675 మంది గాయాల పాలయ్యారు. 7,039 మంది మృతి చెందారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో 7,269 ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా 611 రైలు ప్రమాదాల్లో 613 మంది మరణించారు. అతివేగం.. నిర్లక్ష్యమే కారణం అతి వేగంతో 12,344 ప్రమాదాలు, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల 3,300 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల 414 మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 154, జంతువులను తప్పించబోయి 67 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాలు 20 మాత్రమే ఉన్నాయి. ఇతర కారణాలతో మిగిలిన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
మానవ అక్రమ రవాణా కట్టడి
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా మాఫియాకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసుల నమోదు, అరెస్టుతోపాటు బాధితులను రక్షించడంలోనూ ఏపీ ముందుంటోంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి వారిపై చార్జిషీటు వేయడం దేశంలో సగటున 85.2 శాతం ఉంటే ఏపీలో 99.2 శాతం ఉండటం విశేషం. గడిచిన ఏడాదిలో ఈ తరహా కేసుల్లో ఏకంగా 619 మంది నిందితులను అరెస్టు చేయడం మరో రికార్డు. అలాగే 257 మంది బాధితులను కాపాడారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) కొద్ది రోజుల కిందట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2020లో మొత్తం 1,714 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అయ్యాయి. కేసుల నమోదులో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ వరుస స్థానాల్లో నిలిచాయి. గడిచిన మూడేళ్ల గణాంకాలను గమనిస్తే ఏపీలో గతేడాది మానవ అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పట్టినట్టు తేటతెల్లమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టడం అభినందనీయం. ప్రధానంగా మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మూడు ఏహెచ్‌టీయూలు ఉన్నాయి. మరో పది ఏర్పాటు చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లతో వీటిని అనుసంధానం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులతో మానవ అక్రమ రవాణా మరింత పెరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధితులను కాపాడి, వారి పునరావాసంపై దృష్టి సారిస్తోంది. – ఎన్.రామ్మోహన్, హెల్ప్ సంస్థ డైరెక్టర్ -
విస్తుగొలిపే విషయాలు.. దేశంలో జుడీషియల్, పోలీసు కస్టడీ మరణాలు..
జీవితంలో గడిచిపోయిన ప్రతి క్షణం వెలకట్టలేనిది. ఆ కాలాన్ని తిరిగి ఇవ్వాలంటే.. అది ఎవరి వల్లా కాదు.. అయితే మన దేశంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నిర్దోషులు అనేక మంది ఉన్నారు. ఇంటారాగేషన్ పేరుతో ఒంట్లోని శక్తినంతా లాగేశాక.. చివరికి జీవచ్ఛవాల్లా ఉన్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం పరిపాటి. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పిన విషయాలు దేశంలో జైళ్ల పరిస్థితిని తెలియజేస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 3 సంవత్సరాలలో 348 మంది పోలీసు కస్టడీలో మరణించగా.. 5221 మంది జ్యుడీషియల్ కస్టడీలో మరణించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు కస్టడీలో 23 మంది చనిపోయారని, అదే సమయంలో జ్యుడీషియల్ కస్టడీలో 1295 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీఆర్బీ గణాంకాల్లో చాలా తేడాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గత 10 సంవత్సరాలలో, 1,004 మంది పోలీసుల కస్టడీలో మరణించారు. అందులో 40శాతం మంది సహజంగా లేదా అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 29శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ నివేదికలో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా చనిపోయారా? లేదా పోలీసుల చిత్రహింసల కారణంగానా..? అనేది స్పష్టం చేయలేదు. అలాగే పోలీస్ కస్టడీ మరణాలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల్లో చాలా తేడాలు ఉన్నాయి. నిందుతులు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే..! దీనిపై సామాజిక కార్యకర్త సమీర్ మాట్లాడుతూ.. "ఖైదీలను హింసించడాన్ని వ్యతిరేకిస్తున్న అనేక మంది అధికారులు పోలీసు శాఖలో ఉన్నారు. పోలీసులు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. అందువల్ల న్యాయస్థానాల ద్వారా నేరస్తులను విచారించడానికి చట్టపరమైన నిబంధనలను ఉపయోగిస్తారు. తీహార్ జైలులో ఓ ఖైదీ హత్యకు సంబంధించి డిప్యూటీ జైలర్, ఇతర జైలు సిబ్బంది పేర్లు బహిర్గతమయ్యాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చట్టం అటువంటి విషయాలపై స్పష్టంగా ఉంది. నిందితులు ఏ పదవిలో ఉన్నా ప్రాసిక్యూట్ చేస్తారు.’’ అని అన్నారు. క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వలేదు ఓ మానవ హక్కుల కార్యకర్త స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. సంబంధిత పోలీసు అధికారులపై కేసును ప్రభుత్వ అనుమతి తర్వాత మాత్రమే నమోదు చేయవచ్చు. అయితే ప్రభుత్వాలు దీనికి బహిరంగంగా అమలు చేయడానికి ఇష్టపడవు. ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సిగ్గుచేటు. పోలీసు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అనుమానిత నేరస్థులుగా మాత్రమే పరిగణించాలి అంతే కానీ వారిని నిర్బంధంలో క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వదు. ఈ సమస్యపై దేశంలోని పోలీసులు, పరిపాలనా వ్యవస్థ సున్నితంగా ఉండడం అత్యవసరం’’ అని ఓ సామాజిక కార్యకర్త అన్నారు. కాగా హిందుస్తానీ బిరదారీ వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ మాట్లాడుతూ.. ఏదైనా కస్టడీ మరణంపై పోలీసు శాఖ ద్వారానే సరైన నిష్పాక్షిక విచారణ జరగాలని పేర్కొన్నారు. అలాగే ప్రమేయం ఉన్న పోలీసులను చట్ట ప్రకారం శిక్షించాలని సూచించారు. -
24 వేల మంది బాలలు బలవన్మరణం
న్యూఢిల్లీ: దేశంలో 2017–19 సంవత్సరాల మధ్య 14–18 ఏళ్ల వయస్సున్న బాలలు 24 వేల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులోని 4 వేల కేసులకు పరీక్షల్లో ఫెయిల్ కావడమే ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ క్రైం రికార్డ్స్బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికను ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించింది. 2017–19 సంవత్సరాల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన 24,568 మంది 14–18 ఏళ్ల గ్రూపులో 13,325 మంది బాలికలున్నట్లు ఆ డేటా పేర్కొంది. ఈ గ్రూపులో.. 2017లో 8,029 మంది, 2018లో 8,162 మంది చనిపోగా 2019 నాటికి వీరి సంఖ్య 8,377కు పెరిగింది. ఈ కాలంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,115 మంది తనువు చాలించగా బెంగాల్లో 2,802 మంది, మహారాష్ట్రలో 2,527 మంది, తమిళనాడులో 2,035 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రధానంగా పరీక్షల్లో ఫెయిలవ్వడం కారణంగా 4,046 మంది, వివాహ సంబంధ విషయాలతో 639 మంది చనిపోగా వీరిలో 411 మంది బాలికలున్నారు. ప్రేమ వైఫల్యంతో 3,315 మంది, అనారోగ్యంతో 2,567 మంది, భౌతిక దాడుల కారణంగా 81 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, ఆత్మీయులను కోల్పోవడం, మద్యం, డ్రగ్స్ వ్యసనం, అక్రమ గర్భం, మనస్తాపం, నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలు కూడా ఉన్నట్లు ఆ డేటా వెల్లడించింది. -
మానవత్వం మిస్సింగ్.. అంతిమ సంస్కారానికి అంత్యక్రియలు!
విక్టర్ మావయ్య.. మా ఇంటి పెద్ద. ఓ రోజు ఆయన ఇంటికి తిరిగిరాకపోవడంతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాం. తర్వాత ఆయన అఫ్జల్ గంజ్ ఏరియాలో చనిపోయాడని తెలిసి.. అక్కడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాం. మృతదేహం వివరాలేమీ ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎస్సై, సీఐ పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకూ వినతిపత్రాలు ఇచ్చాం. విక్టర్ మృతదేహాన్ని ఏం చేశారన్నది ఎవరూ చెప్పలేదు. అయితే అనాథ శవమని చెప్పి మెదక్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి తరలించారని ఆ తర్వాత తెలిసి కుమిలిపోయాం. అందరం ఉన్నా అనాథలా మరణించడం, కడసారి చూపు కూడా దక్కకపోవడం ఘోరం. మా అత్తయ్య మానసిక స్థితి దిగజారి మంచం పట్టింది. ఇలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదు. – హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన లత ఆవేదన ఇది మా అన్న ఖాజా అంటే మాకెంతో ఇష్టం. ఉన్నట్టుండి ఓ రోజు ఆచూకీ లేకుండా పోయాడు. హైదరాబాద్‌లోని ప్రతి గల్లీ గాలించాం. చివరికి బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. మార్చురీల్లో వెతకాలని కొందరు చెప్పారు. ఆ ఆలోచనే మాకు మింగుడుపడలేదు. గుండె రాయి చేసుకుని మార్చురీల్లో వెతికాం. ఉస్మానియాలో కుప్పలా వేసిన శవాలను చూపించి వెతుక్కొమ్మన్నారు. అది చూడగానే భయపడ్డాం. అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్ దగ్గరున్న ఫొటోల్లో మా అన్నయ్యను చూసి కూలబడిపోయాం. ఖాజా అన్న మృతదేహం మంగళ్‌హాట్ పీఎస్ నుంచి వచ్చిందని చెప్పడంతో.. అక్కడికి వెళ్లి, ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్టులు తీసుకున్నాం. కానీ మరో పది శవాలతో కలిపి మా అన్న మృతదేహాన్ని దహనం చేశారని తెలిసి బాధపడ్డాం. వెళ్లి బూడిద తెచ్చుకో అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అనాథ శవమైతేనేం.. మా అన్న ముస్లిం అని తెలుసుకదా.. అంతిమ సంస్కారంలో మతాచారాలు పాటించరా? –హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన నజ్మా సూటి ప్రశ్న ఇది.. అనిల్ కుమార్ భాషబోయిన అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్.. ఏదో ఓ పనిమీద బయటికెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్నవారు.. గుర్తింపులో నిర్లక్ష్యంతో అనాథ శవాలుగా మారిపోతున్నారు. ఏ మనిషికైనా మరణానంతరం దక్కే ఆఖరి గౌరవమైన అంతిమ సంస్కారం లేకుండానే దహనమైపోతున్నారు. తమ వారంటూ ఎందరో ఉన్నవారు కూడా నాలుగైదు శవాలతో కలిసి ఒకే చితిపై కాలిపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇదొక కోణమైతే.. మరో కోణం.. కొందరి మృతదేహాలు మెడికల్ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు అక్రమంగా తరలిపోతున్నాయి. కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది మృతదేహానికి ఇంతని రేటు కట్టి అమ్ముకుంటున్నారు. అసలు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏమైందని తేల్చే పోస్టుమార్టం కూడా చెయ్యకుండా తరలించేస్తున్నారు. ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వారి కుటుంబాలు తమవారి ఆచూకీ తెలియక, చనిపోయాడని తెలిసినా మృతదేహాలైనా లభించక, కడసారి చూపునకూ నోచుకోక కుమిలిపోతున్నాయి. ఇది ఒక్క లత, నజ్మాల వ్యథ కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి లతలు, నజ్మాలు ఎందరో.. రోజుకు 40 మంది మిస్సింగ్.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రిపోర్టు ప్రకారం.. మనదేశంలో సగటున ప్రతీ పది నిమిషాలకు ఒకరు తప్పిపోతున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే.. రోజుకు 40 దాకా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం.. మన రాష్ట్రంలో 2018లో జాడలేకుండా పోయినవారి సంఖ్య 5,992. 2019లో మొత్తం మిస్సింగ్ 17,150 మంది. ఇందులో 4,566 మంది పిల్లలు. 2019 చివరి నాటికి మొత్తంగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు 23,142. నిజానికి మన రాష్ట్రం ఇలాంటి కేసుల రికవరీ రేటులో దేశంలోనే టాప్–5లో ఉంది. మిస్సింగ్ కేసుల్లో తిరిగి దొరుకుతున్న వారు 83 శాతంపైనే. కానీ మిగతా 17 శాతం మందిలో ఎందరు ఇంకా దొరకలేదు, ఎందరు మరణించారన్న వివరాలు తెలిపేందుకు సరైన వెబ్సైట్ లేకపోవడం ఆందోళనకరం. ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఏం చేస్తున్నారు? ప్లాన్1 మార్చురీకి వచ్చిన అనాథ శవాల్లో బాగున్నవాటిని వైద్యులు, సిబ్బంది గుర్తిస్తారు. మృతదేహం పాడైపోకుండా రసాయనాలు (ఎంబామింగ్) పూస్తారు. వాటిని అనాథ శవాలను భద్రపరిచే గది (ఫఫ్ రూం)లో కాకుండా.. ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచుతారు. ఆ మృతదేహానికి సంబంధించి ఎవరైనా వచ్చారా, గుర్తుపట్టారా, అనాథ శవంగానే ఉందా అన్న వివరాలను పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకుంటారు. తర్వాత అనాథ శవంగా కన్ఫర్మ్ చేసి, పోస్టుమార్టం చేసినట్టుగా రికార్డు చేస్తారు. సాధారణంగా వారం పదిరోజులకోసారి మార్చురీల్లో పోగైన అనాథ శవాలను జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించి, అంత్యక్రియలు చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజీ కోసం దాచిన మృతదేహాన్ని కూడా అప్పగిస్తారు. మార్గమధ్యలోనే జీహెచ్ఎంసీ సిబ్బందికి కొంత సొమ్ము ముట్టజెప్పి సదరు మృతదేహాన్ని దొంగతనంగా మరో అంబులెన్స్‌లో మెడికల్ కాలేజీకి తరలించేస్తారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మిగతా మృతదేహాలతోపాటు దీనిని దహనం చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసేస్తారు. సొమ్ము చేతులు మారుతుంది. ప్లాన్2 మార్చురీలో పెట్టిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తుపడితే మరోరకంగా గాలం వేస్తారు. ఏజెంట్లు, మార్చురీ సిబ్బంది సదరు కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తారు. వారు పేదలని తేలితే రంగంలోకి దిగుతారు. దహన సంస్కారాలు, క్రతువులకు వేల రూపాయలు ఖర్చవుతాయని.. కావాలంటే ఓ సలహా ఇస్తామని అంటారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తామని.. జీహెచ్ఎంసీతోగానీ, స్వచ్ఛంద సంస్థలతోగానీ అంత్యక్రియలు చేయిస్తామని ప్రలోభపెడతారు. అవసరమైతే స్వచ్చంద సంస్థల వారు కాస్త ఆర్థిక సాయం చేస్తారంటూ గాలం వేస్తారు. ఫ్యామిలీ ఒప్పుకోగానే.. ఏదో శ్మశాన వాటికకు తరలించి, అంత్యక్రియలు చేయించినట్టు హడావుడి చేస్తారు. ఈ మేరకు తప్పుడు పత్రాలు సృష్టించి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. కానీ ఆ మృతదేహాన్ని అక్రమంగా ఏదో మెడికల్ కాలేజీకి అమ్మేస్తారు. బాడీ చితికిపోతే డెంటల్,కంటి వైద్య కాలేజీలకు.. రైలు, బస్సు లేదా ఇతర రోడ్డు ప్రమాదాల్లో కొన్ని డెడ్ బాడీలు బాగా చితికిపోతాయి. వాటిలో తల భాగం దెబ్బతినకుండా ఉంటే విడిగా ఉంచుతారు. పోస్టుమార్టం నిర్వహించామని చెప్పి దహనం చేసేస్తారు. అంతకుముందే ఆ శరీరం నుంచి తలను వేరు చేస్తారు. పాడైపోకుండా రసాయనాలు నింపిన ఓ ప్రత్యేక బాక్సులో పెట్టి.. డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలున్న మెడికల్ కాలేజీలకు చేరవేస్తారు. ప్రొఫెసర్లు ఆ తలలతో దంత వైద్యం, కంటి వైద్యం ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తారు. మహిళల మృతదేహాలకు డిమాండ్ సాధారణంగా ఆడవాళ్లు ఆస్పత్రులకు ఒంటరిగా రావడం, బయట ఒంటరిగా జీవించడం వంటివి చాలా తక్కువ. అనాథ స్థితిలో ఆడ మృతదేహాలు ఉండటం కూడా తక్కువే. అయితే మెడికల్ కాలేజీల్లో గైనకాలజీ విద్యార్థులకు మహిళల శరీరంపై అనాటమీ క్లాసులు నిర్వహించడం చాలా కీలకం. అందుకే మహిళల మృతదేహాల కోసం కాలేజీలు ఎక్కువ సొమ్ము చెల్లిస్తాయి.మగవారి మృతదేహానికి అయితే రూ.5 లక్షల వరకు, ఆడవాళ్ల మృతదేహానికి రూ.20 లక్షల దాకా చెల్లిస్తున్నారు. ఈ నిబంధనలు పాటించడం లేదు! 1. ఎవరూ క్లెయిమ్ చెయ్యని డెడ్‌బాడీల విషయంగా వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోలీసు, వైద్యాధికారులు పలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. సీఆర్పీసీ 174 సెక్షన్ ప్రకారం.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశాకే మార్చురీకి పంపాలి. 2. డెడ్ బాడీ ఫొటోలు, వేలిముద్రలు, డీఎన్ఏ, విస్రా తదితరాలు సేకరించి భద్రపరచాలి. 3. బంధువులు గుర్తించేందుకు వీలుగా మూడు రోజులపాటు మృతుల ఫొటో, గుర్తులు, ఇతర వివరాలు మీడియా సంస్థలకు పంపాలి. 4. అప్పటికీ ఎవరూ రాకపోతే పోస్టుమార్టం నిర్వహించాలి. ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పక్కనే ఉండాలి. కానీ అనాథ శవాల విషయంలో ఇవేమీ జరగడం లేదు. డబ్బుకు కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు, పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోస్టుమార్టం చేయకుండానే.. చేశామంటూ శవాలను గుట్టుగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నారు. కాలేజీల అవసరాన్నిఅడ్డుపెట్టుకుని.. మన రాష్ట్రంలో దాదాపు 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి పది మంది విద్యార్థులకు అనాటమీ క్లాసులు చెప్పేందుకు ఒక మృతదేహం అవసరం. ఈ లెక్కన ప్రతి కాలేజీకి ఏటా 15 నుంచి 20 మృతదేహాలు కావాలి. ఈ లెక్కన వైద్యవిద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం ఏటా రాష్ట్రంలో 500కుపైనే శవాలు కావాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం.. కొన్నిచోట్ల వ్యాక్స్ బొమ్మలతో అనాటమీ క్లాసులు నిర్వహిస్తున్నట్టు పైకి చెబుతున్నా, దానివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి రాదన్న అభిప్రాయంతో మృతదేహాలపైనే ప్రాక్టీస్‌కు మొగ్గుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు.. మృతదేహాలు అమ్ముకునే దందాకు తెరలేపారు. కాలేజీల అవసరాన్ని బట్టి ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇంతఖర్చు పెట్టాల్సి రావడంతో కాలేజీలు ఈ భారాన్ని వైద్య విద్యార్థులపై వేస్తున్నట్టు సమాచారం. ఒక శవానికి రూ.5 లక్షలు ఖర్చయితే.. 100 మంది విద్యార్థులున్న కాలేజీలో ప్రతి విద్యార్థి నుంచి రూ.5,000 వరకు ప్రత్యేక అనాటమీ క్లాసు కింద తీసుకుంటున్నట్టు తెలిసింది. 2006లో శిల్పారామం వాచ్మెన్ కేసులో.. పి.పాల్ అనే వ్యక్తి శిల్పారామంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. 2011 మే 6న అదృశ్యమయ్యాడు. తర్వాత శంషాబాద్‌లోని రాళ్లగూడెం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించింది. కొద్దిరోజుల తర్వాత సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ రికార్డుల సాయంతో పాల్ బంధువులు ఆ డెడ్‌బాడీ తమవారిదిగా గుర్తు పట్టారు. ఉస్మానియా మార్చురీకి వెళ్లి మృతదేహం కోసం ఆరా తీశారు. కానీ అక్కడి ఫోరెన్సిక్ సిబ్బంది పాల్ మృతదేహాన్ని జీహెచ్ఎంసీకి వాళ్లకు ఇచ్చామన్నారు. బంధువులు జీహెచ్ఎంసీని ఆశ్రయించగా.. బాడీని సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌కు పంపామన్నారు. అక్కడికెళితే తమ దగ్గరికి రాలేదని ఫౌండేషన్ తేల్చి చెప్పింది. దీంతో ఏదో జరిగిందని పాల్ బంధువులకు అర్థమైంది. ‘పాల్ మృతదేహం ఏది? అంత్యక్రియలు నిర్వహించకుండా ఎక్కడికి పోయింది, ఏదైనా మెడికల్ కాలేజీకి విక్రయించారా?’ అంటూ మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారానికి బాధ్యుడైన ఓ సీనియర్ డాక్టర్‌పై విచారణ జరిగింది. ఉస్మానియాలో ఇద్దరు ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ, బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే సదరు వైద్యులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. 2010లో వీఎస్టీ కాలనీకి చెందిన వై.జాన్ అనే వ్యక్తి తప్పిపోయాడు. అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు కాపీ తీసుకోలేదు. నాలుగేళ్లు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 2014 జనవరి 13న చిక్కడపల్లిలో మరోసారి ఫిర్యాదు చేశారు. కానీ జాన్ 2011 ఫిబ్రవరి 3వ తేదీనే అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చనిపోయినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అంత్యక్రియలు, పోస్టుమార్టానికి సంబంధించిన డాక్యుమెంట్లు అడిగారు. కానీ ఇవ్వలేదు. దీంతో ఎవరో జాన్ శవాన్ని మాయం చేశారని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ మేరకు అఫ్జల్‌గంజ్ ఠాణాలో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. అయితే వరదలు వచ్చి జాన్ ఫైల్ ఒక్కటి మాత్రమే కొట్టుకుపోయిందని పోలీసులు సమాధానం ఇవ్వడంతో కుటుంబం నోరెళ్లబెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఆ మృతదేహం దొంగతనంగా మెదక్‌లోని ఓ కాలేజీ అనాటమీ విభాగానికి చేరింది. ప్రవీణ్ ప్రకాశ్ కమిటీ నివేదిక ఎక్కడ? 2010–11లో రాష్ట్రంలో వందలకొద్దీ శవాలను అక్రమంగా మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వైద్యులు, పోలీసుల మీద విమర్శలు వచ్చాయి. వ్యవహారం ఢిల్లీ దాకా వెళ్లడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ పలుమార్లు ఉస్మానియా, ఇతర ఆస్పత్రులను సందర్శించింది. కొందరు అధికారులు, సిబ్బందిని విచారించింది. కానీ కమిటీ నివేదికను ఇప్పటికీ బయటపెట్టలేదు. అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలి.. కార్పొరేట్ కాలేజీలు పెరుగుతున్న క్రమంలో మెడిసిన్ విద్యార్థుల అనాటమీ తరగతులకు శవాల అవసరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, ప్రభుత్వాసుపత్రుల వైద్యులతో ములాఖత్ అవుతున్నారు. పోలీసులు చూసీచూడనట్లు ఉంటుండటంతో అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. శవాలను అమ్ముకుని రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. దీని వెనుక మెడికల్ కార్పొరేట్ మాఫియా హస్తం ఉందన్నది సుస్పష్టం. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరపకపోవడానికి కారణాలేమిటన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ వ్యవహారంపై గతంలోనే రాష్ట్రపతికి, జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేశాం. ఈ మొత్తం వ్యవహారంపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. -
జైళ్ల గోడు: మగ్గుతున్న బతుకులు
కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016’ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక మహిళా జైలు తప్పనిసరిగా ఉండాలి. కాని దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని కేవలం 15 రాష్ట్రాల్లోనే మహిళా జైళ్లు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల వివిధ స్థాయిల జైళ్లలోనే మహిళా విభాగాలను నిర్వహిస్తున్నారు. దేశంలోని జైళ్ల నిర్వహణను, ఖైదీల స్థితిగతులను తెలియ చేసే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019 నివేదిక అనేక విషయాలను వెల్లడి చేస్తోంది. మొత్తం ఖైదీలలో స్త్రీలు నేరానికి దూరంగా ఉంటారు. నేర స్వభావాన్ని దగ్గరకు రానీయరు. కాని దురదృష్టవశాత్తు నేరాల్లో చిక్కుకునేవారు, తెలిసీ తెలియక నేరాలు చేసినవారు ఉంటారు. ఇలాంటివారు ఇప్పుడు దేశంలో దాదాపు ఇరవై వేల మంది జైళ్లల్లో ఉన్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలియచేస్తోంది. దేశంలో మొత్తం ఖైదీలు 4,78,600 మంది ఉండగా వీరిలో 19,913 మంది మహిళా ఖైదీలు. నిజానికి వీరంతా మహిళా జైళ్లలోనే ఉండాల్సి ఉన్నా అన్నిచోట్లా మహిళా జైళ్లు లేవు. దేశం మొత్తం మీద 1300 జైళ్లు ఉంటే వీటిలో 31 మాత్రమే మహిళా జైళ్లు. వీటిలో నాలుగు వేల మంది మాత్రమే మహిళా ఖైదీలు ఉన్నారు. అంటే మూడింతల మంది సాధారణ జైళ్లలోని ప్రత్యేక విభాగాలలో శిక్ష అనుభవిస్తున్నారన్న మాట. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కువమంది మహిళా ఖైదీలు ఉన్నారు. అక్కడ వారి ప్రస్తుత సంఖ్య 4,174. పెరిగిన మహిళా ఖైదీలు గత ఐదేళ్లలో దేశంలో మహిళా ఖైదీలు దాదాపు 15 శాతం పెరిగారని ఈ నివేదిక చెబుతోంది. అంటే ఈ ఐదేళ్లలో సుమారు రెండున్నర వేల మంది మహిళా ఖైదీలు జైళ్లకు తీసుకురాబడ్డారు. వీరిలో శిక్ష ఖరారైన వారు, అండర్‌ట్రయల్స్, డిటెన్యూలు ఉన్నారు. శిక్ష ఖరారైన వారి కంటే అండర్ట్రయల్సే ఎక్కువ ఉండటం గమనార్హం. పిల్లలతో పాటు ఉన్న తల్లులు 1543 మంది ఉన్నారు. వీరితో ఉంటున్న పిల్లల సంఖ్య 1779. జైలు మాన్యువల్ ప్రకారం మహిళా ఖైదీలు ఆరేళ్లలోపు పిల్లలను తమతో ఉంచుకోవచ్చు. ఆరేళ్ల తర్వాత కోరిన బంధువులకు అప్పజెబుతారు. లేదా ప్రభుత్వ నిర్వహణలో ఉండే బాలల గృహాలకు తరలిస్తారు. సవాళ్లు దేశంలో పురుష ఖైదీలకు జైళ్లలో సవాళ్లు ఉన్నట్టే మహిళా ఖైదీలకు కూడా సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా శుభ్రత, భద్రత ముఖ్యమైనవి. స్త్రీల దైహిక పరిస్థితులను గమనించి వారి అవసరాలను కనిపెట్టుకుని ఉండే మహిళా సిబ్బంది పర్యవేక్షణ లో వీరంతా ఉండాల్సి ఉంటుంది. కాని మహిళా సిబ్బంది సమస్య అధికం. పది మంది స్త్రీలకు ఒక బాత్రూమ్, టాయిలెట్ ఉండాల్సి ఉండగా అలాంటి ఏర్పాటు ఉన్న జైళ్లు బహు తక్కువ. నీళ్ల కొరత వల్ల శుభ్రత కరువై అనారోగ్యం బారిన పడే వారు ఎందరో ఉంటారు. ఒక మహిళా ఖైదీకి రోజుకు 133 లీటర్ల నీరు వాడకానికి ఇవ్వాలి అని నియమం. కాని అన్ని నీళ్లు ఇచ్చే ఏర్పాటు కూడా బహుతక్కువ. పురుషుడు నేరం చేసి జైలుకు వెళితే అతడు మాత్రమే జైలులో ఉంటాడు. కాని స్త్రీ జైలుకు రావలసి వస్తే కుటుంబమే చెదిరిపోతుంది. పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ స్త్రీల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాని మహిళా ఖైదీల మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలకు తక్కువ పట్టింపు ఉంది. వారి డిప్రెషన్ జైలు గది గోడల మధ్య రెట్టింపు అవుతోంది. జైళ్లలో ఉన్న చాలామందికి తాము న్యాయ సహాయం పొందవచ్చు అని తెలియడం లేదు. ప్రతి జైలుకు ప్రభుత్వం లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. అడ్వొకేట్లను ఏర్పాటు చేయాలి. కాని దీనిని పట్టించుకునే ప్రభుత్వాలు కూడా తక్కువ. ఇక జైళ్లలో మహిళా సిబ్బంది సంఖ్య కూడా అరకొరగా ఉంటోంది. ఇప్పుడు దేశంలో ఉన్న 20 వేల మంది మహిళా ఖైదీలకు కేవలం 7,794 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన వీరిని మూడు షిఫ్టులుగా విభజిస్తే ప్రతి నిర్దిష్ట డ్యూటీలో ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు. ప్రభుత్వాల సంరక్షణ మహిళా ఖైదీల సంరక్షణ, చదువు, చైతన్యం, పరివర్తన, ఉపాధి విషయాలలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఖైదీలకు కంప్యూటర్ శిక్షణ ఇస్తోందని, వారి కోసం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తోందని, చంటి పిల్లల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారని, మూడేళ్లు దాటిన పిల్లలను వారి బాల్యం సాధారణంగా ఉండేందుకు జైలు బయటి స్కూళ్లకు పంపుతున్నారని నివేదిక తెలిపింది. ఇవి కాకుండా టైలరింగ్, బేకరి పనులు కూడా నేర్పిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళా ఖైదీలు తమవారితో మాట్లాడటానికి మూడు మహిళా జైళ్లలో 65 టెలిఫోన్ బూత్‌లు ఏర్పాటు చేసింది. సైకాలజిస్ట్‌లను నియమించింది. గుజరాత్లో మహిళా ఖైదీలకు స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్ కోర్సులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ జైళ్లలో ఆర్టిఫీషియల్ జువెలరీ, ఆర్టిఫీషియల్ ఫ్లవర్స్ తయారీని నేర్పిస్తున్నారు. తరవాతి జీవితం శిక్ష పూర్తయిన వారు తిరిగి తమ జీవితాల్లో నిలబడటానికి, కుటుంబం నుంచి సమాజం నుంచి ఒప్పుకోలు పొందడానికి సుదీర్ఘ ప్రయత్నాలు జరగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి తోడ్పాటు అందినప్పుడే ఇలాంటి వారి కొత్త జీవితం మొదలవుతుంది. చాలా జైళ్లలో మహిళా ఖైదీలు కోరే కోరిక ఏమిటంటే కడుపు నిండా భోజనం పెట్టమని. పురుష ఖైదీల కంటే మహిళా ఖైదీలకు రేషన్ తక్కువగా దొరుకుతుంది. జైళ్లల్లో అనారోగ్యం పాలైన మహిళా ఖైదీలు విడుదలయ్యాక మందులకు డబ్బు లేక చనిపోవడం నాకు తెలుసు. – వర్తికా నంద, సామాజిక కార్యకర్త, ఢిల్లీ భర్త జైలులో ఉంటే భార్య అనేక అవస్థలు పడైనా డబ్బు సేకరించి బెయిల్‌కు ప్రయత్నిస్తుంది. కాని చాలా కేసుల్లో భార్య జైలులో ఉంటే భర్త ఆమెను ఆమె ఖర్మానికి వదిలేస్తాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆ స్త్రీలను పిల్లలు ఇంట్లోకి రానివ్వకపోవడం నాకు తెలుసు. కాబట్టి మహిళా ఖైదీలు విడుదలయ్యాక వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టాలి. – షీరిన్ సాదిక్, సోషియాలజీ ప్రొఫెసర్, అలిగర్ యూనివర్సిటీ – సాక్షి ఫ్యామిలీ -
అతడికి ఏమైంది..?
సాక్షి, హైదరాబాద్: దేశంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువ ఉంటున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)–2019 గణాంకాలు పేర్కొంటున్నాయి. మనోనిబ్బరం విషయంలో మహిళలకంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా సరాసరిన రోజుకు 381 ఆత్మహత్య ఘటనలు జరగ్గా.. వీటిలో 267 మంది పురుషులే ఉన్నారు. దేశంలో నమోదయిన వాటిలో 5 శాతం తెలంగాణకు సంబంధించినవి. ఇక్కడ గత ఏడాది మొత్తం 7,675 సూసైడ్స్ జరిగాయి. అన్నింటా మహిళలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించే పురుషులు కష్టాలు ఎదురవగానే డీలాపడిపోతున్నారు. అర్ధాంతరంగా జీవితాలు ముగించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 1,39,122 ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కాయి. వీటిలో 17 మంది ట్రాన్స్‌జెండర్స్‌ను మినహాయిస్తే.. మిగిలిన వారిలో పురుషులు 97,613 మంది ఉండగా.. స్త్రీలు 41,493 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 30–60 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ మంది ఉంటున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ సంబంధిత అంశాలు, నిరుద్యోగం, ప్రేమ వ్యవహారం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. మొత్తం మృతుల్లో వివాహితులే 92,756 మంది వివాహితులే ఉన్నారు. ఈ వివాహితుల్లోనూ అత్యధికంగా 66,815 మంది పురుషులు, 25,941 మంది మహిళలు ఉన్నారు. -
2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: 2018.. రాష్ట్రంలో బాలలకు నరకం చూపించిన సంవత్సరం. చంద్రబాబు సర్కారు హయాంలో మైనర్లపై నేరాలు పెరిగిన ఏడాది ఇది. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లపై అకృత్యాలు పెరిగిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ)–2018 నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం... 2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. మైనర్లపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యాయి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారు. ఎన్సీఆర్బీ–2018 నివేదికలోని ముఖ్యమైన అంశాలు - ఏపీలో 2018లో 40 ఘటనల్లో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది. 14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల కార్మిక నిరోధక చట్టం కింద 143 కేసులు నమోదయ్యాయి. బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్ కేసు నమోదైంది. - వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రాస్టిట్యూషన్ అండర్ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్–1956 కింద 14 కేసులు నమోదు చేశారు. - 19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. - జువైనల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు. - ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగాఉన్నారు. - 2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. - చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నింధితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలి ‘‘బాలలపై నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. ఈ తరహా కేసుల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించి, కోర్టులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే భయం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు’’ – ఎన్.రామ్మోహన్, ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ -
బాబొచ్చాడు.. అతివల ఆత్మగౌరవం దెబ్బతీశాడు
సాక్షి, అమరావతి: ‘ఆయన వస్తున్నాడు.. మహిళలు, బాలికల రక్షణకు భరోసా తెస్తున్నాడు’ 2014 ఎన్నికల ముందు ఏ టీవీ చానల్ తిప్పినా కనిపించిన టీడీపీ ఎన్నికల ప్రచార ప్రకటన ఇది. ఆయన అధికారంలోకి వచ్చాడు.. ఐదేళ్లు పాలించి వెళ్లాడు. ప్రచార ప్రకటనకు భిన్నంగా మహిళలను అవమానించి వెళ్లాడు. ఇదే విషయాన్ని నేర నమోదు గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలు నిగ్గు తేల్చాయి. తాజాగా విడుదల చేసిన ఎన్సీఆర్బీ–2018 నివేదిక సైతం ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్పింది. ఎన్సీఆర్బీ 2016 నుంచి వరుసగా 2018 వరకు విడుదల చేసిన నివేదికల్లో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వారిని కించపర్చడం వంటి నేరాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లోనే ఉండటం గమనార్హం. 2018లోనూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఘటనలు దేశంలో 6,992 జరగ్గా.. ఏపీలో 1,802 కేసులు నమోదై మొదటి స్థానంలో నిలిచింది. నిత్యం ఆర్తనాదాలే.. చంద్రబాబు జమానాలో మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. సర్పంచ్ నుంచి గ్రామ పార్టీ సభ్యుడి వరకు మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. వాటిలో ఉదాహరణకు కొన్ని.. - కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై 2015 జూలై 8న టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసినా అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. - చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జూనియర్ డాక్టర్ శిల్పకు జరిగిన అన్యాయంపై అప్పటి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెంది 2018 ఆగస్టులో 7న ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప మరణానికి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థి లోకం, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో పీజీ చదివిన శిల్ప తనను వేధిస్తున్నారంటూ 2017 ఏప్రిల్‌లో ఈ మెయిల్ ద్వారా గవర్నర్ నరసింహన్, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసింది. గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో శిల్ప ప్రాణత్యాగం చేసింది. - ఫ్రొఫెసర్ వేధింçపుల కారణంగా గుంటూరులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్త›ంగా కలకలం రేపింది. గైనిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వీఏఏ లక్ష్మి వేధింపుల కారణంగా 2016 అక్టోబర్ 24న మెడికో (గైనిక్ పీజీ) బాల సంధ్యారాణి బలవన్మరణానికి పాల్పడింది.ఈ కేసులో నిందితుల్ని కాపాడేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలున్నాయి. - నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా తెలంగాణకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు దోషుల్ని కాపాడేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. - అనంతపురం జిల్లా జల్లిపల్లిలో గతేడాది ఫిబ్రవరి 1న సుధమ్మ అనే మహిళపై టీడీపీ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర దాడి చేసి దారుణంగా కొట్టారు. సర్పంచ్ నాగరాజు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుయాయుడు కావడంతో తొలుత స్పందించని పోలీసులు ఆ తరువాత అల్లరి కావడంతో నాగరాజుపై రౌడీషీట్ తెరుస్తున్నట్టు ప్రకటించారు. - విజయవాడలో టీడీపీ నేతల దన్నుతో సాగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం 2015 డిసెంబర్లో గుప్పుమంది.అప్పులిచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతోపాటు వారిని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ ముఠాకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నది టీడీపీ ప్రజా ప్రతినిధులేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులపై సకాలంలో చట్టపరమైన చర్యలు లేకుండా ఒత్తిళ్లు తెచ్చారు. - 2018లో ఏపీలో నేరాల నమోదు కొంత తగ్గినప్పటికీ.. మహిళలపై నేరాల జోరు మాత్రం కొనసాగింది. -
ప్రేమ హత్యలే అధికం!
సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి. -
బాబు పాలనలో 'కూలి'న బతుకులు
సాక్షి, అమరావతి: రెక్కాడితే గాని డొక్కాడని వారి బతుకులు చంద్రబాబు హయాంలో ‘కూలి’పోయాయి. ఆయన జమానాలో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికులు రోజువారీ కూలీలేనని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో వెల్లడైంది. 2016లో జరిగిన ప్రమాద మరణాలు–ఆత్మహత్యలకు సంబంధించి ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదిక అనేక చేదు సత్యాల్ని బయటపెట్టింది. 2016లో రాష్ట్రంలో 6,059 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో రోజువారీ కూలీలు 1,333 మంది ఉన్నారు. ఇక నేల తల్లిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు అప్పుల పాలవడంతో బతికే దారి లేక, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో 804 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగం ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. సాగు పెట్టుబడులు పెరగడం, పంట నష్టాలు, గిట్టుబాటు ధర దక్కకపోవడం, అప్పుల బాధలు, పనులు లేకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి మరణాల్లో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో ఆత్మహత్యలను పరిశీలిస్తే దేశంలో ఏపీ తొమ్మిదో స్థానంలో ఉంది. 2016 గణాంకాల ప్రకారం.. - 2016లో దేశవ్యాప్తంగా మొత్తం 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 6,059 మంది(4.6 శాతం) ఏపీకి చెందినవారు. - దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన 11,379 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో ఏపీకి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు 804 మంది ఉన్నారు. వారిలో పురుషులు 730 మంది కాగా, మహిళలు 74 మంది ఉన్నారు. - ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు 239 మంది కాగా వారిలో భూమి కలిగిన వారు 115 మంది, కౌలుకు చేస్తున్నవారు 124 మంది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలు 565 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలోని ఆత్మహత్యల్లో ఏకంగా 70 శాతానికి పైగా కూలీలే కావడం గమనార్హం. ప్రమాద మరణాలు 2016లో రాష్ట్రంలో 25,050 ప్రమాదాలు నమోదయ్యాయి. 30,052 మంది క్షతగాత్రులు కాగా 9,937 మంది మృతి చెందారు. వీటిలో రోడ్డు ప్రమాదాలు 23,658 కాగా.. రైలు నుంచి జారిపడటం, ప్రమాదవశాత్తు రైలు కింద పడటం వంటివి 1203, రైల్వే లైన్ క్రాస్ చేస్తుండగా 189 ఘటనలు జరిగాయి. -
చిన్నారులపై నేరాల్లో యూపీ టాప్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను విశ్లేషించిన క్రై అనే ఎన్జీవో సంస్థ డైరెక్టర్ కోమల్ గనోత్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరిగిన నేరాల్లో 50 శాతం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు. ఈ నేరాల్లో 15 శాతంతో యూపీ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని తెలిపారు. నేరాల్లో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, కిడ్నాపింగ్‌లు(48.9 శాతం) తొలిస్థానంలో ఉండగా.. పిల్లలపై అత్యాచారాలు(18 శాతం) తర్వాతిస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. మరోవైపు 2014–16 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడ్డ వృద్ధుల(సీనియర్ సిటిజన్స్)పై జరిగిన నేరాల్లో 40 శాతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. వృద్ధులను దోచుకోవడం, దాడిచేయడం, మోసం చేయడం వంటి నేరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయని వెల్లడించారు. చిన్నారుల కిడ్నాపుల్లో యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,11,569 మంది పిల్లలు(41,175 మంది బాలురు, 70,394 మంది బాలికలు) తప్పిపోయారన్నారు. పోలీసులు, అధికారుల చొరవతో 2016 చివరినాటికి 55,944 మంది చిన్నారుల్ని కాపాడగలిగామన్నారు. -
ఆకాశంలో సగం.. భద్రత శూన్యం
- మహిళలపై నేరాల్లో దేశంలో 8వ స్థానంలో తెలంగాణ - రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆమె ఆకాశంలో సగం.. అయినా ఆమెకు భద్రత శూన్యం.. రోడ్డుపైకి వెళితే పోకిరీలు.. ఇష్టం లేదన్నా వెంటపడే దుర్మార్గులు.. కన్నూమిన్నూ కానని కామాంధులు.. ఇంట్లో భర్త వేధింపులు.. పనిచేసే చోటా వదలని దుర్మార్గులు.. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో ఈ తరహా ఘటనలు నమోదవుతున్నాయి. ఏడాదికేడాది మరింతగా పెరిగిపోతున్నాయి. 2015 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. గతేడాది రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి 15,135 కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 3,27,394 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అందులో 31,126 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 28,165 కేసులతో రాజస్తాన్, 23,258 కేసులతో అస్సాం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15,931 కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న అత్యాచార ఘటనలు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల ఘటనలు ఏటికేడు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2014లో 979 మంది అత్యాచారానికి గురికాగా.. 2015లో 1,105 మంది అత్యాచారానికి గురైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. అందులోనూ 18 ఏళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారాలు అధికంగా నమోదవుతున్నాయని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది 328 మంది బాలికలపై అత్యాచార ఘటనలు నమోదయ్యాయని తెలిపింది. ఇక మహిళలకు సంబంధించి 648 కిడ్నాప్ కేసులు నమోదవగా.. 676 మంది బాధితులున్నట్లు పేర్కొంది. గతేడాది దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10,156 మంది మహిళలు కిడ్నాపైనట్లు వెల్లడించింది. వేధింపుల్లో ఏపీ నం.1 మహిళలు పనిచేసే చోట అవమానం, వేధింపుల కేసుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలవగా.. ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. రాష్ట్రంలో 2014లో ఈ తరహా కేసులు 1,091 నమోదవగా.. 2015లో 1,291కి పెరిగింది. గతేడాది 7,329 మంది మహిళలు భర్త చేతిలో వేధింపులకు గురైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఇక 18 ఏళ్లలోపు బాలికలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గతేడాది 173 మంది బాలికలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో నమోదైనట్టు నివేదిక పేర్కొంది. ఎన్సీఆర్బీ నివేదికలోని ముఖ్యాంశాలు.. ► వివిధ రకాల నేరాలు, ఘటనలకు సంబంధించి గతేడాది తెలంగాణ పోలీసులకు 1,91,958 ఫిర్యాదులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 2,39,926 ఫిర్యాదులు వచ్చాయి. ► తెలంగాణలో 1,188 హత్య కేసులు నమోదుకాగా 1,209 మంది హత్యకు గురయ్యారు. ఏపీలో 1,099 హత్య కేసులు నమోదుకాగా 1,144 మంది హత్యకు గురయ్యారు. హత్యల్లో తెలంగాణ 13వ, ఏపీ 14వ స్థానంలో నిలిచాయి. ► ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించి 1,678 కేసులతో తెలంగాణ దేశంలో 10వ స్థానంలో నిలిచింది. 4,415 కేసులతో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. ► 1,044 కిడ్నాప్ కేసులతో 17వ స్థానంలో తెలంగాణ, 917 కేసులతో 18వ స్థానంలో ఏపీ ఉన్నాయి.. తెలంగాణలో 14,765 దొం గతనాలు, 377 దోపిడీలు, 1,607 ఇళ్ల దొంగతనాలు జరిగాయి. ► అవినీతికి సంబంధించి తెలంగాణలో 193 కేసులు నమోదుకాగా, 107 మంది అరెస్టయ్యారు. పెండింగ్ కేసులు కలుపుకొని అవినీతి కేసుల సంఖ్య 408కు పెరిగింది. ఏపీలో 185 అవినీతి కేసులు నమోదుకాగా.. 177 మంది అరెస్టయ్యారు. మొత్తం అవినీతి కేసుల సంఖ్య 464కు పెరిగింది.