
మండుతున్న ఎండలతో ఆటోలు, క్యాబ్‌లకు డిమాండ్
ప్రయాణికులను అడ్డగోలుగా దోచేస్తున్న వైనం
ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోని సిటీక్యాబ్ చట్టం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలతో పాటు క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులను ఠారెత్తిస్తున్నాయి. రద్దీ వేళల నెపంతో అడ్డగోలుగా సర్‌చార్జీలు విధిస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా చార్జీల వసూళ్లకు దిగుతున్నాయి. మరోవైపు ప్రయాణికుల నుంచి తీసుకొనే చార్జీల్లో కమిషన్‌ల పేరిట క్యాబ్ సంస్థల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో చేరుతున్నాయని, రాత్రింబవళ్లు వాహనాలు నడిపే తమకు ఎలాంటి మిగులుబాటు ఉండడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 5,000 క్యాబ్‌లు..
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం సుమారు 5,000 క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తాయి. బంజారాహిల్స్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా అయితే రూ.450 నుంచి రూ.500 వరకు చార్జీ అవుతుంది. ప్రస్తుత వేసవి రద్దీని సాకుగా చూపుతూ క్యాబ్ సంస్థలు రూ.750 నుంచి రూ.800 వరకు చార్జీలు విధిస్తున్నాయి. ఇలా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ సంస్థలు విధించే చార్జీల వల్ల ఒకవైపు ప్రయాణికులు, మరోవైపు క్యాబ్ డ్రైవర్లు కూడా అన్యాయానికి గురవుతున్నట్లు ఆర్టీఏ అధికారి విస్మయం వ్యక్తం చేశారు.
రద్దీ లేకున్నా సర్‌చార్జీలు..
సాధారణంగా ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో వాహనాలు అందుబాటులో లేనప్పుడు సర్‌చార్జీలను విధిస్తారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ఇలా అదనపు వడ్డింపులకు పాల్పడుతున్నారు. నిజానికి మోటారు వాహన చట్టం ప్రకారం ప్రజారవాణా వాహనాలకు రద్దీ సమయాలు, రద్దీ లేని సమయాలు అంటూ ప్రత్యేకమైన తేడాలు లేవు. అన్ని వేళల్లోనూ ఒకే విధమైన చార్జీలను వసూలు చేయాలి. కానీ.. ఇందుకు భిన్నంగా కొన్ని క్యాబ్ సంస్థలు సర్‌చార్జీలను విధిస్తున్నాయి. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు నమోదైన చార్జీలకు అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు విధిస్తున్నారు.
క్యాబ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉండే హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్‌ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమైన ఆటోల్లో ఒక్కోసారి క్యాబ్‌ల కంటే ఎక్కువ చార్జీలు నమోదు కావడం గమనార్హం. సాధారణంగా తిరిగే ఆటోల్లోనూ మీటర్ రీడింగ్‌తో నిమిత్తం లేకుండా వసూళ్లకు దిగుతున్నారు. అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు విధించే చార్జీలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఆటో, ట్యాక్సీ చట్టాలు అమలు కావడం లేదు.
త్వరలో ‘సహకార్ ట్యాక్సీ’
దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్ తదితర క్యాబ్ సంస్థలకు పోటీగా కేంద్రం సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. ‘సహకార్ ట్యాక్సీ’ పేరుతో రానున్న ఈ యాప్ డ్రైవర్ల సహకార సంస్థగా పని చేయనుంది. ఈ యాప్‌లో నమోదైన డ్రైవర్ల సేవలకు తగిన ఫలితం వారి ఖాతాల్లో చేరిపోతుంది. సహకార్ ట్యాక్సీ నిర్వహణ కోసం మాత్రం నామమాత్రంగా కొంతమొత్తాన్ని డ్రైవర్ల నుంచి తీసుకుంటారు. ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఊరట లభించనుంది.