RTC drivers
-
ఇదేం దా‘రుణం’?
ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు కుమారుడు జేఈఈలో ఆలిండియా స్థాయిలో 265 ర్యాంకు సాధించాడు. ఐఐటీ ఫీజు చెల్లించేందుకు సీసీఎస్ నిధి నుంచి లోన్ కోసం వెంకటేశ్వర్లు దరఖాస్తు చేశాడు. నిధులు లేక సకాలంలో రుణం ఇవ్వలేమని వారు చెప్పడంతో ఇల్లు తాకట్టు పెట్టి ప్రైవేటుగా రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఆ వడ్డీ భారంతో సతమతమవుతున్నాడు.కానికల్ సెక్షన్లో పనిచేస్తున్న జుబేర్‌కు కొన్నిరోజులుగా ఒక కాలు, చేతికి స్పర్శ సరిగా ఉండటం లేదు. ఆస్పత్రికి వెళితే త్వరగా శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే పక్షవాతానికి గురికావొచ్చని హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే.. తొలుత ట్రీట్మెంట్ ఇస్తామని, తగ్గకుంటే ప్రైవేటుకు రిఫర్ చేస్తామన్నారు. దీనితో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం రుణం కావాలని సీసీఎస్‌లో దరఖాస్తు చేశారు. నిధులు లేవనడంతో బయట అధిక వడ్డీకి అప్పు చేయాల్సి వచ్చింది.సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోని సహకార పరపతి సంఘం (సీసీఎస్) దివాలా దశకు చేరుకోవటంతో సంస్థలోని చిరుద్యోగుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. పిల్లల చదువుల కోసం కొందరు, పెళ్లిళ్ల కోసం మరికొందరు, అనారోగ్య సమస్యలతో ఇంకొందరు, ఇతర కుటుంబ అవసరాల కోసం మరెందరో.. లోన్ కోసం సీసీఎస్‌లో దరఖాస్తు చేస్తున్నారు. అక్కడ నిధులు లేవని తేల్చిచెప్తుండటంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సిబిల్ స్కోర్(Cibil Score) సరిగా లేదన్న కారణంతో బ్యాంకులు రుణాలకు నిరాకరిస్తుండంతో ప్రైవేటు అప్పులు చేయక తప్పడం లేదు.వచ్చే జీతంలో ఇంటి ఖర్చులు పోగా మిగతా సొమ్ము వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోని దుస్థితి తలెత్తుతోందని, కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వాపోతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు రూ.లక్షకు నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతినెలా జీతంలో 7% కోత పెట్టుకుని నిధి సమకూర్చుకుంటే.. తమ నిధి నుంచి తమకే రుణాలు అందక ఇలా అప్పుల బారినపడటం దారుణమని పేర్కొంటున్నారు. డ్రైవర్ కొండారెడ్డి కుమార్తె పెళ్లి పెట్టుకున్నాడు. రూ.9 లక్షల లోన్ కోసం సీసీఎస్‌కు దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చేవరకు లోన్ దొరికే పరిస్థితి లేదని, తొలుత రిటైర్మెంట్ కేసులను పరిష్కరించాకే లోన్ చెల్లింపులు ఉంటాయన్న సమాధానం వచ్చింది. అప్పటిదాకా ఎదురు చూసే పరిస్థితి లేక, డ్రైవర్ కావటంతో వెంటనే అప్పు పుట్టక తిరిగి తిరిగి చివరకు అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది.జాతీయ స్థాయి గుర్తింపు నుంచి.. ఆర్టీసీలోని (TSRTC) సహకార పరపతి సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో ప్రతినెలా 7 శాతం మొత్తం దీనికి జమ చేయటం ద్వారా నిధి ఏర్పడుతుంది. అందులోంచే ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. దాదాపు రూ.3 వేల కోట్ల నిధితో వేల సంఖ్యలో ఉద్యోగులకు రుణాలు ఇస్తూ, కార్మికులను ఆదుకునే సంస్థగా గిన్నిస్ బుక్ రికార్డుతోపాటు పలు పురస్కారాలు దక్కించుకుంది. కానీ ఆర్టీసీ కొన్నేళ్లుగా ఈ నిధిని సొంతానికి వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.900 కోట్లకుపైగా ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది.చదవండి: ఫోరెన్సిక్ ఆడిటింగ్‌పై రెవెన్యూ శాఖలో గుబులుసీసీఎస్లో నిధులు లేకపోవడంతో... ఆర్టీసీ ఉద్యోగులకు లోన్లు అందని పరిస్థితి నెలకొంది. సీసీఎస్ (CCS) గతంలో ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించడంతో బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు గత జూన్‌లో సీసీఎస్‌కు రూ.200 కోట్లు అందాయి. మరో రూ.150 కోట్లు బ్యాంకు నుంచి రుణం తెచ్చింది. ఈ మొత్తం నుంచి ఉద్యోగులకు లోన్లు ఇచ్చింది. ఇలా జూన్ వరకు పేరుకుపోయిన దరఖాస్తుదారులకు ఊరట లభించింది. ఆ తర్వాత బకాయిల చెల్లింపు లేకపోవటంతో లోన్ దరఖాస్తులు పేరుకుపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం 7 వేల మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో అవసరాల కోసం.. ప్రస్తుతం ఆర్టీసీలో 40 వేల మంది ఉద్యోగులుంటే... అందులో దాదాపు సగం మంది వరకు వివిధ అవసరాల కోసం సీసీఎస్ రుణాలపై ఆధారపడుతుంటారు. దాన్ని చెల్లించి, మళ్లీ అత్యవసరం పడితే రుణం తీసుకుంటూ ఉంటారు. విద్యా సంవత్సరం ముగియనున్నందున ఫైనల్ సెమిస్టర్ ఫీజులు చెల్లించాల్సి ఉంది. దీంతో చాలా మంది ఉద్యోగులు పిల్లల ఫీజుల కోసం అత్యవసర లోన్లు కావాలని దరఖాస్తులు సమర్పించారు. పిల్లల పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు, ఇంటి రిపేర్లు.. ఇలా మరెన్నో అవసరాల కోసం దరఖాస్తు చేసినవారు ఉన్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఇంతగా ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మళ్లీ కోర్టు తలుపుతట్టే ఆలోచన ఉద్యోగుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లించాలంటూ కొన్నిరోజులుగా సీసీఎస్ యంత్రాంగం ఆర్టీసీపై ఒత్తిడి పెంచుతోంది. కనీసం బ్యాంకు నుంచి రుణం పొందేందుకు పూచీకత్తు అయినా ఇవ్వాలని కోరుతోంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత రావటం లేదు. సీసీఎస్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించి ఉన్నందున... మళ్లీ హైకోర్టు తలుపుతట్టి, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని సీసీఎస్ యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది. -
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
సెల్‌ఫోన్ వదిలితేనే స్టీరింగ్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్లు బస్సు నడిపే క్రమంలో మొబైల్ఫోన్లు వాడుతూ ప్రమాదాలబారిన పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటుండటంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. డ్రైవర్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండే చర్యల్లో భాగంగా వారు విధుల్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు డ్యూటీలో భాగంగా గమ్యం చేరిన తర్వాత.. తిరిగి మళ్లీ బయలుదేరేలోగా ఉన్న విశ్రాంతి సమయంలోనూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. ఈ చర్యలకు డ్రైవర్లు అలవాటుపడేలా వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిబంధనలు ఇలా... హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బస్టాండ్‌కు చేరుకోగానే అక్కడి టీఎస్ఆర్టీసీ కేంద్రంలోని ఏటీఎం కార్యాలయంలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి బస్సు బయలుదేరే సమయంలో వాటిని తీసుకోవాలి. ఇతర దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఉండే అటెండర్‌కు డ్రైవర్ తన మొబైల్ ఫోన్ అప్పగించాలి. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండరే మాట్లాడి డ్రైవర్‌కు సమాచారం చెప్పాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, లేదా ఇతరుల నుంచో వచ్చే ముఖ్యమైన కాల్స్ ఉంటే బస్సును పక్కన ఆపి మాట్లాడిన తర్వాతే బస్సును నడపాల్సి ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు ఉండే నాన్–ఏసీ దూరప్రాంత బస్సుల్లో అయితే రెండో డ్రైవర్‌కు ఫోన్ అప్పగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసుల్లోనూ కఠిన నిబంధనల అమలు ప్రారంభించారు. డిపోనకు రాగానే అక్కడి కంట్రోలర్‌కు డ్రైవర్లు ఫోన్లను అప్పగించాలి. ఈలోగా ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే విషయాన్ని తెలుసుకొని కంట్రోలర్లు ఆయా దారుల్లో ఉండే పాయింట్ల మీది కంట్రోలర్ల ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్లకు చేరవేయాలి. అవగాహన కార్యక్రమాల తర్వాత ఈ నిబంధన పాటించని వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని 2 నెలలపాటు బస్ డిపోల్లోనే ఉంచనున్నారు. అప్పటికీ తీరు మారకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఆ డ్రైవర్లకు భారం తప్పించే ఏర్పాటు.. బస్సు టికెట్లను అడ్వాన్సుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) ద్వారా బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి బస్సు డ్రైవర్ సెల్ నంబర్ అందిస్తున్నారు. బస్సును ట్రాక్ చేసే క్రమంలో ప్రయాణికుడు డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్లు చేయడం ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్‌ను ప్రయాణికులు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే బస్సును సులభంగా ట్రాక్ చేసుకోవడంతోపాటు ఇతర సమస్త సమాచారం తెలుస్తుంది. ఈ దిశగా ప్రయాణికులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టికెట్ బుక్ చేసుకుంటే.. డ్రైవర్ నంబర్‌కు బదు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సెంటర్ నంబర్ ఇవ్వనున్నారు. ప్రయాణికుడు ఫోన్ చేయగానే ఆ సెంటర్ సిబ్బంది సిస్టంలో గమ్యం యాప్ తెరిచి బస్సు వివరాలు తెలుసుకుని చేరవేస్తారు. -
ప్రమాదాల నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం చెన్నైకు చెందిన చోలమండలం రిస్క్ సర్వి సెస్ లిమిటెడ్‌తో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రెప్ప పాటులో జరిగే ప్రమాద వేళల్లో డ్రైవర్లు చురుగ్గా స్పందించ గలిగితే ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఈ సంస్థ కొన్నేళ్లుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంతకాలం సొంత నిపుణులతో డ్రైవర్లకు శిక్షణ ఇప్పించిన ఆర్టీసీ, ఇప్పుడు తొలిసారి బయటి నిపుణులతో తర్ఫీదునిప్పిస్తోంది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు నిరంతరాయంగా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎందుకీ శిక్షణ అంటే... సాలీనా సగటున 600 ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాల్లో భాగమవుతున్నాయి. ఇందులో ప్రాణాంతక ప్రమాదాలు దాదాపు 200వరకు ఉంటున్నాయి. సగటున ఏడాదికి 300 మంది చనిపోతున్నారు. ఇది ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది. మరోవైపు ప్రమాద మృతులు, బాధితుల కుటుంబాలకు ఏడాదికి సగటున రూ.50 కోట్ల వరకు ఆర్టీసీ పరిహారంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇటీవల ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. పైగా బస్సులు ప్రమాదాలకు గురవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఆర్టీసీలో 15 శాతం వరకు మాత్రమే అద్దె బస్సులుండేవి. ఇప్పుడు సొంత బస్సులు కొనటం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు క్రమంగా నిబంధనలు సవరించి అద్దె బస్సుల సంఖ్య పెంచుకుంటోంది. ప్రస్తుతం మూడో వంతుకు అవి చేరుకున్నాయి. అద్దె బస్సులకు డ్రైవర్ల కొరత... ఆర్టీసీ డ్రైవర్లకు పనిభారం అద్దె బస్సులు దాదాపు 3 వేలకు మించిపోయాయి. ఈ అద్దె బస్సులకు వాటి నిర్వాహకులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సరైన డ్రైవర్లు దొరకని సందర్భంలో లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లను పిలిపించి బస్సులు అప్పగిస్తున్నారు. సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేని కారణంగా వారు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇక మెరుగైన శిక్షణ ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై ప్రస్తుతం విపరీతమైన పని భారం ఉంటోంది. ఆదాయం కోసం బస్సులను ఎక్కువగా తిప్పాల్సి రావటం, దీంతోపాటు డ్రైవర్ల కొరత వల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి రావటం, బస్సులు పాతబడిపోవటం.. ఇలా రకరకాల కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో సొంత డ్రైవర్లు, అద్దె బస్సు డ్రైవర్లు.. అందరికీ మంచి శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. రీజియన్ల వారీగా శిక్షణ చోలమండలం రిస్క్ సర్వీసెస్ లిమిటెడ్ మూడు బ్యాచ్‌ల శిక్షకులను పంపుతోంది. రీజియన్ల వారీగా డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. తొలుత సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి రీజియన్లతో ఈ శిక్షణ ప్రారంభిస్తారు. రీజియన్ కేంద్రాల్లోనే ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 50 మంది డ్రైవర్లను ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ ఇస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పద్ధతిలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో గతంలో చోటుచేసుకున్న భారీ ప్రమాదాలను ఉదాహరణగా తీసుకుని, వాటి ఫొటోలు, వీడియోలు, ప్రమాదానికి కారణమైన ప్రాంతం, బస్సు, ఎదురు వాహనం.. ఇలా దృశ్యాలు చూపుతూ.. ప్రమాదాలకు కారణం, అలాంటి సమయంలో డ్రైవర్లు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదం జరగబోతోందని గ్రహించిన క్షణంలో డ్రైవర్లు ఏం చేయాలి.. తదితరాలను శిక్షణలో వెల్లడిస్తారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. -
ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీకి చెందిన ఇద్దరు డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు దక్కాయి. తమ సర్వీసు కాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా బస్సులు నడిపినందుకు రహదారి భద్రత కేటగిరీలో వీరికి ‘హీరోస్ ఆన్ ది రోడ్’ పురస్కారం దక్కింది. కుషాయిగూడ డిపోకు చెందిన రంగారెడ్డి, సూర్యాపేట డిపోకు చెందిన సోమిరెడ్డిలకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) పురస్కారాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వీరికి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
డ్రైవర్లు, కండక్టర్లే ఆర్టీసీ రథసారథులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే రథసారథులని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సమష్టికృషితోనే సత్ఫలితాలను సాధించగలమని చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పునశ్చరణ తరగతులు ఎంతో దోహదంచేస్తాయన్నారు. మంగళవారం ఆయన హకీంపేట్‌లోని ట్రాన్స్‌పోర్టు అకాడమీని సందర్శించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సిబ్బందికి ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓఅండ్ఏ) యాదగిరి, అకాడమీ ప్రిన్సిపాల్ సుచరితలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లతో పాటు మెకానికల్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ తీరును చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అత్యధిక కేఎంపీఎల్ (7) సాధించిన డ్రైవర్ బి.డి. రెడ్డి, మెరుగైన ఈపీకే (38) సాధించిన కండక్టర్ గీతారమణిలను ఆయన అభినందించారు. ప్రయాణికుల ఆదరాభిమానాలను పొందితే నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించవచ్చని చెప్పారు. ప్రతి బస్సులో ఆక్యుపెన్సీ పెంచుకొనేందుకు కృషి చేయాలన్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందజేయాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితి పుంజుకుంటున్న సంకేతాలు కని్పస్తున్నాయని, సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి బాట వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి మాట్లాడుతూ, కోవిడ్‌తో కుదేలైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు. -
కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక సెలవులు.. బస్సుకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా ఉప్పల్ నుంచి మెహిదీపట్నంకు రాకపోకలు సాగించే బస్సు (రూట్ నంబర్ 300)కు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచినా మరో బస్సు కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. అలాంటి రద్దీ రూట్లో ఆకస్మికంగా బస్సులు రద్దయితే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. రూట్లో బస్సులు నడిపే బండ్లగూడ డిపోలో కొద్ది రోజులుగా సిబ్బంది కొరత అధికారులను వేధిస్తోంది. కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక గైర్హాజరుతో బస్సులు నిలిచిపోతున్నాయి. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ రోజుకు 15 నుంచి 20 మంది ఏదో ఒకకారణంతో ఉన్నపళంగా సెలవు పెట్టేస్తున్నారు. దీంతో ఒక్క ఉప్పల్–మెహదీపట్నం రూట్లోనే కాదు, డిపో నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రూట్లలో పెద్ద సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ‘70 సొంత బస్సులు, మరో 25 అద్దె బస్సులున్న బండ్లగూడ డిపోలో రోజుకు కనీసం 10 బస్సులు ఆగిపోయినా కష్టమే’ అని ఆర్టీసీ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్‌లోని చాలా డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: హైదరాబాద్‌లో కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు.. గ్రేటర్లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపోలో 100 నుంచి 130 బస్సులు ఉన్నాయి. కొన్ని డిపోల్లో వంద లోపు ఉంటే మరికొన్ని చోట్ల ఎక్కువే ఉన్నాయి. అన్ని డిపోల్లో 10 శాతం స్పేర్ బస్సులను మినహాయించి సుమారు 2,750 బస్సులను నడుపుతున్నారు. ప్రతి డిపోలో 15 శాతం సిబ్బంది సాధారణ సెలవుపై ఉంటారు. వీక్లీ ఆఫ్‌లు, ముందస్తు సమాచారంతో పొందిన సెలవులు, అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నవాళ్లు ఉంటారు. ఈ సిబ్బందిని మినహాయించి మిగతా కండక్టర్లు, డ్రైవర్ల సంఖ్యకు అనుగుణంగా అధికారులు ఆ రోజుకు ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ రోజు విధులు నిర్వహించాల్సిన కండక్టర్లు, డ్రైవర్లలో ఏ ఒక్కరు ఆకస్మిక సెలవు పెట్టినా ఒక బస్సు ఆగిపోవాల్సిందే. చదవండి: చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు రకరకాల కారణాలతో ప్రతి డిపోలో 10 నుంచి 15 మంది ఇలా ఆకస్మిక సెలవులు పెట్టేస్తున్నారు. ‘ఒక బస్సుకు డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు. కండక్టర్ ఉన్న బస్సుకు డ్రైవర్ గైర్హాజరవుతాడు, దీంతో మరో గత్యంతరం లేక బస్సులను ఆపేయాల్సి వస్తుంది’. అని ఒక డిపోమేనేజర్ తెలిపారు. మరోవైపు సాధారణంగానే ఆర్టీసీని సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీర్ఘకాలిక సమ్మె అనంతరం నగరంలో కొన్ని బస్సులను కార్గోలుగా మార్చారు. మరి కొన్నింటిని తుక్కు కిందకు మార్చారు. కండక్టర్లు, డ్రైవర్లను పెట్రోల్ బంకుల్లో డెలివరీబాయ్‌లుగా, ఆఫీసుల్లో క్లర్కులుగా, ఇతరత్రా విధుల్లో చేర్చారు. కార్గో బస్సుల కోసం ప్రతి డిపో నుంచి 30 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారు. ఈ బస్సుల్లో కండక్టర్లు హమాలీలుగా పని చేస్తున్నారు. ఇలా వివిధ రకాల కారణాలతో తగ్గిన సిబ్బందితో బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. ఇక ఆకస్మికంగా సెలవులు పెట్టే సిబ్బంది గైర్హాజరు దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. శివార్లు విలవిల బస్సుల రద్దుతో శివారు ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నడిచే ట్రిప్పుల్లో రద్దయ్యేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఘట్కేసర్, కీసర, హయత్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లోని శివారు గ్రామాలు, కాలనీలకు బస్సులు రద్దు కావడంతో ఇటీవల విద్యార్థులు పలు చోట్ల ధర్నాలకు దిగారు. ఉదయం పూట రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళల్లో డిపోల్లో గైర్హాజరీలు పెరగడంతో బస్సులు రద్దవుతున్నాయి. -
గుట్కా నములుతూ స్టీరింగ్ తిప్పితే మూడినట్టే
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ డ్రైవర్ సంస్థకు ఫ్రంట్ లైన్ వర్కర్. అతను పద్ధతిగా ఉండాలి. డ్రైవింగ్ సమయంలో గుట్కా, ఇతర పొగాకు పదార్థాలు నములుతూ ఉమ్ముతూ బస్సును అపరిశుభ్రంగా మార్చి, వెనక వచ్చేవారికి అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదు. వారిపై చర్యలు తప్పవు’ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా హెచ్చరించా రు. వెంటనే దీన్ని అమలులోకి తేవాలని ఆదేశాలిచ్చారు. ఎవరైనా పాటించనట్టు తేలితే చర్యలు తీసుకోవాలంటూ సర్క్యులర్ జారీ చేశారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు... ఆర్టీసీ డ్రైవర్లలో కొందరికి గుట్కా/ ఇతర పొగాకు పదార్ధాలు నమలటం అలవాటు ఉంది. అవి నమి లి బస్సులోపలే ఉమ్మేస్తున్నారు. ఇది బస్సు అంతటా దుర్వాసనకు కారణమవుతోంది. కొందరు బయటకు ఉమ్మినప్పుడు తుంపర్లు ఇతరులపై పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులను ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్చరిక, ఇంక్రిమెంట్కట్, సస్పెన్షన్! డిపోల్లో నిత్యం జరిగే గేట్ మీటింగ్స్‌లో ఈ విషయమై డ్రైవర్లలో అవగాహన కల్పించాలన్నారు. తరచూ తనిఖీలు చేస్తూ, డ్రైవింగ్ సమయంలో గుట్కా/ఇతర పొగాకు పదార్థాలు నములుతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అ యితే, క్రమశిక్షణా చర్యల్లో ఇంకొంచెం స్పష్టత రా వాల్సి ఉంది. మొదటిసారి హెచ్చరిక, రెండోసారి ఇంక్రిమెంట్ కట్, మూడోసారికి సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. -
Telangana: ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ తేదీ నుంచి రోజుకు సగటు 10 వేల మందికి టీకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీకా పంపిణీపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలకు అనుగుణంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్లు ఇవ్వాలని సూచించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులతో హరీశ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ టీకా డోసులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వచ్చే అంచనాలను సైతం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు,ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, వైద్యవిద్య సంచాలకుడు రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య విభాగ సంచాలకుడు శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటి వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్ గారూ.. మాస్క్, శానిటైజర్ ఇస్తున్నారా?
ఖమ్మం: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మీవంతు బాధ్యతను నెరవేర్చండి డ్రైవర్ గారూ. మీ డిపోలో మాస్క్‌లు, శానిటైజర్లు ఇస్తున్నారా?’ అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఓ బస్సు డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడండి అంటూ సూచించారు. ఖమ్మం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ఆగి బస్సు డ్రైవర్‌ను మంత్రి అడుగుతున్న దృశ్యం ‘సాక్షి’ కంటపడింది. –సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం -
అద్దె బండి అనుభవం ఇవ్వమండి
ఆర్టీసీ అద్దె డ్రైవర్లు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలీచాలని వేతనాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. నమ్ముకున్న వృత్తినివదల్లేక.. ప్రభుత్వం కల్పించే ఔట్సోర్సింగ్ ఉద్యోగంలో చేరలేక పడరానిపాట్లు పడుతున్నారు.అనుభవ ధ్రువపత్రాల కోసం అద్దె బస్సు యజమానుల చుట్టూ తిరుగుతున్నారు. వారు కరుణించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచకఅధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేశామని, తమను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవాలని బతిమలాడుతున్నారు. నిబంధనలకు నీళ్లొదలలేమని అధికారులు సున్నితంగా తిప్పిపంపుతున్నారు. కొందరు ఓనర్లు తమ డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవద్దంటూ అధికారులకు హుకుం జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ డ్రైవర్ల భర్తీలో అద్దె బస్సుల యజమానుల (ఆర్టీసీ అద్దెబస్సుల ఓనర్స్) పెత్తనం కొనసాగడంపై పలువురు డ్రైవర్లు మండిపడుతున్నారు. దీంతో ఔట్‌సోర్సింగ్‌పై తీసుకోవాలంటే వారు పనిచేసిన బస్సు యజమానుల నుంచి అనుభవ ధ్రువపత్రం తీసుకు రమ్మంటున్నారు. యజమానులు సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారు.ప్రభుత్వం ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను భర్తీ చేసి.. 8గంటల పాటు పనిచేస్తే గౌరవ వేతనంగా రూ.800 చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లను వారి యజమానులు 18 గంటల పాటు పనిచేయించుకుని కేవలం రూ.600 మాత్రమే ఇచ్చేవారు. అందువల్ల ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లుగా పనిచేయడానికిఅవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే ఆర్టీసీ పెద్దలు మాత్రం వారి ఓనర్ల వద్ద నుంచి అనుభవ సర్టిఫికెట్ తీసుకురావాలంటూ మెలిక పెట్టేస్తున్నారు. వాళ్లు సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారయ్యా జిల్లాలో ఆర్టీసీ వ్యవహారం ఇలా.. జిల్లాలో 1,390 ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు 7లక్షల మందికిపైగా ప్రయాణికులను తరలిస్తున్నారు. ఆమేరకు 2,900మంది కండక్టర్లు, 3,150మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కిలోమీటర్‌కు రూ.20 చొప్పన అద్దె చెల్లించి.. 225 అద్దె బస్సుల్ని నడిపిస్తోంది. ఆ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు జీతభత్యాలను వాటి యజమానులే చూసుకుంటారు. ఆర్టీసీలో పలు సర్వీసులు వన్‌మ్యాన్ సర్వీసులు ఉండడంతో కండక్టర్ల అవసరం లేకున్నా.. డ్రైవర్ల కొరత మాత్రం తప్పడం లేదు. అంటూ డ్రైవర్లు తలలుపట్టుకుంటున్నారు. విద్యార్థులకు, పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు కొత్త ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల పిల్లలకు సౌకర్యంగా ఉదయం, సాయంత్రం బస్సులు నడిపాలని యోచిస్తోంది. మరో వైపు పల్లె ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సర్వీసులను నడపాలని భావించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంగళం, అలిపిరి, ఏడుకొండల బస్టాండ్లు మినహా మిగిలిన అన్ని డిపోల పరిధిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అవసరం అయిన మేరకు డ్రైవర్లను తీసుకోవాలని నిర్ణయించింది. పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఎంపికైన కొందరు శిక్షణ కూడా పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీకి అద్దె బస్సులు నడిపిన వారికి మాత్రం ఓట్సోర్సింగ్లో అవకాశం ఇవ్వడం లేదు. అద్దె బస్సుల యజమానులు సర్టిఫికెట్ ఇవ్వాలి ఆర్టీసీకి చెందిన అద్దె బస్సులు యజమానులు తమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు తమకు ఏమీ బాకీలేరని.. వారి సర్టిఫికెట్లు వారికే ఇచ్చేశామని, వారిని తీసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్ రూపంలో ఓ లెటర్ ద్వారా అందజేస్తే హైర్ బస్సుల డ్రైవర్లను ఆర్టీసీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడానికి అభ్యంతరంలేదు. – మధుసూదన్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‡, తిరుపతి ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం ఆర్టీసీ అద్దెకి చెందిన హైర్ బస్సుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం. మాకు ఆర్టీసీ డ్రైవర్ల వలే ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్సు పాస్ ఇచ్చారు. హేవీ లైసె న్స్ ఉంది. ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లగా తీసుకునే సమయంలో అన్ని అర్హతలను చూసి ఎంపిక చేశారు. అయితే హైర్ బస్సులో పని ఎక్కువగా ఉంది. జీతం తక్కువ. ప్రభుత్వం ప్రకటించిన ఔట్సోర్సింగ్ డ్రైవర్ల విషయంలో పనికి తగ్గిన వేతనం ఉంది. దాంతో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీ డ్రైవర్లగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మాకు న్యాయం చేయండి. – కే. బాలచంద్రయ్య, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నాం ఆర్టీసీ అద్దె బస్సుల్లో 18గంటల పాటు పనిచేస్తే కేవలం రూ.600 ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా కేవలం 8గంటలు పనిచేస్తేనే రూ.800 వస్తుంది. నేను మా ఓనర్‌కు ఒక్క పైసా బాకీలేను. నా సర్టిఫికెట్లు నావద్దే ఉన్నాయి. ఏడేళ్లుగా ఆర్టీసీ అద్దె బస్సులో పనిచేసిన అనుభవం ఉంది. హేవీ లైసెన్స్ పొందాను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హాతలు ఉన్నాయి. అయితే మా ఓనరు ఒత్తిడితో మాకు ఆర్టీసీ పెద్దలు అన్యాయం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? – పి.మునిరామయ్య, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ప్రభుత్వ పద్ధతిలో అద్దె బస్సుల్లో జీతాలు ఇవ్వాలి ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిలో 8గంటలు పనిచేస్తే రూ.800 ఇస్తామని చెబుతోంది. అదే తరహాలో అద్దె బస్సుల యజమానులు మాకు జీతాలు ఇస్తే.. అలానే అద్దె బస్సుల్లో పనిచేస్తాం. మీరు పనికి తగ్గిన జీతం ఇవ్వకుండా.. ప్రభుత్వం ఇస్తుంటే అందులో చాన్స్ లేకుండా చేయడం దారుణం. – ఎన్. సురేష్, అద్దె బస్సు డ్రైవర్ డ్రైవర్లుగా అవకాశం ఇవ్వండి మాకు భార్యాబిడ్డలున్నారు. పనికి తగిన వేతనం కోరుకోవడంలో తప్పు ఏమైనా ఉందా? ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఔట్‌సోర్సింగ్‌లో డ్రైవర్లుగా పనిచేయాలని భావిస్తున్నాం. దయచేసి మాకు ఆర్టీసీ ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా పనిచేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. అనుభవం లేని స్కూల్ బస్సు డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు అవకాశం ఇస్తున్నారు. ఎవరో ఒత్తిడితో మాకు ఇవ్వకపోవడం సరికాదు. –సి.నరసింహులు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ -
డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత
-
కాంట్రాక్టు డ్రైవర్లకు తీపి కబురు
సాక్షి, అనంతపురం: రీజియన్ పరిధిలో 240 పని దినాలు పూర్తి చేసుకున్న 26 మంది ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులర్ చేస్తూ ఆ సంస్థ ఎండీ శనివారం సర్క్యులర్ విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లకు ఇది తీపికబురైంది. రెగ్యులర్ అయిన డ్రైవర్ల జాబితా ఇలా.. ఉద్యోగి పేరు డిపో సి.వి.చలపతి రాయదుర్గం కె.మల్లికార్జున రాయదుర్గం టి.ఆది రాయదుర్గం జి.నరసింహులు రాయదుర్గం జి.గంగాధర్ రాయదుర్గం ఎం.నాగమునెయ్య కళ్యాణదుర్గం ఎస్.మంజునాథ కళ్యాణదుర్గం బి.చంద్రశేఖర్ కళ్యాణదుర్గం బి.సి.మల్లూనాయక్ కళ్యాణదుర్గం ఎస్.రవికుమార్ కళ్యాణదుర్గం కె.రాజ కళ్యాణదుర్గం ఎస్.వీరమారెప్ప కళ్యాణదుర్గం డి.లక్ష్మానాయక్ కళ్యాణదుర్గం డి.గంగాధర కళ్యాణదుర్గం హెచ్.మల్లికార్జున కళ్యాణదుర్గం బి.శంకరప్ప కళ్యాణదుర్గం పి.కుళ్లాయప్ప గుంతకల్లు ఎం.కృష్ణమరాజు గుంతకల్లు ఎల్.జగన్నాథ్ గుంతకల్లు ఎస్.రమేష్‌నాయక్ గుంతకల్లు పి.గంగప్ప గుంతకల్లు జి.సత్యమయ్య గుంతకల్లు డి.మోహన్ గుంతకల్లు ఎన్.డేవిడ్‌రాజు గుంతకల్లు ఎ.జీవన్‌బాబు గుంతకల్లు -
యువకులు, ఆర్టీసీ డ్రవర్ ఇరువర్వాలపై కేసు నమోదు
-
కునుకు కరువవుతోంది
సాక్షి, సిటీబ్యూరో: నైట్ అవుట్ సర్వీసుల్లో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. రెస్ట్ రూంలలో మంచాలు లేక, కనీస సదుపాయాలు లేక కటిక నేలపైనే పడుకుంటున్నారు. తిరిగి నిద్రలేమితోనే తెల్లవారు జామున విధులు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజూ వందలాది బస్సులు వివిధ ప్రాంతాల్లో నైట్ అవుట్ సర్వీసులుగా నిలిచిపోతాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు సర్వీసులను ఉదయాన్నే అక్కడి నుంచి ప్రారంభించేందుకు అనుగుణంగా నైట్ అవుట్ çసర్వీసులను ఏర్పాటు చేశారు. కానీ డ్రైవర్లు, కండక్టర్లకు విశ్రాంతి గదులలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల బస్సుల్లోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వారు సరైన నిద్రకు నోచుకోవడం లేదు. తిరిగి తెల్లవారు జామునే బస్సులు నడపాల్సి రావడంతో నిద్రలేమి, బడలిక కారణంగా విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలోని గౌలిగూడ సెంట్రల్ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్, జగద్గిరిగుట్ట, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు సుమారు 250కి పైగా సిటీ బస్సులను నైట్ అవుట్ సర్వీసులుగా నిలుపుతారు. ఈ బస్సుల్లో 500 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండో షిఫ్టు విధుల్లో చేరిన బస్సులు ఆఖరి ట్రిప్పు పూర్తయిన తరువాత ఇలా నైట్ అవుట్లుగా ఉండి ఉదయం ట్రిప్పులతో డిపోలకు చేరుకుంటాయి. సిబ్బందిపై చిన్న చూపు పటాన్చెరులో ప్రతి రోజు సుమారు 100 బస్సులు నిలిచి ఉంటాయి. 200 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఈ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారి కోసం ఏర్పాటు చేసిన రెస్ట్రూమ్లు దారుణంగా ఉన్నాయి. ఉప్పల్‌లో 70 బస్సులు, జేబీఎస్లో మరో 50 బస్సులు, సీబీఎస్‌లో 70 బస్సులకు పైగా రాత్రి పూట నిలిపి ఉంచుతారు. సీబీఎస్ విశ్రాంతి గదుల్లో డ్రైవర్, కండక్టర్లకు మంచాలు ఉన్నప్పటికీ ఫ్యాన్లసైతం లేకపోవడంతో నిద్ర కరవువవుతోందని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్టలో బస్సుల్లోనే నిద్ర వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులతో పాటు, నగరంలోని పలు డిపోలకు చెందిన 40 బస్సులను జగద్గిరిగుట్టలో నిలిపి ఉంచుతారు. ఇక్కడ ఎలాంటి విశ్రాంతి గదులు లేకపోవడం వల్ల సిబ్బంది బస్సుల్లోనే నిద్ర పోవాల్సి వస్తుంది. ‘‘ బస్సులో పడుకొంటే నిద్ర రాదు. బయట ఎక్కడా పడుకోలేం. పైగా బస్సుల భద్రత కూడా ముఖ్యమే కదా. ఇలా జగద్గిరిగుట్టకు వచ్చినప్పుడల్లా నరకాన్ని చవి చూస్తున్నాం.’’ అని జనగామ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా వాహనాల రొద తమకు నిద్ర లేకుండా చేస్తుందన్నారు. ఉప్పల్‌లో విశ్రాంతి గదులు ఉన్నప్పటికీ సరైన వసతులు లేవు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు విశ్రాంతి గదుల్లో కనీస సదుపాయాలపై ఇప్పటికి చాలా సార్లు అధికారులకు విన్నవించాం, అయినా పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల టాయిలెట్లు లేవు. కొన్ని చోట్ల విశ్రాంతి గదులే లేవు. నైట్ అవుట్ డ్యూటీ కింద రూ.30 అలవెన్స్ ఇస్తారు. ఈ రోజుల్లో ఆ డబ్బులు ఎందుకూ సరిపోవడం లేదు. – హనుమంతు ముదిరాజ్, ఆర్టీసీ టీజేఎంయూ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి నిద్ర లేమి వల్ల చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు అనారోగ్యానికి గురవుతున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం దారణం. – ఆర్ఎన్. రావు, కార్మిక నాయకుడు -
పనిచేయని బ్రీత్ అనలైజర్లతో వేధిస్తున్నారు
-
ఓటుపై వేటు!
సాక్షి, దర్శి (ప్రకాశం): తమ ఓటు హక్కును పథకం ప్రకారం కోల్పోయేలా చేశారని ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు ఆర్వో కృష్ణవేణి ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం తమకు ఎన్నికల డ్యూటీలు వేశారని, బ్యాలెట్ల కోసం ముందస్తు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుంటే డ్యూటీలకు రామన్న అనుమానంతో దర్శిలో పోస్టల్ బాలెట్లు ఇస్తారని అబద్దాలు చెప్పి డ్యూటీకి పంపారని డ్రైవర్లు మండిపడుతున్నారు. ఇక్కడ ఆర్వోను పోస్టల్ బ్యాలెట్లు అడగగా తనకు సంబంధం లేదని సమాధానం చెప్పారని వాపోయారు. ఎన్నకల విధులకు వెళ్లే తాము ఇప్పడు ఓటు ఎలా వేయాలని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని లక్షలు ఖర్చు చేసి ప్రకటనలు చేస్తున్నా తమ గోడు మాత్రం వినడం లేదని మండిపడ్డారు. ఇలా చేయడం దారుణం ఓటు హక్కు లేకుండా చేయడం మనిషిని చంపడంతో సమానం. గతంలో ఇంత దారుణంగా వ్యవహరించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఓటు హక్కును హరిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం లేదు. - ఎం.మల్లికార్జునరావు ఇది మంచి పద్ధతి కాదు అధికారులు వ్యవహార శైలి బాగాలేదు. మాకు ఓటు హక్కు కల్పించాల్సిందే . లేదంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి కుట్రలు చేసే వారికి ఉద్యోగులందరూ సరైన బుద్ధి చెప్పండి. ఎన్నికల కమిషన్ మామొర ఆలకించాలి. - బి.రమణయ్య, ఆర్టీసీ డ్రైవర్ నిలువునా మోసగించారు ముందు పోస్టల్ బ్యాలెట్ ఇస్తామన్నారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పడు అడిగితే సమాధానం లేదు. ముందే ఇలా చేస్తారని చెప్తే డ్యూటీలకు వచ్చే వాళ్లం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఓటు హక్కు హరించేలా ఎన్నికల అధికారులు కుట్రలు చేస్తే ఎన్నికలు పెట్టడం ఎందుకు. - కేవీ రెడ్డి, ప్రైవేటు స్కూల్ బస్ డ్రైవర్ -
‘పోటె’త్తిస్తున్న పని ఒత్తిడి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఆర్టీసీ డ్రైవర్లపై జీవన శైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర ఒత్తిళ్ల నడుమ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత, డబుల్ డ్యూటీలు, సకాలంలో సెలవులు లభించకపోవడం, నగరంలోని ట్రాఫిక్ రద్దీలో గంటల తరబడి బస్సులు నడపడం తదితర కారణాలతో డ్రైవర్లు చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. రాణిగంజ్ డిపోకు చెందిన మల్లారెడ్డి 42 ఏళ్ల వయస్సులోనే తీవ్రమైన గుండెపోటు కారణంగా మంగళవారం చందానగర్‌లో మృతి చెందిన ఉదంతం ఆర్టీసీ కార్మికులను కలవరానికి గురిచేస్తోంది. కేవలం పని ఒత్తిడి వల్లనే డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, అధిక రక్తపోటు, షుగర్, పైల్స్ వంటి జీవన శైలి వ్యాధులతో పాటు గుండె జబ్బులు కూడా కబలిస్తున్నాయని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒక చోట డ్రైవర్లు గుండెపోటుతో మృతి చెందుతున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు సకాలంలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం, వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్సలను అందజేసే సదుపాయం ఆర్టీసీ ఆసుపత్రిలో లేకపోవడంతో పాటు డిపోల్లో సిబ్బంది కొరత, విధుల్లో ఉన్న వారే అదనపు పని గంటలు పని చేయాల్సి రావడం వంటి అంశాల కారణంగా చిన్నవయస్సులోనే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ‘గతంలో 50 ఏళ్లు దాటిన డ్రైవర్లు మాత్రమే గుం డెపోటు వంటి సమస్యలను ఎదుర్కొనేవారని, ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా 40 ఏళ్లకే వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించకపోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఆరోగ్యం బారిన పడుతున్నారు’ అని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్య నిపుణులు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఏటా పెరుగుతున్న డ్రైవర్ల కొరత... గ్రేటర్లో మొత్తం 29 డిపోల నుంచి 3850 బస్సులను నడుపుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, తదితర సిబ్బంది అంతా కలిసి సుమారు 18000 మందికి పైగా ఉన్నారు. వీరిలో 8000 మందికి పైగా డ్రైవర్లు ఉన్నట్లు అంచనా. అయితే ఏటా వందలాది మంది పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించకుండా డిపోల్లో ఉన్న డ్రైవర్లకే అదనపు విధులను అప్పగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కనీసం 1000 మంది డ్రైవర్లను భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా ఏడున్నర గంటలు పని చేసే కార్మికుడు డబుల్ డ్యూటీ పేరిట 15 గంటల నుంచి 16 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. సాయంత్రం విధుల్లో చేరిన వారు తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.‘‘ సిటీలో ఏడున్నర గంటల డ్యూటీ మాత్రమే అంటారు. కానీ ఏ డ్రైవర్ కూడా ఏ ఒక్క రోజు ఏడున్నర గంటల్లో డ్యూటీ ముగించుకొని డిపోకు చేరుకోవడం సాధ్యం కాదు. డబుల్ డ్యూటీ చేసినప్పుడు కచ్చితంగా ఉదయం నుంచి రాత్రి వరకు, లేదా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బస్సు నడపాల్సిందే..’’ అని ఉప్పల్ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తెలిపారు. డబుల్ డ్యూటీకి అంగీకరించకపోయినా, సెలవులు తీసుకొన్నా అధికారులు చార్జీషీట్లతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అరకొర వైద్య సదుపాయాలు... ⇔ గుండెపోటు ముప్పును గుర్తించడంలో ట్రెడ్మిల్ టెస్ట్ (టీఎంటీ) ఎంతో ముఖ్యమైంది. అప్పటి వరకు ఉన్న బలహీనతను గుర్తించడంతో పాటు రాబోయే ముప్పును కూడా ఈ పరీక్ష ద్వారా వైద్యులు గుర్తిస్తారు. ⇔ 50 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయాలను అందజేసే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో ఈ సదుపాయం లేదు. ఇదొక్కటే కాదు. చాలా పరీక్షల కొరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ⇔ డ్రైవర్లకు ప్రతి మూడేళ్లకు ఒకసారి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 45 ఏళ్లు దాటిన వారికి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కొంతకాలంగా పెరిగిన గుండె జబ్బుల ముప్పు ను పరిగణనలోకి తీసుకొని 40 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికీ ఏటా అన్ని రకాల వైద్య పరీక్షలు (టీఎంటీతో సహా) చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాది దాటినా ఇది అమలుకు నోచుకోలేదు. ⇔ టీఎంటీ సదుపాయం లేకపోవడంతో ప్రసు ్తతం ఈసీజీ వంటి సాధారణ పరీక్షలకే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాధుల ముప్పును సకాలంలో పసిగట్టలేకపోతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇔ తార్నాక ఆసుపత్రిలో 40 మంది పారామెడికల్ సిబ్బందికి గాను కేవలం 20 మందే ఉన్నారు. 45 మంది వార్డుబాయ్‌లు పనిచేయాల్సి ఉండగా 18 మంది మాత్రమే ఉన్నారు. 45 మంది వైద్య నిపుణులకు గాను ప్రస్తుతం 28 మంది మాత్రమే పని చేస్తున్నారు. ⇔ వైద్యులు, సిబ్బంది కొరత, సరైన లాబొరేటరీ సదుపాయాలు లేకపోవడం వేలాది మంది కార్మికుల పాలిట శాపంగా మారాయి. -
డ్రైవరన్నా.. జర పైలం!
ఏంటి.. నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా.. నిద్రే.. కానీ శాశ్వత నిద్ర.. అకస్మాత్తుగా గుండెపోటు వస్తే.. తన ప్రాణాలను ఉగ్గబెట్టుకుని.. మనలాంటి ఎందరో ప్రాణాలను కాపాడిన ధీరుడితడు. తనకు ప్రాణప్రదమైన స్టీరింగ్‌పైనే ప్రాణాలను విడిచిన ఆర్టీసీ డ్రైవర్ ఇతడు.. సాక్షి, హైదరాబాద్: ఒక అరుణాచలం.. ఒక తాజ్‌బాబా.. ఒక విష్ణు.. పేరేదైతేనేం.. ఇలాంటి ఎందరివో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద బస్సులో టికెట్లు ఇస్తోన్న కండక్టర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తెలంగాణ ఆర్టీసీలో ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు వందల్లో ఉంటున్నాయి. ప్రాణాంతక వ్యాధులతో చాలామంది ఆయువు ముగియకముందే.. అకాలమరణం చెందుతున్నారు. పని ఒత్తిడి, వేళాపాళాలేని పని వేళల కారణంగా కార్మికులు పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం కార్మికులను, వారి కుటుంబాలను కబళిస్తున్నాయి. గుండెపోటు కార్మికులను క్షణాల్లో విగతజీవులుగా మారుస్తుంటే.. పక్షవాతం జీవితాంతం జీవచ్ఛవాలుగా మారుస్తోంది. వీరికే ఎందుకిలా? ఆర్టీసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందనేది కాదనలేని వాస్తవం. రెండు, మూడు రోజులు వరుసగా విధులు నిర్వహించాల్సి రావడంతో కార్మికులు శారీరకంగా అలసిపోవడం, కుటుంబానికి దూరమై మానసికంగా కుంగిపోతున్నారు. వీరి జీవనశైలి కూడా శరీరంలోకి పలు రోగాలను మోసుకొస్తోంది. వేళకు తినరు, నిద్రపోరు. దీంతో గ్యాస్, అల్సర్, అజీర్తి వంటి సమస్యలు విధుల్లో చేరిన కొన్ని నెలల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల పైల్స్, గంటల కొద్ది నిద్రను కోల్పోవడంతో కంటి సమస్యలు డ్రైవర్లను పీడిస్తున్నాయి. ఇక కండక్టర్లు నిల్చోవడం వల్ల కీళ్ల నొప్పులు, వెరికోసిస్ లాంటి జబ్బుల బారిన పడుతున్నారు. శరీరంలో సరిపడా నీరు లేక కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వీటికితోడు అధికారుల వేధింపులు, చలానాలు రాయడం, మెమోలు ఇవ్వడం తదితర సమస్యలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇవే దీర్ఘకాలంలో గుండె సమస్యలు, పక్షవాతానికి కారణమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నియామకాలేవీ..? ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 700 మంది శ్రామిక్‌లు, 440 మెకానిక్‌లు, 460 ఆర్టిజెన్స్ పోస్టులను సంస్థ నేరుగా రిక్రూట్ చేసుకుంది. ఆ తర్వాత ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవు. 2011 నుంచి నేటి వరకు దాదాపుగా 7 వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో దాదాపుగా 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు జూన్‌లో మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. కానీ, ఈ విషయంలో ఎలాంటి పురోగతిలేదు. ఈ భర్తీలు లేకపోవడంతో ఇప్పుడున్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది. ఎన్ఐఎన్ సేవలు వద్దా? ప్రతీరోజు వందలాది మంది కార్మికులు పై సమస్యలతో తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వస్తున్నారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూత్రాన్ని ఆర్టీసీ యాజమాన్యం విస్మరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తార్నాకలోనే ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సలహాలు తీసుకుంటే తప్పేంటని పలువురు సూచిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేసే కార్మికులకు ఎలాంటి డైట్ తీసుకుంటే బావుంటుందన్న సలహాలను తీసుకునే ఓపిక లేదా అని అశోక్ (ఎన్ఎంయూ) ప్రశ్నిస్తున్నారు. డైట్ పాటిస్తే కార్మికులకు ఇప్పుడు వస్తున్న చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అంటున్నారు. నియామకాలు చేపట్టాలి ప్రపంచీకరణ వల్ల చాలా మార్పులు వచ్చాయి. దీనిలో భాగంగా 8 గంటల పని విధానాన్ని మార్చాలి. పని గంటలను 6 గంటలకు కుదించాలి. పని భారం తగ్గించాలి. వరుస డ్యూటీలు వేయడం మాను కోవాలి. కొత్త నియామకాలు చేపట్టాలి. –నాగేశ్వరరావు, చైర్మన్, ఎన్ఎంయూ ఎంతమంది మరణించారు? -
ఆర్టీసీ డ్రైవర్ల డబుల్ డ్యూటీలు రద్దు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ బాధ తప్పింది. డబుల్ డ్యూటీలను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో రీజినల్ మేనేజర్లు డబుల్ డ్యూటీలు రద్దు చేసి డ్రైవర్లకు లింకు డ్యూటీలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా డిపోల్లో అధికారులు లింకు డ్యూటీలపై యూనియన్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. లింకు డ్యూటీలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సును జగ్గయ్యపేట వరకు ఓ డ్రైవరు తీసుకొస్తే, అక్కడి నుంచి మరో డ్రైవరు తీసుకెళ్లేలా డ్యూటీలు వేయనున్నారు. డబుల్ డ్యూటీలతో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా బస్సులను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యాజమాన్యం నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తున్నారు. డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు అధికారులు బలవంతంగా పంపుతున్నారు. ఆ డ్యూటీకి వెళ్లకుంటే లీవు కూడా ఇవ్వని పరిస్థితి పలు డిపోల్లో నెలకొంది. మోటారు వాహన చట్టం ప్రకారం బస్సు నడిపే డ్రైవరుకు ప్రతి గంటకు 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. కానీ ఆర్టీసీలో డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా డ్యూటీలకు పంపుతున్నారు. ఉదయం ఆరు గంటలకు విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా నెల్లూరు వెళ్లే డ్రైవరు సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటారు. మళ్లీ రాత్రి పది గంటలకు అదే డ్రైవరు హైదరాబాద్‌కు వెళ్లాలి. చెన్నై, బెంగుళూరు దూర సర్వీసులకు కూడా ఒక్క డ్రైవరే వెళుతుండటం గమనార్హం. ఆర్టీసీలో 800 డ్రైవర్ల పోస్టులు ఖాళీ 13 జిల్లాల్లోని డిపోల్లో మొత్తం 800 డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా ఇన్నాళ్లూ డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేశారు. డబుల్ డ్యూటీలకు గాను ఒక్కో డ్రైవరుకు రూ. 350, కండక్టర్‌కు రూ.300 ఇచ్చేవారు. చట్టం ప్రకారం ఓటీ చేస్తే రూ.1,200 ఇవ్వాలి. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండేళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ కింద 200 మంది డ్రైవర్లను తీసుకున్నారుకానీ, ఇంతవరకు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను ఇప్పటివరకు 700 మందిని తొలగించారు. అధ్వానంగా విశ్రాంతి గదులు రాష్ట్రంలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక్క విజయవాడ మినహా ఇతర చోట్ల విశ్రాంతి గదులు అధ్వానంగా ఉన్నాయి. డ్రైవర్లకు విశ్రాంతి గదులను నిర్మిస్తామని మేనేజ్మెంట్ చెబుతున్నా.. ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. చెన్నై, బెంగళూరు వెళ్లే డ్రైవర్లకు సరైన విశ్రాంతి గదులు లేక ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్లోనూ, బీహెచ్‌ఈఎల్‌లోనూ విశ్రాంతి గదులు అధ్వానంగా ఉన్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణం): సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు... వస్తువులు ఏమైనా దొరికితే మెల్లగా జేబులో పడేసేవారు కొందరు. దొరికిన సొమ్ము పోలీసులకు అందజేస్తే నొక్కేస్తారేమోనన్న భయంతో వారికి అందజేయకుండా ఉండిపోయిన వారు మరికొందరు. దొరికిన సొమ్ము/వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయాలన్న తపన ఇంకొందరిది. ఈ కోవకే చెందుతారు విజయవాడ గవర్నర్పేట్ ఆర్టీసీ డిపో డ్రైవర్లు. డబ్బులు, బ్యాంకు ఏటీఎం కార్డులు పోగొట్టుకున్న ఆర్టీసీ ప్రయాణికుడికి అందజేసి వారి నిజాయితీ నిరూపించుకోవడమే గాక ఆర్టీసీకి పేరు తెచ్చిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం కోటపాడు మండలం కె.గుల్లేపల్లికి చెందిన షేక్ రసూల్ ఈ నెల 2న సాయంత్రం విశాఖ వచ్చేందుకు విజయవాడ – విశాఖపట్నం బస్సు (సర్వీస్ నంబరు 95449, ఏపీ16జెడ్0227))లో ప్రయాణం చేశారు. సీటు నంబరు 30లో కూర్చున్నారు. విశాఖపట్నం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఆ ప్రయాణికుడు బస్సు దిగిపోయారు. ఆతృతగా దిగిన ఆ వ్యక్తి తను కూర్చున్న సీటులో మనీపర్స్, ఏటీఎం కార్డులు మరచిపోయారు. విశాఖపట్నం ద్వారకా బస్సు స్టేషన్‌కు ఆ బస్సు చేరింది. బస్సు దిగినప్పుడు డ్రైవర్లు ఎం.వి.కాసులు(ఎంప్లాయి నంబరు 370550), ఎం.దానయ్య (ఎంప్లాయి నంబరు 371520) బస్సును పరిశీలించారు. సీటు నంబరు 30లో ప్రయాణికుడు మరచిపోయిన మనీపర్సును గుర్తించారు. ఆ మనీపర్సులో రూ.8,500 నగదు, ఏటీఎం కార్డులు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నాయి. వాటిని ఆ డ్రైవర్లు ఇద్దరూ భద్రపరచి మనీపర్సు పోగొట్టుకున్న రసూల్‌కు ఫోన్‌చేసి ద్వారకా బస్టేషన్‌కు పిలిపించి వాటిని స్టేషన్ మేనేజర్ ద్వారా మంగళవారం అందజేసి నిజాయితీ చాటుకున్నారు. డ్రైవర్ల నిజాయితీని ఇటు ప్రయాణికుడు, అటు ఆర్టీసీ మేనేజర్ అభినందించారు. -
ఆర్టీసీలో యూనిఫామ్ లొల్లి!
♦ మూడేళ్లుగా నిలిచిపోయిన సరఫరా ♦ పాత దుస్తులు చిరిగిపోవటంతో సాధారణ వస్త్రాల్లో విధులకు సిబ్బంది ♦ అభ్యంతరం చెబుతున్న అధికారులు.. సిబ్బందికి మెమోలు.. సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ లేకుండానే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది గందరగోళానికి, వివాదాలకు కారణమవుతోంది. యూనిఫామ్‌ను సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యమే సరఫరా చేస్తుంది. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ గడచిన మూడేళ్లుగా యూనిఫామ్ సరఫరా చేయటం లేదు. దీంతో పాతవాటితోనే నెట్టుకొస్తున్న సిబ్బంది.. ఇప్పుడవి చిరిగిపోవటంతో సాధారణ దుస్తుల్లో విధులకు వస్తున్నారు. అయితే యూనిఫామ్ నిబంధన అమలులో ఉండటంతో వారికి మెమోలు జారీ చేస్తుండటం.. వివాదాలకు కారణమవుతోంది. 2013 తర్వాత నిలిపివేత.. 2013 తర్వాత యూనిఫామ్ జారీ నిలిచిపోయింది. ఏడాదికి రూ.2.5 కోట్లు దీనికి ఖర్చు చేయాల్సి రావటంతో నిధులకు ఇబ్బంది ఏర్పడి యాజమాన్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో అప్పటి నుంచి సిబ్బంది పాత యూనిఫామ్‌తోనే నెట్టుకొస్తున్నారు. మూడున్నరేళ్లు గడిచిపోవటంతో ఆ దుస్తులు చిరిగిపోయా యి. దీంతో కొన్ని రోజులుగా చాలామంది కార్మికులు సాధారణ దుస్తుల్లో విధులకు వస్తుండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు కార్మికులు సొంత ఖర్చులతో యూనిఫామ్ కుట్టించుకున్నారు. రెండు మూడు హెచ్చరికల తర్వాత యూనిఫామ్ లేని సిబ్బందికి అధికారులు మెమోలు జారీ చేస్తున్నారు. సంస్థ యూనిఫామ్ సరఫరా చేయకపోతే తమనెందుకు శిక్షిస్తారంటూ సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తుండటంతో అధికారులకు సిబ్బందికి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల కార్మికులను తిప్పిపంపుతున్నట్లు ఫిర్యాదులొస్తుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ సాధారణ దుస్తుల్లో వచ్చినా అనుమతిస్తున్నారు. కాగా, నిధుల సమస్య పేరుతో ఆర్టీసీ యూనిఫామ్‌ను జారీ చేయకపోవటం సరికాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో రావాల్సిన పరిస్థితి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు.. త్వరలో కార్మికులకు కొత్త యూనిఫామ్ జారీ చేయాలన్న ఆలోచనకొచ్చినట్టు తెలిసింది. -
ఆర్టీసీ డ్రైవర్లు డిపో సమీపంలో నివాసం ఉండాలి
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీ మొదలుపెట్టేముందు బస్సులను క్షుణ్నంగా పరిశీలించుకోవాలని, ఇందుకోసం వారు డిపో చేరువలో నివాసం ఉండాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (అడ్మిన్) సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే డిపోల పర్సనల్ సూపర్వైజర్లు కార్మికుల సంక్షేమ కార్యక్రమాల వివరాలను వారికి ఎప్పటికప్పుడు తెలిపి వాటిని వాడుకునేలా చూడాలని అన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ మహిళా కండక్టర్లకు నిర్వహిస్తున్న కరాటే తరగతులు, పర్సనల్ సూపర్వైజర్స్ జూనియర్ అసిస్టెంట్స్ శిక్షణ తరగతులను పరిశీలించారు. ఆయనకు ట్రాన్స్పోర్ట్ అకాడమీ ప్రిన్సిపల్ కిరణ్ శిక్షణల గురించి వివరించారు. -
‘రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి’
తాండూర్(రంగారెడ్డి): రాష్ట్రంలో ఏటా జరుగుతున్న వేలాది రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం తాండూర్ ఆర్టీసీ డిపోలో జరిగిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ.18కోట్లతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించనున్నట్లు వివరించారు. సురక్షితంగా వాహనాలను నడిపేలా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని అన్నారు. ప్రమాదాల నివారణ లో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సురక్షిత ప్రయాణానికి అవసరమైన మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా లఘుచిత్రాలు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. అంతకుమునుపు ఆయన డిపోలో మొక్కలు నాటారు. -
భద్రతకు విశ్రాంతి ఉండదు
డ్రైవర్లు మద్యానికి దూరంగా ఉండడం ఉత్తమం ప్రమాదం అంటే పలు కుటుంబాల చిన్నాభిన్నం ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాంప్రసాద్ ఒంగోలు : భద్రతకు విశ్రాంతి ఉండదనే విషయం ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాంప్రసాద్ అన్నారు. గురువారం ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం అన్నారు. మద్యపానం అలవాటుగా మారితే కొన్నాళ్లకు అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, మెదడు అందించే ఆదేశాలను క్షణ కాలంలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తద్వారా డ్రైవర్ చూస్తుండగానే ప్రమాదం జరిగిపోతుందన్నారు. ప్రమాదం జరిగితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని, బాధిత కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులకు గురవుతాయన్నారు. కాలం చెల్లిన బస్సులను సైతం ప్రమాదరహితంగా రోడ్లపై తిప్పిన డ్రైవర్లను అభినందించారు. ఎంవీఐ గోపీనాయక్ మాట్లాడుతూ.. ప్రమాదాలను నివారించే శక్తి డ్రైవర్‌కు మాత్రమే ఉంటుందని, విశ్రాంతి సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆర్టీసీ ఆర్ఎం కె.ఆదాంసాహెబ్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్లను డిపోకు 10 నుంచి 15 మందిని గుర్తించి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సర్వీసులో కనీసం ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్ల వివరాలు వెల్లడించారు. రీజియన్ స్థాయిలో ముగ్గురు, డిపో స్థాయిలో ముగ్గురు చొప్పున మొత్తం 27 మంది డ్రైవర్లను సన్మానించి, బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ పీఓ సుధాకరన్, పార్శిల్ విభాగం మేనేజర్ శ్రీమన్నారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా 40 మంది ఆర్టీసీ కార్మికులు స్థానిక ఒంగోలు ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ప్రమాద రహిత డ్రైవర్లు వీరే.. ఒంగోలు రీజియన్ : మార్కాపురం డిపో డ్రైవర్ ఎస్.జబ్బార్(29 ఏళ్ల అనుభవం), పొదిలి డిపో డ్రైవర్లు ఈ.కోటయ్య(28), ఎడిఎం.వలి(28)