నేర నిలయాలు! | Sakshi Editorial On Tihar Jail | Sakshi
Sakshi News home page

నేర నిలయాలు!

Published Thu, May 11 2023 3:01 AM | Last Updated on Thu, May 11 2023 3:02 AM

Sakshi Editorial On Tihar Jail

ఒక సమాజ నాగరికత స్థాయిని అంచనా వేయాలంటే అక్కడున్న జైళ్లను ముందుగా చూడాలన్నాడు విశ్వవిఖ్యాత రచయిత ఫ్యూదోర్‌ డాస్టోవిస్కీ. దాన్నే గీటురాయిగా తీసుకుంటే అన్ని వ్యవస్థలూ సిగ్గు పడాల్సిందే. మన దేశంలో జైళ్ల స్థితిగతుల గురించి ఏటా జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించే అంశాలు కంగారు పుట్టిస్తుంటాయి. ఇతర జైళ్ల సంగతలావుంచి దేశంలోనే అతి పెద్దదయిన తిహార్‌ జైలు గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఈ జైలు దేశంలో మాత్రమే కాదు...దక్షిణాసియా దేశాల్లోనే అతి పెద్దది.

అలాంటిచోట నెలరోజుల వ్యవధిలో రెండో హత్య జరిగిందంటే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. గత నెల 14న రౌడీ షీటర్, ఒక హత్య కేసు ముద్దాయి అయిన ప్రిన్స్‌ తెవాతియా అనే యువకుణ్ణి అతని ప్రత్యర్థి వర్గం హతమార్చింది. రెండూ వర్గాలూ పదునైన ఆయుధాలతో దాడి చేసుకోవటంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకడైన తెవాతియా మరణించాడు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ, గతవారం టిల్లూ తాజ్‌పురియా అనే గూండాను ప్రత్యర్థివర్గం దాడిచేసి మట్టుబెట్టింది.

నిరుడు ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన గూండా జితేందర్‌ గోగి మరణానికి టిల్లూ తిహార్‌ జైలునుంచే పథక రచన చేశాడని అప్పట్లో అధికారుల దర్యాప్తులో తేలింది. జైళ్లను సంస్కరణాలయాలుగా ఎంత చెప్పుకున్నా అందుకు అనుగుణమైన చర్యలు అంతంతమాత్రమే. ఏ నేరమూ చేయకుండానే కేసుల్లో ఇరుక్కుని వచ్చే అమాయకులతోపాటు రకరకాల నేరాలు చేసి అక్కడికొచ్చేవారు కూడా అధికంగా ఉంటారు జైళ్లలో పర్యవేక్షణ అంత సులభం కాదు.

అందునా తిహార్‌ జైలు రాజకీయ నాయకులకూ, గూండాలకూ, కరడుగట్టిన నేరగాళ్లకూ, చిల్లర నేరగాళ్లకూ నిలయం. అక్కడ పరిస్థితి చేయిదాటిందంటే ఎంతటి ప్రమాదమైనా చోటుచేసుకోవచ్చు. అయితే సమస్య ఉందని గుర్తించి నపుడు దానికి తగిన పరిష్కారం వెదకాలి. ఎక్కడో ఒకచోట ఆ సమస్యకు అడ్డుకట్ట పడాలి. కానీ అది ఎవరికీ పట్టినట్టు లేదు. ఫలితంగా జైల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం, చంపుకోవటం, బయటనున్న ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి పథక రచన చేయటం యధేచ్ఛగా సాగిపోతోంది. మరీ ఘోరం జరిగితే తప్ప అన్నీ బయటకు రావు.

తిహార్‌ జైలు 400 ఎకరాల విస్తీర్ణంలో 9 జైళ్లుగా ఉంటుంది. అక్కడ 10,026మందిని ఖైదు చేయ టానికి వీలుండగా, అంతకు రెట్టింపు మంది ఉంటారు. ఆ జైల్లో అత్యధికంగా ఉండేది ఉత్తరాదివారు గనుక జైలు భద్రతను తమిళనాడు స్పెషల్‌ పోలీస్‌(టీఎన్‌ఎస్‌పీ)కి అప్పగించారు. ఆ విభాగంనుంచి దాదాపు వేయిమంది సిబ్బంది తిహార్‌ జైల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారితోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే ఎదర్కొనడానికి ఇండో టిబెటిన్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ) సన్నద్ధంగా ఉంటుంది.

కానీ టిల్లూను ప్రత్యర్థివర్గం కొట్టిచంపినప్పుడు అందరూ ప్రేక్షకపాత్ర వహించారని సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. ఇప్పటికైతే ఏడుగురు టీఎన్‌ఎస్‌పీ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఇందువల్ల అంతా మారిపోతుందనుకోవటం అత్యాశే. నిజానికి కొన్ని దేశాల జైళ్లతో పోలిస్తే మన జైళ్లు మరీ అంత కిక్కిరిసినట్టు భావించనక్కరలేదని కొందరి వాదన. అది నిజమే కావొచ్చు గానీ...మన జైళ్లు కూడా రకరకాల కారణాలతో పరిమితికి మించిన ఖైదీలతోనే నిండి ఉంటున్నాయి. జైళ్లలో ఉండేవారంతా నేరస్తులు కాదు.

అందులో విచారణలో ఉన్న ఖైదీలు కూడా ఉంటారు. చెప్పా లంటే మన ప్రభుత్వాల విధానాల వల్లనో, అలసత్వం వల్లనో ఈ రెండో క్యాటగిరీవారే అధికం. విచారణలో ఉండే ఖైదీల్లో క్షణికావేశంలో ఏదో ఒక తప్పు చేసి కేసుల్లో ఇరుక్కొని వచ్చేవారు ఎక్కువ. అలాగే పల్లెటూళ్లలో పెత్తందార్ల ఆగ్రహానికిగురై అకారణంగా జైలుపాలైనవారూ ఉంటారు. అటువంటివారిని గుర్తించి వెంటవెంటనే విడుదల చేయగలిగితే జైళ్లు ఇంత చేటు కిక్కిరిసిపోయే అవకాశం ఉండదు.

ఇలాంటివారిని జైళ్లలో ఉంచటం వల్ల కలిగే మరో అనర్థం ఏమంటే... తప్పు చేయటం పెద్ద నేరమేమీ కాదన్న భావన వారిలో కలిగినా కలగొచ్చు. ఎన్‌డీటీవీ యాంకర్‌గా పనిచేసిన సునేత్రా చౌదరి ఆరేళ్లక్రితం రాసిన ‘బిహైండ్‌ బార్స్‌’ అనే పుస్తకం ఈ సంగతినే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా తిహార్‌ జైల్లో అడుగడుగునా కనిపించే అవినీతిని, సంపన్నుల ఇంట పుట్టి నేరాల్లో ఇరుక్కొని జైలుకొచ్చేవారికి దక్కే రాచమర్యాదలనూ పుస్తకం వివరిస్తుంది. కిరణ్‌ బేడీ తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నకాలంలో అక్కడ సంస్కరణలు చేపట్టినట్టు, అందువల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడేవి. కానీ ఆ తర్వాత అంతా మామూలే. 

సిబ్బంది కొరత, విచారణలో ఉన్న ఖైదీలకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవటం వంటి కారణాలవల్ల ఖైదీల పర్యవేక్షణ సక్రమంగా ఉండటం లేదు. దీన్ని అధిగమించటం కోసం కొందరు ఖైదీలను పర్యవేక్షకులుగా ఉంచే సంస్కృతి అన్నిచోట్లా కనబడుతోంది. ఇందువల్ల ఏ ఖైదీ మానసిక స్థితి ఎలావుందో, ఎవరికి వైద్య సాయం అవసరమో తెలిసే పరిస్థితి ఉండటం లేదు. జైళ్లలో తగినమంది సిబ్బందిని నియమించటం, అనవసరంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించటం వంటివి చేయగలిగితే మెరుగైన పర్యవేక్షణకు వీలవుతుంది.

అప్పుడు ఈ స్థాయిలో నేరగాళ్లు బరి తెగించే అవకాశం ఉండదు. సస్పెన్షన్లు, తొలగింపులు సిబ్బందిలో భయం కలిగిస్తాయన్నది నిజమే కావొచ్చు. కానీ అది తాత్కాలికమే. దానికి బదులు వారిపై పడే అదనపు భారాన్ని వదిలిస్తే సిబ్బంది మెరుగ్గా పనిచేయగలుగుతారు. అప్పుడు జైళ్లు నిజమైన సంస్కరణాలయాలుగా మారతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement