ప్రమాదాల నివారణ ఎలా? | International standard training for RTC drivers | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణ ఎలా?

Published Sun, Mar 26 2023 3:06 AM | Last Updated on Sun, Mar 26 2023 3:07 PM

International standard training for RTC drivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.  ఇందుకోసం చెన్నైకు చెందిన చోలమండలం రిస్క్‌ సర్వి సెస్‌ లిమిటెడ్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రెప్ప పాటు­లో జరిగే ప్రమాద వేళల్లో డ్రైవర్లు చురుగ్గా స్పందించ గలిగితే ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.

ఈ విషయంలో ఈ సంస్థ కొన్నేళ్లుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంతకాలం సొంత నిపుణులతో డ్రైవర్లకు శిక్షణ ఇప్పించిన ఆర్టీసీ, ఇప్పుడు తొలిసారి బయటి నిపుణులతో తర్ఫీదునిప్పిస్తోంది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు నిరంతరాయంగా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.  

ఎందుకీ శిక్షణ అంటే...  
సాలీనా సగటున 600 ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాల్లో భాగమవుతున్నాయి. ఇందులో ప్రాణాంతక ప్రమాదాలు దాదాపు 200వరకు ఉంటున్నాయి. సగటున ఏడాదికి 300 మంది చనిపోతున్నారు. ఇది ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది. మరోవైపు ప్రమాద మృతులు, బాధితుల కుటుంబాలకు ఏడాదికి సగటున రూ.50 కోట్ల వరకు ఆర్టీసీ పరిహారంగా చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఇటీవల ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. పైగా బస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఆర్టీసీలో 15 శాతం వరకు మాత్రమే అద్దె బస్సులుండేవి. ఇప్పుడు సొంత బస్సులు కొనటం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు క్రమంగా నిబంధనలు సవరించి అద్దె బస్సుల సంఖ్య పెంచుకుంటోంది. ప్రస్తుతం మూడో వంతుకు అవి చేరుకున్నాయి. 

అద్దె బస్సులకు డ్రైవర్ల కొరత... ఆర్టీసీ డ్రైవర్లకు పనిభారం 
అద్దె బస్సులు దాదాపు  3 వేలకు మించిపోయాయి. ఈ అద్దె బస్సులకు వాటి నిర్వాహకులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సరైన డ్రైవర్లు దొరకని సందర్భంలో లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లను పిలిపించి బస్సులు అప్పగిస్తున్నారు. సరైన డ్రైవింగ్‌ నైపుణ్యం లేని కారణంగా వారు  ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ఇక మెరుగైన శిక్షణ ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై ప్రస్తుతం విపరీతమైన పని భారం ఉంటోంది. ఆదాయం కోసం బస్సులను ఎక్కువగా  తిప్పాల్సి రావటం, దీంతోపాటు  డ్రైవర్ల కొరత వల్ల డబుల్‌ డ్యూటీలు చేయా­ల్సి రావటం, బస్సులు పాతబడిపోవటం.. ఇలా రకరకాల కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో సొంత డ్రైవర్లు, అద్దె బస్సు డ్రైవర్లు.. అందరికీ మంచి శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. 

రీజియన్ల వారీగా శిక్షణ  
చోలమండలం రిస్క్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మూడు బ్యాచ్‌ల శిక్షకులను పంపుతోంది. రీజియన్ల వారీగా డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. తొలుత సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి రీజియన్లతో ఈ శిక్షణ ప్రారంభిస్తారు. రీజియన్‌ కేంద్రాల్లోనే ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 50 మంది డ్రైవర్లను ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ ఇస్తారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పద్ధతిలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఆయా ప్రాంతాల్లో గతంలో చోటుచేసుకున్న భారీ ప్రమాదాలను ఉదాహరణగా తీసుకుని, వాటి ఫొటోలు, వీడియోలు, ప్రమాదానికి కారణమైన ప్రాంతం, బస్సు, ఎదురు వాహనం.. ఇలా దృశ్యాలు చూపుతూ.. ప్రమాదాలకు కారణం, అలాంటి సమయంలో డ్రైవర్లు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదం జరగబోతోందని గ్రహించిన క్షణంలో డ్రైవర్లు ఏం చేయాలి.. తదితరాలను శిక్షణలో వెల్లడిస్తారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆర్టీసీ భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement