సాక్షి, హైదరాబాద్: డ్రైవర్లు బస్సు నడిపే క్రమంలో మొబైల్‌ఫోన్లు వాడుతూ ప్రమాదాలబారిన పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటుండటంతో టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. డ్రైవర్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండే చర్యల్లో భాగంగా వారు విధుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు డ్యూటీలో భాగంగా గమ్యం చేరిన తర్వాత.. తిరిగి మళ్లీ బయలుదేరేలోగా ఉన్న విశ్రాంతి సమయంలోనూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. ఈ చర్యలకు డ్రైవర్లు అలవాటుపడేలా వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
నిబంధనలు ఇలా...
- హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బస్టాండ్‌కు చేరుకోగానే అక్కడి టీఎస్‌ఆర్టీసీ కేంద్రంలోని ఏటీఎం కార్యాలయంలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి బస్సు బయలుదేరే సమయంలో వాటిని తీసుకోవాలి.
- ఇతర దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఉండే అటెండర్‌కు డ్రైవర్ తన మొబైల్ ఫోన్ అప్పగించాలి. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండరే మాట్లాడి డ్రైవర్‌కు సమాచారం చెప్పాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, లేదా ఇతరుల నుంచో వచ్చే ముఖ్యమైన కాల్స్ ఉంటే బస్సును పక్కన ఆపి మాట్లాడిన తర్వాతే బస్సును నడపాల్సి ఉంటుంది.
- ఇద్దరు డ్రైవర్లు ఉండే నాన్–ఏసీ దూరప్రాంత బస్సుల్లో అయితే రెండో డ్రైవర్‌కు ఫోన్ అప్పగించాల్సి ఉంటుంది.
- హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసుల్లోనూ కఠిన నిబంధనల అమలు ప్రారంభించారు. డిపోనకు రాగానే అక్కడి కంట్రోలర్‌కు డ్రైవర్లు ఫోన్లను అప్పగించాలి. ఈలోగా ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే విషయాన్ని తెలుసుకొని కంట్రోలర్లు ఆయా దారుల్లో ఉండే పాయింట్ల మీది కంట్రోలర్ల ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్లకు చేరవేయాలి.
- అవగాహన కార్యక్రమాల తర్వాత ఈ నిబంధన పాటించని వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని 2 నెలలపాటు బస్ డిపోల్లోనే ఉంచనున్నారు. అప్పటికీ తీరు మారకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.
ఆ డ్రైవర్లకు భారం తప్పించే ఏర్పాటు..
బస్సు టికెట్లను అడ్వాన్సుగా ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్‌ఎస్) ద్వారా బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి బస్సు డ్రైవర్ సెల్ నంబర్ అందిస్తున్నారు. బస్సును ట్రాక్ చేసే క్రమంలో ప్రయాణికుడు డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్లు చేయడం ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్‌ను ప్రయాణికులు ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే బస్సును సులభంగా ట్రాక్ చేసుకోవడంతోపాటు ఇతర సమస్త సమాచారం తెలుస్తుంది. ఈ దిశగా ప్రయాణికులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టికెట్ బుక్ చేసుకుంటే.. డ్రైవర్ నంబర్‌కు బదు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సెంటర్ నంబర్ ఇవ్వనున్నారు. ప్రయాణికుడు ఫోన్ చేయగానే ఆ సెంటర్ సిబ్బంది సిస్టంలో గమ్యం యాప్ తెరిచి బస్సు వివరాలు తెలుసుకుని చేరవేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment