Road Accidents Prevention
-
జలాల్పురం చెరువుకట్టపై బారికేడ్లు ఏర్పాటు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్పురం (Jalalpuram) చెరువు కట్టపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బారికేడ్లు (Barricades) ఏర్పాటు చేశారు. గడిచిన పదిహేను రోజుల్లో రెండు కార్లు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ‘అసలే ఇరుకు.. ఆపై మలుపు’ అనే శీర్షికన ఈనెల 22న సాక్షి (Sakshi) మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రమాదాలు నివారించడానికి పోలీసులు చెరువు కట్టపై 11 భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.మెనర్ డ్రైవింగ్.. తల్లికి శిక్ష సిరిసిల్ల క్రైం: బాలుడు వాహనం నడుపుతూ ఒకరి మరణానికి కారణమైన కేసులో.. అతని తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం అందించిన వివరాలివి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో ఈ నెల 18న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. రుద్రంగి మండలానికి చెందిన గడ్డం లక్ష్మి.. మైనర్ అయినప్పటికీ తన కొడుక్కి వాహనం ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది.చదవండి: గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతిప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కంటే రాములు (72) తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌కు బైక్ ఇచ్చిన తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే.. పెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. -
అదే జరిగితే.. బతుకులు ‘రోడ్డు’న పడవు!
‘‘యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం’.. సినిమా డైలాగే కావొచ్చు.. ఇది అక్షర సత్యం. ఏదో ఒక పని మీద రోడ్ల మీదకొచ్చి.. ఇంటికి చేరుకునేలోపే ఛిద్రమవుతున్న బతుకులు ఎన్నో. మన దేశంలో ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది కూడా. తప్పేవరిదైనా.. శిక్ష మాత్రం ఆ కుటుంబాలకే పడుతోంది.ఇరుకు రోడ్లు మొదలుకుని.. గల్లీలు, టౌన్లలో, రద్దీగా ఉండే సిటీ రోడ్లపైన, విశాలమైన రహదారుల్లోనూ.. ప్రమాదాలనేవి సర్వసాధారణంగా మారాయి. మనదేశంలో ప్రతీరోజూ రోడ్డు ప్రమాదాల్లో లెక్కలేనంత మంది మరణిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలేవీ ఫలించినట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాంకేతికత’నే మరోసారి నమ్ముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏఐ.. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(కృత్రిమ మేధస్సు). సోషల్ మీడియాలో కేవలం వినోదాన్ని అందించే సాధనంగానే చూస్తున్నారు చాలామంది. కానీ, దాదాపు ప్రతీ రంగంలోనూ ఇప్పుడు దీని అవసరం పడుతోంది. ప్రపంచం అంతటా.. ఏఐ మీద కళ్లు చెదిరిపోయే రేంజ్లో బిజినెస్ నడుస్తోంది. కానీ, ఇలాంటి టెక్నాలజీ సాయంతోనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తే ఎలా ఉంటుంది?.ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించేది ఏ దేశంలోనో తెలుసా?మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా రోడ్ల నిర్మాణం, వాటి రిపేర్ల కోసం అయిన ఖర్చు ఘనంగానే ఉంది. అయినప్పటికీ కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. పెరిగిన రద్దీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, సురక్షిత ప్రయాణ పద్దతుల(సేఫ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్) మీద వాహనదారుల్లో అవగాహన లేకపోవడం.. వీటితో పాటు ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం, పేలవమైన రోడ్ల నిర్వహణ, భద్రతా చర్యలు సరిపోకపోవడంలాంటివి నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.2022లో.. అధికారిక గణాంకాల ప్రకారం 4,60,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 1,68,491 మంది మరణించగా.. 4,43,366 మంది గాయపడ్డారు.2023లో.. 4,12,432 యాక్సిడెంట్లు జరిగితే 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది క్షతగాత్రులయ్యారు.ఈ లెక్కల ఆధారంగా.. రోడ్డు ప్రమాదాలు 11 శాతం పెరిగితే.. మరణాలు దాదాపు 10 శాతం, గాయపడినవాళ్ల సంఖ్య 15 శాతం పెరుగుతూ వచ్చింది.అరికట్టడం ఎలా?సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(CRRI).. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో 2008 నుంచి 2021 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించింది. దాదాపు 30 లక్షలకుపైగా జనాభా ఉన్న నాగ్‌పూర్‌లో.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడాదికి సగటున 200 మంది చనిపోతున్నారు. గాయపడేవాళ్ల సంఖ్య 1000కి పైనే ఉంటోంది. మహారాష్ట్రలో ఇదే అధికమని తేలింది.ఈ అధ్యయనం ఆధారంగా.. సాంకేతికతకు ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ను జత చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గించొచ్చని చెబుతున్నారు. అదెలాగంటే.. ఏఐను ఉపయోగించి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌ను రూపొందించడం. ఇందులోనే ఆడియో, వీడియో వ్యవస్థలను కూడా రూపొందించారు.ఎలాగంటే.. ఈ సిస్టమ్‌ను వాహనాల విండ్ షీల్డ్(ముందు ఉండే అద్దాలకు) అమర్చడం ద్వారా ముందు ఉన్న రోడ్లను పూర్తిగా స్కాన్ చేస్తుంది. ముందు ఏదైనా ముప్పు పొంచి ఉంటే గనుక.. ఆ ఆడియో లేదంటే వీడియో అలారమ్ ద్వారా వాహనం నడిపేవాళ్లను అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ప్రమాదాలను తృటిలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. కేవలం కార్లు, భారీ వాహనాలకే కాదు.. ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు, వీధుల్లో తిరిగే జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది.ఆచరణలోకి వచ్చిందా?అవును.. నాగ్‌పూర్‌లోనే సెప్టెంబర్ 2021లో iRASTE ప్రాజెక్టు ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, తద్వారా కొందరి ప్రాణాలైనా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ వాహనాలను కాకుండా.. ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. నాగపూర్ అర్బన్-పెరి అర్బన్ రోడ్డు నెట్‌వర్క్‌లో నడిచే సుమారు 150 బస్సులకు ఏఐ టెక్నాలజీ కెమెరాలను అమర్చారు. కనీసం 2.5 సెకండ్ల తేడాతో ప్రమాదం జరిగే ముందు.. ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేసేవి. అలా.. రెండేళ్లకు పైగా ఈ పైలట్ ప్రాజెక్టును. బ్లాక్,గ్రే పాయింట్లుగా విభజించి పరిశీలించారు. ఫలితం ఇలా.. ఐఆర్ఏఎస్టీఈ ప్రాజెక్టు క్రమక్రమంగా మెరుగైన ఫలితం చూపించడం మొదలుపెట్టింది. సకాలంలో డ్రైవర్లు స్పందించడంతో ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగారు. అయితే ఇది 100కు వంద శాతం సక్సెస్‌ను(66%) ఇవ్వలేకపోయింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య మాత్రం అంతేస్థాయిలో కొనసాగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. జులై 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య.. నాగ్‌పూర్ గ్రే స్పాట్స్‌లో డ్రైవర్లు సకాలంలో ప్రమాదాలు జరగకుండా చూడగలిగారు. తద్వారా.. 36 మంది ప్రాణాలు నిలబడ్డాయి.మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశం మనది. 2018-2022 మధ్య తమిళనాడులో రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మరణాలు మాత్రం ఉత్తర ప్రదేశ్‌లో సంభవించాయి. 2021, 2022 సంవత్సరాల్లో 22,595.. 21,227 మంది మరణించారు. వీటిల్లో ఓవర్ స్పీడ్ మరణాలే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి దేశంలో 2030నాటికల్లా.. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టం(ప్రాణ, వాహన నష్టం) 50 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ఏఐ సంబంధిత వాహనాలను రోడ్లపైకి తేవాల్సిందేనంటున్నారు మేధావులు. ఇది ఒక తరహా ఆలోచన మాత్రమేనని.. మరిన్ని అవకాశాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నారు వాళ్లు. తద్వారా మరిన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా చూడొచ్చని చెబుతున్నారు. -
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్ స్కూల్లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్షాప్లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్సేవర్కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్. -
ప్రమాదాల నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం చెన్నైకు చెందిన చోలమండలం రిస్క్ సర్వి సెస్ లిమిటెడ్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రెప్ప పాటులో జరిగే ప్రమాద వేళల్లో డ్రైవర్లు చురుగ్గా స్పందించ గలిగితే ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఈ సంస్థ కొన్నేళ్లుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంతకాలం సొంత నిపుణులతో డ్రైవర్లకు శిక్షణ ఇప్పించిన ఆర్టీసీ, ఇప్పుడు తొలిసారి బయటి నిపుణులతో తర్ఫీదునిప్పిస్తోంది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు నిరంతరాయంగా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎందుకీ శిక్షణ అంటే... సాలీనా సగటున 600 ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాల్లో భాగమవుతున్నాయి. ఇందులో ప్రాణాంతక ప్రమాదాలు దాదాపు 200వరకు ఉంటున్నాయి. సగటున ఏడాదికి 300 మంది చనిపోతున్నారు. ఇది ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది. మరోవైపు ప్రమాద మృతులు, బాధితుల కుటుంబాలకు ఏడాదికి సగటున రూ.50 కోట్ల వరకు ఆర్టీసీ పరిహారంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇటీవల ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. పైగా బస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఆర్టీసీలో 15 శాతం వరకు మాత్రమే అద్దె బస్సులుండేవి. ఇప్పుడు సొంత బస్సులు కొనటం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు క్రమంగా నిబంధనలు సవరించి అద్దె బస్సుల సంఖ్య పెంచుకుంటోంది. ప్రస్తుతం మూడో వంతుకు అవి చేరుకున్నాయి. అద్దె బస్సులకు డ్రైవర్ల కొరత... ఆర్టీసీ డ్రైవర్లకు పనిభారం అద్దె బస్సులు దాదాపు 3 వేలకు మించిపోయాయి. ఈ అద్దె బస్సులకు వాటి నిర్వాహకులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సరైన డ్రైవర్లు దొరకని సందర్భంలో లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లను పిలిపించి బస్సులు అప్పగిస్తున్నారు. సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేని కారణంగా వారు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇక మెరుగైన శిక్షణ ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై ప్రస్తుతం విపరీతమైన పని భారం ఉంటోంది. ఆదాయం కోసం బస్సులను ఎక్కువగా తిప్పాల్సి రావటం, దీంతోపాటు డ్రైవర్ల కొరత వల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి రావటం, బస్సులు పాతబడిపోవటం.. ఇలా రకరకాల కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో సొంత డ్రైవర్లు, అద్దె బస్సు డ్రైవర్లు.. అందరికీ మంచి శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. రీజియన్ల వారీగా శిక్షణ చోలమండలం రిస్క్ సర్వీసెస్ లిమిటెడ్ మూడు బ్యాచ్‌ల శిక్షకులను పంపుతోంది. రీజియన్ల వారీగా డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. తొలుత సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి రీజియన్లతో ఈ శిక్షణ ప్రారంభిస్తారు. రీజియన్ కేంద్రాల్లోనే ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 50 మంది డ్రైవర్లను ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ ఇస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పద్ధతిలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో గతంలో చోటుచేసుకున్న భారీ ప్రమాదాలను ఉదాహరణగా తీసుకుని, వాటి ఫొటోలు, వీడియోలు, ప్రమాదానికి కారణమైన ప్రాంతం, బస్సు, ఎదురు వాహనం.. ఇలా దృశ్యాలు చూపుతూ.. ప్రమాదాలకు కారణం, అలాంటి సమయంలో డ్రైవర్లు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదం జరగబోతోందని గ్రహించిన క్షణంలో డ్రైవర్లు ఏం చేయాలి.. తదితరాలను శిక్షణలో వెల్లడిస్తారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. -
సిబిల్ స్కోర్ తరహాలోనే.. డ్రైవింగ్‌కూ స్కోర్! కేంద్రం కీలక నిర్ణయం?
సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులు అంత సులువుగా రుణాలు ఇస్తాయి. అలాగే డ్రైవింగ్ స్కోర్ ఎక్కువ ఉంటే వాహనాల బీమా, కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. – సాక్షి, అమరావతి ప్రమాదాలను తగ్గించేలా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రత లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం.. వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘రహదారి భద్రతా ప్రణాళిక 2.0’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారంతా దీని పరిధిలోకి వస్తారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవర్ల క్రమశిక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాలు, పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్ క్రమశిక్షణకు స్కోర్ ఇస్తారు. స్కోర్ ఆధారంగా ప్రోత్సాహకాలు డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. వీటిపై కేంద్ర రవాణా శాఖ వాహనాల తయారీ కంపెనీలు, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుని 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడీఏఎస్ ఏర్పాటు.. రెండో దశలో కార్లు, ఎస్‌యూవీలు, ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్)ను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇది డ్రైవర్ నావిగేషన్‌కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడీఏఎస్ను ఇప్పటికే విద్యుత్ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వరలో పెట్రోల్, డీజీల్ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్‌ను నిర్ణయిస్తారు. -
సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
న్యూఢిల్లీ: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. -
సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్, సెల్ ఫోన్ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి. గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. -
4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1 శాతం, బాధితుల సంఖ్య 14.8 శాతం తగ్గినట్టు చెప్పింది. ‘‘మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగింది. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. దేశంలో రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 422 మంది మరణిస్తున్నారు’’ అని తెలిపింది. ► 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే! 18–60 ఏళ్లలోపు వారు 84.5 శాతం మంది. ► గతేడాది 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 31.2 శాతం జాతీయ రహదారులపై, 23.4 శాతం రాష్ట్ర రహదారులపై, 45.4 శాతం ఇతర రోడ్లపై జరిగాయి. ► 2021లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది మరణించారు. ► రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు. ► పమాదాల్లో ద్విచక్ర వాహనాలదే ప్రధాన వాటా. కార్లు, జీపులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. -
‘లైట్’ తీస్కోవద్దు.. హెడ్ లైట్లు, వెనక లైట్లు వేసుకోని వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కనీసం పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉదయం పూట మంచు కురిసే వేళలో సరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతోనే తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఉదంతంలోనూ పొగమంచే ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే చలికాలం మొదలైంది. మరో రెండు మూడు నెలల పాటు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటే దట్టమైన పొగ మంచు కూడా కమ్ముకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైవేలపై వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లైట్ ఆర్పితే అంతే సంగతులు.. ►దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెడ్లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. ►ప్రధాన రహదారులపై డివైడర్ల వల్ల ఎదురెదురు వాహనాలు ఢీకొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యు ఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టమవుతోంది. ►సాధారణంగా హైవేలపై కార్లు, ఇతర వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు 50 నుంచి 60 కి.మీ వేగం మించకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. వెనక లైట్లూ వెలగాలి.. ►రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్ లైట్లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు. ►వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయాలు శ్రేయస్కరం.. చలికాలంలో పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొట్టుకోవటం, రోడ్డు సరిగా కనిపించక వాహనాలు దారితప్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 10.30 లోపు, ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ప్రయాణించాలన్నారు. రెండేళ్ల కాలంలో 50 మంది మృత్యువాత.. గత రెండేళ్లలో శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల డేటాను ఆయన విశ్లేషించారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల వెంబడి కుటుంబ సబ్యులతో వాహనాల్లో ప్రయాణించడం ఇబ్బందికర విషయమన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయాల్సి వస్తే.. సొంత డ్రైవింగ్ కాకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అది కూడా డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలని సూచించారు. ‘బే’లలోనే పార్కింగ్.. ట్రక్లు, ఇతరత్రా పెద్ద వాహనదారులు శీతాకాలంలో ఓఆర్ఆర్, హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపకూడదు. రాత్రి సమయంలో విశ్రాంతి కోసం తప్పనిసరి పరిస్థితులలో వాహనాలను నిలపాల్సి వస్తే... రోడ్డు నుంచి పూర్తిగా ఎడమ వైపు తీసుకొని వాహనాలను పార్కింగ్ చేయాలి. ఓఆర్ఆర్, హైవేలపై కేటాయించిన పార్కింగ్ బే, లైన్లలోనే ఆయా వాహనాలను నిలిపివేయాలి. లేకపోతే పొంగమంచుతో ప్రయాణిస్తున్న చిన్న వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నిద్ర మత్తు వీడాలి.. ► తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వానాలను నడపకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఎలాంటి నిద్రమత్తు లేకుండా ఉండాలి. ► రెప్పపాటు క్షణంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకవైపు మంచు కురుస్తుండగా, మరోవైపు నిద్రమత్తుతో బండి నడిపితే రోడ్డు ప్రమాదాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు. -
బ్లాక్స్పాట్లకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రమాదకర మలుపుల వద్ద రహదారి భద్రత చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర రహదారి భద్రత కమిటీ సర్వే నిర్వహించింది. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు ఎక్కువమంది దుర్మరణం చెందుతున్న బ్లాక్స్పాట్లను గుర్తించింది. అటువంటి బ్లాక్స్పాట్లు రాష్ట్రంలో 300 ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. గత మూడేళ్లలో ఆ బ్లాక్స్పాట్లలో ఏకంగా 5,708 మంది దుర్మరణం చెందారని గుర్తించింది. దీంతో ఆ బ్లాక్స్పాట్ల వద్ద ఏటా రూ.400 కోట్లతో భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. గుంటూరు జిల్లాలో ఎక్కువ బ్లాక్స్పాట్లు రాష్ట్రంలో రహదారి భద్రత కోసం ప్రభుత్వం పోలీసు, రవాణా, వైద్య–ఆరోగ్య శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై ఈ కమిటీ సర్వే చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకుగాను 23 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 300 బ్లాక్స్పాట్లలో మూడేళ్లలో 5,708 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 15 బ్లాక్స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1,383 మంది దుర్మరణం చెందారు. ఆ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో బాపట్ల, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. బాపట్లలో 15 బ్లాక్స్పాట్ల వద్ద 328 మంది మృతిచెందగా, తిరుపతి జిల్లాలో 15 బ్లాక్స్పాట్లలో 282 మంది మృత్యువాత పడ్డారు. బ్లాక్స్పాట్ల వివరాలు డీఆర్సీలకు.. బ్లాక్స్పాట్ల వద్ద రూ.400 కోట్లతో అమలు చేయనున్న రహదారి భద్రత చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, స్పీడ్గన్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారులు బృందాలతో వాహనాల తనిఖీ చేపట్టడం, అంబులెన్స్‌ల ఏర్పాటు, ఆ సమీపంలోని ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరచడం వంటివి చేపడతారు. రహదారి భద్రత కమిటీ బ్లాక్ స్పాట్ల వివరాలను ఆయా జిల్లా అభివృద్ధి మండళ్లకు(డీఆర్సీలకు) సమర్పించింది. ఈ ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులను జిల్లా భద్రత కమిటీల ఆధ్వర్యంలో చేపడతారు. బ్లాక్స్పాట్ల వద్ద భద్రత చర్యలను మెరుగుపరిచిన ఏడాది తరువాత పరిస్థితి సమీక్షిస్తారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గిందీ లేనిదీ పరిశీలిస్తారు. తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఐదేళ్లపాటు బ్లాక్స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడడంలో ‘సీటు బెల్టు’ కీలక పాత్ర
మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. ఇవీ స్థూలంగా కార్ల వంటి తేలికపాటి వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ఆయన దుర్మరణం చెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీటు బెల్టు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో సీటు బెల్టు పనితీరు, సీటు బెల్టు–ఎయిర్‌బ్యాగ్‌ల అనుసంధానం, ఒక్కోసారి సీటుబెల్టు పెట్టుకున్నా ప్రమాదాల్లో మృతిచెందేందుకు ఉన్న అవకాశాల వంటి వాటిపై కథనం. సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు.. కార్ల వంటి ఇతర వాహనదారులు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి. కానీ దేశంలో ఎక్కడా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల జరిమానాలకు భయపడి సీటు బెల్ట్‌లు ధరిస్తున్నా హైవేలపై ప్రయాణాల్లో మాత్రం చాలా మంది సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంలేదు. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొనే వారు మినహా మిగిలిన వారు వాటిని ఉపయోగించట్లేదు. ఫలితంగా ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. సీటు బెల్ట్ ధరించకపోతే అలారం మోగేలా కార్ల తయారీ కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి చాలా మంది సీట్ బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ను వినియోగిస్తున్నారు. వాటిని కార్ డెకార్స్ దుకాణాలు విక్రయిస్తున్నాయి. అయితే ఈ బకెల్స్ ద్వారా అలారం మోగకుండా ఆపినా ప్రమాదం జరగకుండా ఆపలేవని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాలు నిలిపిన ‘బెల్ట్’... ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో సీటుబెల్ట్ పెట్టుకోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. బెల్ట్ వాడని ఫలితం.. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరో ముగ్గురితో కలసి 4న అహ్మదాబాద్–ముంబై హైవేపై వెళ్తుండగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ హైఎండ్ కారు ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు ధరించిన ముందు సీట్లోని ఇద్దరు గాయాలతో బయటపడగా వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ, మరొకరు సీటు బెల్టు ధరించకపోవడంతో మృతిచెందారు. సీటు బెల్ట్ ధరించకుంటే.. ► నిర్ణీత వేగంతో వెళ్తున్న కారులో ప్రయాణికులు స్థిరంగా కూర్చున్నప్పటికీ వాహనం దేన్నయినా గుద్దుకున్నా లేదా హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా అందులోని వారు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ► ఫలితంగా వాళ్లు డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు), ముందు సీట్ల మధ్యలో ఉన్న ఖాళీ నుంచి అద్దం తదితరాలను అత్యంత వేగంగా ఢీకొంటారు. ► ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి లేదా డోర్ ఊడిపోతే అందులోంచి బయటకు ఎగిరి పడతారు. ఫలితంగా తల, ముఖం తదితర చోట్ల తీవ్ర గాయాలై మరణిస్తుంటారు. సీటు బెల్ట్ ధరిస్తే.. ► సీటు బెల్ట్ ధరించి ప్రయాణిస్తుప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నా లేదా కారు పల్టీలు కొట్టినా లేదా ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చినా ప్రయాణికులు వాహనంలోంచి ఎగిరిపడిపోకుండా కాపాడుతుంది. ► ముఖ్యంగా ప్రయాణికులు డ్యాష్ బోర్డు లేదా ముందు సీట్లకు గుద్దుకోకుండా సీటు బెల్ట్ వ్యతిరేక శక్తిని ప్రయోగిస్తుంది. ► ఫలితంగా ప్రయాణికులు కేవలం గాయాలతో బయటపడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ► 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన సతీమణి, డ్రైవర్ అక్కడికక్కడే కన్నుమూశారు. సీటు బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కోసారి ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నా... అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉండే హైఎండ్ కార్లు సైతం కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపడలేవని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ సెన్సర్లు యాక్టివేట్ అయి, తెరుచుకోవడానికి కొంత సమయం పడుతుందని.. సాధారణంగా ఇది 0.05 సెకన్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్ స్టీరింగ్ వరకు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్ వరకు ప్రయాణించి బలంగా ఢీకొనడం జరిగిపోతుందని వివరిస్తున్నారు. స్పందించేందుకు సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ముప్పు కనిపించినప్పుడు స్పందించి బ్రేక్ వేయడానికో లేదా పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమింది. ఈ మధ్యలోనే వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీలు అనేకం.. హైఎండ్ కార్లలో ఎయిర్ బ్యాగ్‌కు–సీట్ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ (ఏసీయూ)కు అనుసంధానమై ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరిగిపోతుంది. సీటు బెల్ట్‌లు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు. -
తగ్గిన ప్రమాద మరణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు 2019తో పోలిస్తే 2020లో 18.3 శాతం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యా లు, రహదారి, రైల్వే, ఇతర ప్రమాదాల్లో 2019లో 17,938 మంది మృతిచెందగా, 2020లో ఆ మరణాల సంఖ్య 14,653కి తగ్గింది. మృతుల్లో 12,062 మంది పురుషులు, 2,590 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ప్రమాద మరణాలు–ఆత్మహత్యల నివేదిక–2020ను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసింది. ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రమాదాల్లో మరణించిన వారిలో 30నుంచి 45 ఏళ్ల వయసు వారు అత్యధికంగా 4,624 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గుదల 2019తో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గాయి. 2020లో 17,924 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. 19,675 మంది గాయాల పాలయ్యారు. 7,039 మంది మృతి చెందారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో 7,269 ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా 611 రైలు ప్రమాదాల్లో 613 మంది మరణించారు. అతివేగం.. నిర్లక్ష్యమే కారణం అతి వేగంతో 12,344 ప్రమాదాలు, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల 3,300 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల 414 మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 154, జంతువులను తప్పించబోయి 67 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాలు 20 మాత్రమే ఉన్నాయి. ఇతర కారణాలతో మిగిలిన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
ప్రాణదాతలకు గుర్తింపు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎంత వీలయితే అంత వేగంగా ఆస్పత్రిలో చేర్చితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అయితే మనకెందుకులే అనే ధోరణి, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయేమో అనే భయాలతో పౌరులు చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు. దీన్ని నివారించి, రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా సాధారణ ప్రజల్లో స్ఫూర్తిని కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాణ దాతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వనుంది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో (గోల్డెన్ అవర్–గంటలోగా) ఆస్పత్రికి చేర్చినా లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన వారిని గుడ్ సమారిటన్గా గుర్తించి రూ. 5,000లు నగదుతో పాటు జాతీయ స్థాయి ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాధారణ ప్రజలపై కేసులు, వేధింపులు ఉండకుండా ఈ పథకాన్ని రూపొందించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పథకం అమలు ఇలా.. ► ప్రాణాంతక రోడ్డు ప్రమాదంలో మెదడు గాయాలు, వెన్నుపూస గాయాలకు సంబంధించిన బాధితులను లేదా శస్త్ర చికిత్స, చికిత్స కోసం కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి కలిగిన క్షతగాత్రులను గంటలోగా ఆస్పత్రికి చేర్చిన వారిని గుడ్ సమారిటన్గా గుర్తించి మొదటగా రూ. 5 వేల నగదుతోపాటు ప్రశంసా పత్రం అందిస్తారు. ► పలు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడిన ఒక్కో వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు గుడ్ సమారిటన్గా గుర్తించి అవార్డులను ఇస్తారు. ► మొత్తం ఏడాదిలో గుడ్ సమారిటన్ల నుంచి జాతీయ స్థాయిలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున నగదు అవార్డును కేంద్రం ఇవ్వనుంది. ► ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలైనంత త్వరగా రాష్ట్రాలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి వివరాలను పంపిస్తే ముందస్తుగా ఐదు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. -
ట్రక్ డ్రైవర్లకు డ్రైవింగ్ గంటలు!
సాక్షి, న్యూఢిల్లీ: కమర్షియల్ ట్రక్ డ్రైవర్ల అలసట, నిద్రలేమి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పైలట్ల మాదిరిగానే ట్రక్ డ్రైవర్లకు సైతం రోజుకి ఎంతసేపు వాహనాన్ని నడపాలన్న విషయంలో డ్రైవింగ్ గంటలను నిర్ణయించాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాణిజ్య ట్రక్కు డ్రైవర్ల నిద్రలేమి కారణంగా జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై మంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ (ఎన్ఆర్ఎస్సి) సమావేశంలో ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ ఏడాది జూలై 28న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి 13 మంది నాన్–అఫీషియల్ కో–ఆప్టెడ్ వ్యక్తిగత సభ్యులు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే విషయంలో సభ్యులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. యూరోపియన్ ప్రమాణాలను అనుసరిస్తూ కమర్షియల్ వాహనాల్లో ఆన్‌బోర్డ్ స్లీప్ డిటెక్షన్ సెన్సార్ల ఏర్పాటుపైనా చర్చించారు. కనీసం రెండు నెలలకోసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షించుకోవాలని కౌన్సిల్‌ని గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతపై చర్చించేందుకు క్రమం తప్పకుండా రహదారి భద్రత కమిటీల సమావేశాలు జరిగేలా చూడాలని రాష్ట్రాలకు లేఖలు రాయనున్నట్లు గడ్కరీ తెలిపారు. -
గుంతల్లేని రహదారుల కోసం రూ.303 కోట్లు
సాక్షి, అమరావతి: గుంతల్లేని రహదారుల కోసం ఏపీలో రూ.303 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 వేల కి.మీ. మేర రహదారులపై గుంతల్ని పూడ్చనున్నారు. ఇందులో 2,060 కి.మీ మేర జిల్లా రహదారులకు రూ.197 కోట్లు, 940 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. రోజుకు 6 వేల వాహనాలు వెళ్లే రోడ్లపై గుంతల్లేకుండా చేయనున్నారు. వర్షాకాలం సీజన్ ముగియడంతో వెంటనే పనులు చేపట్టేందుకు ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచి పనులు కేటాయించనున్నారు. రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ మేర రోడ్లు, వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ► ఏపీలో రహదారులపై గుంతల కారణంగా గతేడాది జరిగిన 96 రోడ్డు ప్రమాదాల్లో 32 మంది మృతి చెందగా, 149 మంది గాయపడ్డారు. ► మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ గణాంకాల ప్రకారం వంతెనలపై ప్రమాదాల కారణంగా 268 మంది మరణించగా, కల్వర్టుల వద్ద 121 మంది మృత్యువాత పడ్డారు. ► దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా రహదారులపై గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు, తద్వారా మరణాలు చోటు చేసుకున్నాయి. 2,122 ప్రమాదాల్లో 1,034 మంది మరణించారు. ► ఏపీలో 1,100 వరకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిని సరిచేసేందుకు రవాణా, పోలీస్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్)పై ముఖ్య కూడళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్–44పై అనంతపురం జిల్లా పరిధిలో తపోవనం జంక్షన్ ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారిపై పెన్నార్ భవన్ జంక్షన్, పంగల్ రోడ్, రుద్రంపేట ఫ్లై ఓవర్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ► ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా రహదారి)పై అధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, విజయవాడ–విశాఖ మధ్య ప్రమాదకర మలుపులు, జంక్షన్లు ఉన్నాయి. ఈ మేరకు ఇటీవలే రవాణా శాఖ.. రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించింది. -
ప్రాణం విలువ తెలియాలనే..
సాక్షి, అమరావతి: ప్రాణం విలువ తెలుసుకోవాలనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు భారీగా పెంచామని, దీన్ని సామాజిక బాధ్యతగా భావించామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. కఠిన నిర్ణయాలు, జరిమానాలు విధిస్తే రహదారి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారిలో మార్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ జరిమానాలతో కట్టడి చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ముఖ్య విధి అని, ఆ దిశగా ఆలోచించే జరిమానాలు పెంచామని, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. ‘దీనిపై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మోటారు వాహనాల నిబంధనలు పాటించని వారిని సమర్థిస్తున్నాయా? ఈ అంశంపై హేళనగా మాట్లాడేవారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?’ అని ప్రశ్నించారు. మంత్రి పేర్ని నాని ఈ అంశంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివీ.. నామమాత్రపు జరిమానాలతో పదేపదే ఉల్లంఘనలు నామమాత్రపు జరిమానాల వల్ల కొందరు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపితే అతనొక్కడే కాదు.. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తే వందే కదా అని నిర్లక్ష్యం వీడట్లేదు. అదే రూ.వెయ్యి విధిస్తే కొంత జాగ్రత్త ఉంటుంది. వాహన చోదకులు చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకూడదనే జరిమానాలు పెంచాం. ఆదాయంకోసం కానే కాదు ట్రాఫిక్ ఉల్లంఘనలపై కాంపౌండింగ్ ఫీజులు పెంచడం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫీజుల పెంపు వల్ల ఏడాదికి రూ.150 కోట్లు ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రజాసంక్షేమం కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ జరిమానాలతో వచ్చే ఆదాయం లెక్క కాదు. కేవలం ప్రజలు బాధ్యత విస్మరించకూడదనే ఈ పెంపుదల చేపట్టాం. వర్షాకాలం ముగియగానే గుంతలు పూడుస్తాం గత 77 రోజుల నుంచీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రోడ్లపై గుంతలు ఏర్పడటం సహజం. వీటిపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తూ.. జరిమానాలు తర్వాత విధించండి.. ముందు రోడ్లు బాగు చేయండని వెటకారంగా మాట్లాడుతున్న వారిని ఏమనాలో అర్థం కావట్లేదు. వర్షాకాలం ముగిసిన వెంటనే గుంతలన్నీ పూడ్చేలా రూ.2,500 కోట్లతో మరమ్మతులు చేసేందుకు సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రాణం విలువ తెలుసు కాబట్టే.. నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝళిపిస్తుంటే ప్రతిపక్షాలు యాగీ చేస్తాయా? ప్రతిపక్ష నేతలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపే వారికి దన్నుగా నిలుస్తారా? రోడ్డు ప్రమాదాలకు కారకులయ్యే వారికి జరిమానాలు వద్దా? ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని సహకరించాలి కానీ ఇలా హేళనగా మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దు. ప్రాణాల విలువ తెలిసిన సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాణాలు విలువ తెలియని వారి గురించి ఏమీ మాట్లాడలేం. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాల పెంపు
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ చట్టానికి అనుగుణంగా.. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన కేంద్రం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి నుంచి కాంపౌండింగ్ ఫీజులు భారీగా వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సైతం కేంద్రం సూచనలకు అనుగుణంగానే రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే ఉద్దేశంతో కేంద్రం, సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రంలో జరిమానాలు పెంచారు. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ద్విచక్ర వాహనం, క్యాబ్‌లు, ఆటోలు, ఏడుసీట్ల సామర్థ్యం ఉన్న తేలికపాటి మోటారు వాహనాలు ఒక విభాగంగాను, భారీ వాహనాలు మరో విభాగంగాను ప్రభుత్వం జరిమానాలను పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల తయారీలో మార్పులు, చేర్పులు చేస్తే డీలర్లకు, తయారీ సంస్ధలకు, అమ్మినవారికి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఇవీ జరిమానాలు ► డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేనివారికి వాహనం ఇస్తే రూ.10 వేలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు, వేగంగా నడిపితే రూ.వెయ్యి, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు. ► రేసింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు. ► రిజిస్ట్రేషన్, రెన్యువల్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు. అదే భారీ వాహనాలకు మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.8 వేలు. పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు. ► వాహనంతో అనధికారికంగా ప్రవేశిస్తే రెండు కేటగిరీలకు రూ.వెయ్యి. ► వాహనాల తనిఖీ విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా రూ.750, భారీ వాహనాలకు రూ.వెయ్యి. అనుమతి లేని, అర్హతకంటే తక్కువ వయసు వారికి వాహనం ఇస్తే రెండు కేటగిరీలకు రూ.5 వేలు. ► ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం. వాహనం బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు. ఎమర్జెన్సీ (అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీసులు) వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు. ► అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు. రోడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినా, శబ్ద, వాయు కాలుష్యం నియంత్రించకపోయినా తేలికపాటి వాహనాలకు రూ.1,500, భారీ వాహనాలకు రూ.3 వేలు. ► బీమాపత్రం లేకపోతే 2 కేటగిరీలకు మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.4 వేలు. పబ్లిక్ లయబిలిటీ సర్టిఫికెట్ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.4 వేలు. -
మారిన మనుషులు
రాజాం: మద్యం మహమ్మారి కోరలు అణచడంతో పచ్చని పల్లెల్లో ఇప్పుడు ప్రశాంతత రాజ్యమేలుతోంది. మద్యానికి బానిసై ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సమాజంలో తమకు లభిస్తున్న గౌరవ మర్యాదలతో ఇన్నేళ్లుగా తామేం కోల్పోయామో తెలుసుకుని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాగుడుకు డబ్బుల కోసం తాము వేధించిన కుటుంబీకుల చేతుల్లోనే కష్టార్జితాన్ని పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వేలాది కుటుంబాల్లో ఇప్పుడీ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జన దృష్టితో ఆలోచించకుండా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మద్య నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటమే ఈ పెను మార్పులకు కారణం. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ హయాంలో 237 మద్యం దుకాణాలుండగా ప్రస్తుతం 187 మాత్రమే మిగిలాయి. గతంలో 1,203 బెల్టు షాపులుండగా ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడంతో గ్రామాలు ఘర్షణలకు దూరంగా ఉన్నాయి. గతేడాది జిల్లాలో 563 రోడ్డు ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాది ఇప్పటివరకు 134 ఘటనలే నమోదయ్యాయి. అంతా గౌరవిస్తున్నారు గతంలో మా గ్రామంలో బెల్టుషాపులు వద్ద మద్యం ఏరులై ప్రవహించేది. రాజాంలో వైన్‌షాపులు నిత్యం తెరిచి ఉండేవి. రెస్టారెంట్లు రాత్రిపగలు పనిచేసేవి. ఏడాది నుంచి ఇవన్నీ కట్టడి అయ్యా యి. నాకు మద్యం అలవాటు ఉండటంతో తొలుత ఇబ్బంది పడ్డా. ధరలు పెరగడంతో నాలుగు నెలలుగా మద్యం జోలికి పోలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రోజూ చక్కగా పొలం పనులు చేసుకుంటున్నా. గతంలో తలనొప్పి, కడుపు నొప్పి లాంటి సమస్యలు ఉండేవి. భోజనం తినాలని అనిపించేది కాదు. ఇప్పుడు మూడు పూటలా తింటున్నా. నా కుటుంబంలో ఇప్పుడు నాకెంతో గౌరవం ఉంది. మా ఊర్లో, సమాజంలో నా మాటకు విలువ పెరిగింది. కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. నిజంగా సీఎం జగన్మోహన్రెడ్డి మాకు దైవంతో సమానం. –శనపతి జంపయ్య, పొగిరి గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా డబ్బులు నీళ్లలా ఖర్చయ్యేవి.. మద్యానికి బానిస కావడంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో మా గ్రామంలో బెల్టు షాపులుండటంతో తాగుడుకు డబ్బులు నీళ్లలా ఖర్చయ్యేవి. ఇప్పుడు వీటిని నిర్మూలించడంతో నాతో పాటు చాలామంది ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. అనారోగ్య సమస్యలు కూడా తీరిపోవడంతో కుటుంబంతో సంతోషంగా ఉన్నా. –ఆవాల అనంతరావు, వన్నలి గ్రామం, రేగిడి మండలం యువతలో పెను మార్పు గ్రామాల్లో ఊరేగింపులు జరిగితే యువకులు పూటుగా తాగి చిందులు వేసేవారు. గొడవలు కూడా అయ్యేవి. ఇప్పుడు ఆ సమస్య తప్పిపోయింది. కఠినంగా మద్య నియంత్రణ, ధరలు భారీగా పెరగడంతో ఎవరూ దానిజోలికి పోవడం లేదు. యువత అంతా ఉద్యోగాలు, స్వయం ఉపాధి కోసం ఆలోచిస్తున్నారు. –గార హరిబాబు, మందరాడ, సంతకవిటి మండలం -
రహదారులు చంపేస్తున్నాయి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని రోడ్‌సేఫ్టీ విభాగం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రోడ్‌సేఫ్టీ విభాగం గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. 2019లో రోడ్డు ప్రమాదాల కారణంగా తెలంగాణలో చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 6,800గా ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల సగటున రోజుకు 16 మంది మరణిస్తుండగా.. 61 మందికి గాయాలవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు, ట్రాఫిక్, రవాణారంగ నిపుణులు చెబుతున్నా.. చాలామంది పెడచెవిన పెట్టడంతో ఇది రోజురోజుకూ విజృంభిస్తోంది. సిరిసిల్ల జిల్లాలో జీరో మరణాలు.. కనీసం ఈ ఏడాదిలోనైనా ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అంతా భావిం చారు. ముఖ్యంగా పోలీసులు నూతన సంవత్సరం రోజున ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య తక్కువగా నమోదైంది. తరువాత వరుసగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాలు గతేడాది మరణాల సగటును అందుకునేలా చేశాయి. ఈ ఏడాది జనవరిలో 1,907 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 484 తీవ్ర ప్రమాదాలు కాగా.. 1,423 సాధారణ ప్రమాదాలు. ఇందులో 491 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,143 మంది క్షతగాత్రులు అయ్యారు. జిల్లాలపరంగా రోడ్డు ప్రమాదాల మరణాలను పరిశీ లిస్తే.. రాచకొండ (53), సైబరాబాద్ (43), సంగారెడ్డి (32), వరంగల్ (29), నిజామాబాద్ (25), మెదక్ (25) తరువాత స్థానాల్లో నిలిచాయి. జనవరి నెలలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేసులు, చలానాలంటే లెక్కలేదు..: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన విషయంలోనూ ప్రజలకు లెక్కలేకుండా పోయింది. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రహదారులపై పార్కింగ్, రవాణా వాహనాల్లో మనుషుల తరలింపు, సీటు బెల్టు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వీరికి చలానాలన్నా.. కేసులన్నా లెక్కలేకుండా పోతోంది. 31 రోజుల్లో 87,608 ఓవర్స్పీడు కేసులు నమోదయ్యాయంటే వాహనాల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
భళా.. తమిళ ఫార్ములా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగం గా తమిళనాడు తరహాలో ప్రత్యేక విధానాన్ని తెలం గాణలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ విధానంలో తమిళనాడులో చాలావరకు సత్ఫలితాలిచ్చా యి. ఫలితంగా అక్కడ దాదాపు 35 శాతానికి పైగా రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయి. అక్కడ విజయవంతమైన ఈ విధానాన్ని తెలంగాణ పోలీసులు అధ్యయనం చేశారు. దీనిపై ఇటీవలే సీఎస్‌కు నివేదిక సమర్పించారు. అది సీఎం వద్దకు వెళ్లడం, ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో ఇక్కడా అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన వద్ద ప్రమాదాలకు కారణాలివే.. ప్రమాదాల నివారణే లక్ష్యంగా తమిళనాడు విధానం అమలు చేయబోతున్నామని చెబుతోన్న పోలీసు ఉన్నతాధికారులు.. త్వరలోనే అక్కడి తరహాలో ప్రత్యేక కమిటీని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతోన్న బ్లాక్స్పాట్లను గుర్తించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. ►రాష్ట్రంలో జరుగుతున్న అత్యధిక ప్రమాదాలకు తొలి కారణం అతి వేగమైతే, రెండో కారణం బ్లాక్ స్పాట్లు (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు). ►మూలమలుపుల వద్ద రోడ్లకు గట్టుకోణం (సూపర్ ఎలివేషన్.. దాదాపు 7 డిగ్రీలు) ఏర్పాటు చేయకపోవడం, ప్రమాద హెచ్చరికలు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ►రాష్ట్రంలో గుర్తించిన బ్లాక్స్పాట్లలో హైదరాబాద్‌లోని బోయిన్పల్లి డెయిరీఫాం, బేగంపేట ఎయిర్‌పోర్టు వెనక ప్రమాదకర మలుపు, రైల్‌నిలయం రోడ్డు అత్యంత ప్రమాదకరమైనవి. ►తరచూ ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతాల్లో రహదారి లోపాలు సవరించి, చిన్నపాటి మరమ్మతులు చేశారు. దీంతో ఇక్కడ చాలాకాలంగా ప్రమాదాలు దాదాపు జరగడం లేదని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఏం చేశారు.. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు జరగ్గానే.. దాన్ని పోలీసుల పనిగానో లేదా ఆరోగ్యవిభాగం పనిగానో చూస్తారు. రోడ్డు ప్రమాదాలు, మరణాల నివారణ కేవలం వీరి వల్ల మాత్రమే సాధ్యం కాదు. మిగతా అన్ని విభాగాలూ కలిసి వచ్చినపుడే అది సాధ్యమవుతుందన్న విషయా న్ని తమిళనాడు గుర్తించింది. అనుకున్నదే తడవుగా పోలీసులతో పాటు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల అధికారులను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేసింది. దీనికి నేతృత్వం వహించేందుకు కమిషనర్‌ను నియమించింది. ఈ కమిటీ మొదట తమిళనాడులో తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్, ప్రమాదకర మలుపులను గుర్తించి వాటిని సరిచేసింది. ప్రమాదాలు జరిగిన తరువాత ‘గోల్డెన్ అవర్’కు ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో మరణాలను తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలను ఏర్పాటు చేసింది. ట్రామాకేర్ సదుపాయాలతో కూడిన అత్యవసర విభాగాలను 24 గంటలూ అందుబాటులో ఉంచింది. ప్రమాదం జరిగిన తరవాత జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలు రంగంలోకి దిగి రోడ్లలోని లోపాలను గుర్తించేవి. ఆ మేరకు ఆయా రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టేవారు. అలా రోడ్డు ప్రమాదాలను 35 శాతానికిపైగా అరికట్టగలిగారు. -
రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాలకు బలి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల రూపంలో సంభవిస్తున్న అకాలమరణాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాహనదారులు వాటిని పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలు, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రాథమిక కారణాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2018లో 6,603 మంది మరణించగా 21,697 మంది క్షతగాత్రులయ్యారు. 2019లో 6,806 మంది మరణించగా, 22,265 మంది గాయపడ్డారు. 2019లో రోడ్డు ప్రమాద మరణాల్లో 3 శాతం పెరగడం ఆందోళనకరమేనని రోడ్డు రవాణా నిపుణులు అంటున్నారు. ఏడాది మొత్తం మీద రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే రోజుకు 60 రోడ్డు ప్రమాదాలు, 18 మరణాలు, 61 మంది క్షతగాత్రులైన ఘటనలు నమోదయ్యాయి. తెలంగాణ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. మోటారు వాహన సవరణ చట్టం నిలిపివేయడంతోనే.. ఆగస్టు, సెప్టెంబర్‌లో మోటారు వాహన సవరణ చట్టం–2019 అమలు చేస్తారన్న ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ జరిమానాలు విధించడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీగా తగ్గాయి. ఫలితంగా అంతకుముందు నెలకు సగటున 540 మంది మరణాలు సంభవించగా.. సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య సుమారు 350కి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చాలా రాష్ట్రాలతోపాటు తెలంగాణ కూడా దీన్ని అమలు చేయమని ప్రకటించింది. దీంతో అక్టోబర్‌లో తిరిగి మరణాల సంఖ్య ఎప్పట్లాగే 500 దాటింది. ఇదే చట్టం అమలు చేస్తారన్న ప్రచారం లేకపోయి ఉంటే మరో 200 వరకు పెరిగి, మరణాల సంఖ్య 7 వేలు దాటి ఉం డేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రూ.121 కోట్లు దాటిన చలానాలు.. ఏడాది మొత్తం మీద ట్రాఫిక్ ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపించారు. 25.02 లక్షల ఉల్లంఘనలకుగాను ఏకంగా రూ.121.30 కోట్ల జరిమానాలు విధించారు. నవంబర్‌లో రూ.100 కోట్లు దాటగా డిసెంబర్ నాటికి రూ.120 కోట్లకు చేరుకుంది. అంటే నెలకు రూ.10 కోట్లు చొప్పున చలానాలు విధించారు. నిమిషానికి 2 కేసులు.. రోడ్డు ప్రమాదాలకు ప్రాథమిక, ప్రధాన కారణం వేగం. ఈ విషయంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఎవరూ తగ్గడం లేదు. కేసులకు వెరవడం లేదు. ఏడాది మొత్తం మీద 11.31 లక్షల ఓవర్ స్పీడ్ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. వీరికి రూ.92.36 కోట్లు చలానాలు విధించారు. ఈ లెక్కన రోజుకు 3,100 కేసులు, నిమిషానికి 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. -
లైసెన్సు లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జైలుకే!
సాక్షి, అమరావతి: డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా జైలుకు పంపనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ ఇక కఠినంగా వ్యవహరించనుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి అందజేసింది. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. దీంతో ఏపీ రవాణా శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ఇక ముమ్మరంగా చేపట్టనున్నారు. లైసెన్సుల జారీ మరింత సులభతరం డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఇప్పటికే సులభతరం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో మోటారు వాహన చట్టంలో సవరణలు చేసిన సమయంలోనే డ్రైవింగ్ లైసెన్సులకు విద్యార్హత నిబంధన తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గతేడాది ఎనిమిదో తరగతి నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సులు పొందడం మరింత సులభం కానుంది. -
ట్రాక్ బాగుంటే గిఫ్ట్
బుధవారం ఉదయం 11.30.. అసెంబ్లీ సమీపంలోని కంట్రోల్‌రూమ్ చౌరస్తా...ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగర పోలీసు కమిషనర్.. అటుగా బైక్‌పై వచ్చిన వాహనచోదకుడిని ఆపారు. రోడ్డు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి అతని ‘ట్రాక్’ రికార్డును పరిశీలించారు. గతంలో, ప్రస్తుతం ఎలాంటి ఉల్లంఘనలు లేకపోవడంతో అతనికి మెక్ డొనాల్డ్స్ గిఫ్ట్ కూపన్, ఓ పువ్వు అందచేశారు. సాక్షి, హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని ‘దారి’కి తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు, చార్జ్షీట్లు, కౌన్సెలింగ్ వంటివి నిర్వహిస్తున్నారు. మరి, పక్కాగా నిబంధనలు పాటించే వారిని ఎందుకు ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ కొన్నాళ్లుగా ఉత్తమ డ్రైవర్లకు సినిమా కూపన్లు అందిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ సంస్థ సాయంతో రూ.250 విలువైన గిఫ్ట్ కూపన్లను నెలకు 300 మందికి చొప్పున ఆరు నెలల పాటు అందించనున్నారు. బుధవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు 25 మంది వాహనచోదకులకు గిఫ్ట్ కూపన్లు, పువ్వులు అందించారు. గిఫ్ట్ కొట్టాలంటే.. క్లీన్ రికార్డు ఉండాలి - మెక్‌డొనాల్డ్స్ గిఫ్ట్ కూపన్ గెల్చుకోవాలంటే వాహనచోదకుడు గతంలో, తనిఖీ సమయంలో పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉండాలి. - హెల్మెట్ పెట్టుకుని వస్తున్న ద్విచక్ర వాహనచోదకులు, సీట్‌బెల్ట్ ధరించిన తేలికపాటి వాహనాల డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. - వాహనచోదకుల వద్ద ఉండాల్సిన ధ్రువీకరణలు తనిఖీ చేసి ఆపై గతంలో ఎప్పుడైనా చలానా చెల్లించారా? అనేది ట్యాబ్ ద్వారా పరిశీలిస్తారు (ఈ ట్యాబ్‌లో.. ఉల్లంఘనుల జాబితా డేటాబేస్ మొత్తం అనుసంధానమై ఉంటుంది). - ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ, గతంలోనూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని వారిని ఎంపిక చేసి, అక్కడికక్కడే మెక్ డొనాల్డ్స్ గిఫ్ట్‌కూపన్, పువ్వు అందజేస్తారు. ఇలా ఒక్కో జోన్‌లోనూ 50 మందిని సత్కరిస్తారు. రోల్‌మోడల్‌గా సిటీ దేశంలోని మెట్రో నగరాలకు అనేక అంశాల్లో హైదరాబాద్ రోల్ మోడల్‌గా ఉంది. రహదారి భద్రత విషయంలోనూ ఈ లక్ష్యం సాధించాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా చేస్తే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది. మీ కుటుంబంలో, చుట్టుపక్కల ఎక్కడైనా ఉల్లంఘన మీ దృష్టికి వస్తే వెంటనే వారిని కట్టడి చేయండి. మెక్ డొనాల్డ్స్ సంస్థ పార్ట్నర్ ఆఫ్ రోడ్సేఫ్టీగా మారింది. - అంజనీకుమార్, సిటీ కొత్వాల్ ప్రమాదాల నియంత్రణకే.. నగరంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాం. ఇంకా తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. నగరాన్ని యాక్సిడెంట్ ఫ్రీగా మార్చాలంటే రహదారి నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలి. ఇందుకోసం వాహన చోదకులను ప్రోత్సాహించే మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తాం. - అనిల్‌కుమార్, ట్రాఫిక్ చీఫ్ ట్రాఫిక్ పోలీసుల పనితీరు అద్భుతం నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అందరి సామాజిక బాధ్యత. నగరవాసులంతా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. - రితేష్‌కుమార్, మెక్ డొనాల్డ్స్ ఆపరేషన్స్ హెడ్ ఆనందంగా ఉంది నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మెక్ డొనాల్డ్స్ సంస్థతో కలిసి అందిస్తున్న తొలి కూపన్ అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే నగరం సేఫ్ సిటీ అవుతుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. - రవిచంద్ర, యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు, సైదాబాద్ కాలనీ -
‘రోడ్లు బాగున్నాయ్..అందుకే ప్రమాదాలు’
బెంగళూర్ : మెరుగైన రహదారుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రోడ్లు బాగుండటంతో యువత ఎక్సలేటర్‌ను మరింతగా వాడుతుండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. రోడ్లు బాగుంటే యువత వాటిపై హైస్పీడ్‌తో దూసుకెళతారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి గౌడ పేర్కొన్నారు. చెత్త రోడ్ల కంటే మంచి రోడ్లపై యువత ఎక్సలేటర్ జోరును పెంచి వాహనాలను ముందుకు ఉరికిస్తారని ఈ క్రమంంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. కాగా, అధ్వాన్న రహదారుల కంటే మంచిగా ఉండే రోడ్లపైనే ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ బుధవారం వ్యాఖ్యానించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘ఏటా కర్ణాటకలో 10,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి..వీటికి రోడ్లు దయనీయంగా ఉండటమే కారణమని మీడియా చెబుతుండగా..వాస్తవం మాత్రం రోడ్లు బాగా ఉండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా’యని అన్నారు. ట్రాఫిక్ జరిమానాలపై నిరసనలు వెల్లువెత్తడంతో గుజరాత్ ప్రభుత్వ తరహాలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలను తగ్గించాలని సీఎం బీఎస్ యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. -
రోడ్డు భద్రత ఎక్కడ..?
సాక్షి, హైదరాబాద్: దేశసరిహద్దుల్లో చనిపోయే సైనికుల కన్నా.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే అధికం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 11న జరిగిన జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదం దేశచరిత్రలోనే ఒక చీకటి దినంగా మిగిలిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి 65 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 100 అడుగుల లోయలో పడ్డా.. 30 మందికి మించి మరణించిన దాఖలాలు లేవు. కానీ, పట్టుమని 10 అడుగుల లోతులేని కందకం లో పడి భారీ ప్రాణనష్టం జరగడం ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఓవర్లోడింగ్.. కొండగట్టు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఓవర్లోడింగ్. బస్సు సామర్థ్యం 44 సీట్లు కాగా దుర్ఘటన సమయంలో బస్సులో 110 మంది వరకు ప్రయాణికులు ఎక్కారు. ఫలితంగా కందకంలో పడగానే.. మహిళలు, చిన్నారులు ఊపిరాడక ప్రాణాలొదిలారు. ప్రమాదం జరిగిన రోజు 57 మంది మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65కి చేరింది. దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇంతటి భారీ ప్రాణనష్టం ఇదే కావడం గమనార్హం. ఘటనాస్థలాన్ని రవాణామంత్రి, ఆర్టీసీ చైర్మన్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సంబంధిత అధికారులంతా పరిశీలించారు. ఆ దుర్ఘటన తర్వాత ఆర్టీఏ నాలుగు రోజుల పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంది. అంతమంది ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత ప్రభుత్వం రోడ్డు భద్రతలో ప్రత్యేకంగా చర్యలేమీ తీసుకోకపోవడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన ఘాట్ రోడ్డుపై భారీ వాహనాలను, బస్సులను కంటితుడుపు చర్యగా నిషేధించింది. కానీ, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణాలో, గూడ్సు వాహనాల్లో ఓవర్ లోడింగ్ సమస్య కొనసాగుతూనే ఉంది. రోజుకు 646 కేసులు రాష్ట్రంలో రోజుకు సగటున 646 ఓవర్లోడింగ్ కేసులు బుక్కవుతున్నాయి. సెప్టెంబర్ 5 వరకు వీటి సంఖ్య దాదాపుగా 15,400 వరకు చేరింది. రోజుకు రూ.లక్ష చొప్పున ఇప్పటిదాకా రూ.29 కోట్ల వరకు జరిమానా రూపంలో చెల్లించారు. రాష్ట్రంలో రోజుకు 59 ప్రమాదాల చొప్పున మొత్తం 14,700 వరకు రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. అందులో రోజుకు 18 మంది చొప్పున మరణిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 4,300 మంది ప్రాణాలు రోడ్డు పాలయ్యాయి. ప్రతీ 93 నిమిషాలకో ప్రాణాన్ని రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. రోజుకు 62 మంది గాయపడుతుండగా ఇప్పటివరకు 15,400 మంది వరకు క్షతగాత్రులయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవర్లోడింగ్ సమస్య కారణంగా రోజుకు వందలాది కేసులు బుక్కవుతున్నా.. ఎలాంటి వాటి నివారణలో ఎలాంటి పురోగతి లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.