
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు 2019తో పోలిస్తే 2020లో 18.3 శాతం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యా లు, రహదారి, రైల్వే, ఇతర ప్రమాదాల్లో 2019లో 17,938 మంది మృతిచెందగా, 2020లో ఆ మరణాల సంఖ్య 14,653కి తగ్గింది. మృతుల్లో 12,062 మంది పురుషులు, 2,590 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ప్రమాద మరణాలు–ఆత్మహత్యల నివేదిక–2020ను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రమాదాల్లో మరణించిన వారిలో 30నుంచి 45 ఏళ్ల వయసు వారు అత్యధికంగా 4,624 మంది ఉన్నారు.
రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గుదల
2019తో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గాయి. 2020లో 17,924 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. 19,675 మంది గాయాల పాలయ్యారు. 7,039 మంది మృతి చెందారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో 7,269 ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా 611 రైలు ప్రమాదాల్లో 613 మంది మరణించారు.
అతివేగం.. నిర్లక్ష్యమే కారణం
అతి వేగంతో 12,344 ప్రమాదాలు, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల 3,300 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల 414 మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 154, జంతువులను తప్పించబోయి 67 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాలు 20 మాత్రమే ఉన్నాయి. ఇతర కారణాలతో మిగిలిన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment