పద్దెనిమిదేళ్లనాటి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడైన బుకీ సంజీవ్ చావ్లాను భారత్‌కు అప్పగిస్తూ బ్రిటన్ న్యాయస్థానం తీహార్ జైలు స్థితిగతులపై సంతృప్తి వ్యక్తం చేసి పదిరోజులు కాలేదు. దేశంలోని ఇతర జైళ్లలో నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు కటువుగా వ్యాఖ్యానించాల్సివచ్చింది. అక్కడుంటున్న ఖైదీలు మీ దృష్టిలో మనుషులో కాదో చెప్పండని ధర్మాసనం నిలదీసింది. మన న్యాయస్థానాలు ఇలా వ్యాఖ్యానించడం ఇది మొదటిసారి కాదు. ఎన్నిసార్లు ఎంతగా చెబుతున్నా అధికార యంత్రాంగంలో ఆవగింజంత మార్పయినా కనబడటం లేదు. కనుకనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోయల్ ఫరీదాబాద్ జైలును స్వయంగా సందర్శించి అక్కడున్న పరిస్థితులకు దిగ్భ్రమచెందారు. పనికిమాలిన మరుగుదొడ్లు, ఎటుచూసినా మురుగునీరు, కట్టడిలేని కుళాయిలు, పెచ్చులూడుతున్న గోడలు చూసి అవాక్క య్యారు. న్యాయమూర్తులిద్దరూ సమర్పించిన నివేదిక ధర్మాసనాన్ని ఎంతగా కదిలించిందంటే సాధారణ ఖైదీలను కనీసం మనుషులుగా కూడా పరిగణించడంలేదని అర్ధమవుతున్నదని వ్యాఖ్యా నించింది. అక్కడికొచ్చినవారిని సంస్కరించడం మాట అటుంచి ఆ జైళ్లు మామూలు వ్యక్తులను సైతం కరడుగట్టిన నేరగాళ్లుగా మారుస్తున్నాయి.
మన జైళ్లలో ఉండేవాళ్లంతా శిక్ష అనుభవిస్తున్నవారు కాదు. అత్యధికులు అంటే 62 శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలు. 38శాతంమంది మాత్రమే శిక్షపడినవారు. విచారణ ఖైదీలపై ఉన్న ఆరోపణలను కోర్టులు విచారించి శిక్ష ఖరారు చేసేవరకూ వారిని నిర్దోషులుగానే పరిగణించాలి. విచారణ సమయంలో ఇలాంటివారికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి బెయిల్ లభించినా అందుకవసరమైన పత్రాలు సమర్పించే స్థోమత లేక, డబ్బు ఖర్చుపెట్టలేక జైళ్లలోనే ఉండిపోతున్నారు. కానీ మన అధికార యంత్రాంగం తీరు చూస్తుంటే జైళ్లకొచ్చేవారంతా నేరస్తులేనని భావిస్తున్నట్టుంది. వారిని కష్టపెట్టడం, కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా వేధిం చడం తమ కర్తవ్యమని విశ్వసిస్తున్నట్టుంది. ఈ తీరుతెన్నులపై వస్తున్న ఫిర్యాదుల్ని విచారించిన ప్పుడల్లా న్యాయస్థానాలు ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉన్నాయి. అవి ఏదో ఒక జవాబు చెబుతూ తప్పించుకుంటున్నాయి. మరోపక్క జైళ్లు రోజురోజుకూ దిగజారుతున్నాయి.
సామర్థ్యానికి మించి ఖైదీలుండటంతో అవన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా జైళ్లలో 150 శాతం మొదలుకొని 609 శాతం వరకూ అధికంగా ఖైదీలు ఉంటున్నారు. ఇలాంటి జైళ్లలో అసలు పర్యవేక్షణ సాధ్యమేనా? అక్కడుంటున్నవారు ఎలా బతుకుతారన్న స్పృహే లేకుండా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. నిజా నికి జైళ్లనేవి పరివర్తనాలయాలుగా ఉండాలి. తాము చేసింది తప్పిదమని గ్రహించి, తిరిగి అటు వంటి నేరానికి పాల్పడకూడదన్న వివేచన వారిలో కలగజేయాలి. సమాజంలో పక్కదోవపట్టిన కొందరిని కొన్నాళ్లపాటు ఆ సమాజానికి దూరంగా ఉంచడం, సంస్కరించడం జైళ్లు నెలకొల్పడం లోని ఉద్దేశం. కానీ అందుకు భిన్నంగా అవి నేరాలను ప్రోత్సహించే కేంద్రాలుగా తయారవుతు న్నాయి. నోరున్న ఖైదీలు సిబ్బంది ప్రాపకంతో తోటి ఖైదీలను వేధిస్తున్నారు. వారు చెప్పింది నమ్మి సిబ్బంది కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా క్షణికావేశంలో తప్పిదాలకు పాల్పడిన వారు, ఊళ్లల్లో పెత్తందార్ల కారణంగా కేసుల్లో ఇరుక్కున్న అమాయకులు నేరగాళ్లుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. విచారణలో ఉన్న ఖైదీలను వారి వారి నేరాల ప్రాతిపదికన విభజించి చూస్తే అత్యధికులు చిన్న చిన్న నేరాల్లో ఇరుక్కుని జైళ్లకొచ్చివారు.
ఆ కేసుల్ని వెనువెంటనే విచా రించే వ్యవస్థ ఉంటే అందులో చాలామంది నిర్దోషులుగా లేదా స్వల్ప శిక్షలతో బయటికెళ్లే అవకాశముంటుంది. దురదృష్టమేమంటే చాలామంది తాము చేసిన నేరాలకు అనుభవించాల్సిన కాలానికి మించి జైళ్లలో మగ్గుతున్నారు. జిల్లా స్థాయిలో పేరుకు విచారణ ఖైదీల సమీక్షా సంఘా లున్నాయి. అవి విడుదల కావాల్సిన ఖైదీల గురించి, బెయిల్ లభించిన ఖైదీల గురించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ అవి సక్రమంగా పనిచేయడంలేదు. వాటి పనితీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితావ్ రాయ్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కానీ ఆ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడంలో, దానికి అవసరమైన సిబ్బందిని కేటాయిం చడంలో కేంద్రం శ్రద్ధ చూపడం లేదు.
మన ప్రభుత్వాల నిర్లక్ష్యం చెప్పనలవికానిది. ఇందుకు శిక్ష విధించేట్టయితే చాలామంది అధికా రులు జైళ్లకెళ్లవలసి ఉంటుంది. జైళ్ల స్థితిగతుల గురించి మీ జవాబేమిటని దేశంలోని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలతో నోటీసులు పంపితే కేవలం 19 ప్రభుత్వాలనుంచి మాత్రమే స్పందన వచ్చింది. మిగిలిన ప్రభుత్వాలు చేష్టలుడిగి ఉండిపోయాయి. స్పందించిన ప్రభుత్వాలు సైతం కొన్నింటిని ఎంచుకుని జవాబిచ్చాయి. న్యాయస్థానం అడిగి నప్పుడు సంపూర్ణమైన వివరాలివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా వాటికి కరువైంది. అవి జవాబిచ్చిన మేరకు చూస్తే చాలా ప్రభుత్వాలు మైనర్ల విషయంలో చట్ట నిబంధనలను గాలికొదిలేస్తున్నాయన్న అభిప్రాయం కలుగుతున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వీరప్పమొయిలీ న్యాయశాఖ మంత్రిగా ఉండగా ఇకపై జైళ్లలో పరిమితికి మించి ఖైదీల్లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా కేసుల్ని న్యాయస్థానాలు త్వరితగతిన తేల్చేలా చర్యలు తీసుకోవడం, బెయిల్‌కు అర్హమైనవారు సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రభుత్వపరంగా తోడ్పాటునందజేయడం వగైరా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోయింది. నియంతలు రాజ్యమేలేచోట మాత్రమే ఇంతటి అధ్వాన్నమైన పరిస్థితులుంటాయి. దీన్నంతటినీ సరిదిద్దకపోతే మనది ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకోవడానికి కూడా అర్హులం కాదని ప్రభుత్వాలు గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment