ఐదేళ్లలో 24–43 వేల ఎంయూల మిగులు విద్యుత్
అశాస్త్రీయ, అవాస్తవిక డిమాండ్ అంచనాలతో ఇప్పటికే అడ్డగోలుగా పీపీఏలు
ఇకపై కొత్త ఒప్పందాలకు అనుమతిపై ఈఆర్సీ పునరాలోచన చేయాలి
విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ విచారణలో నిపుణులు, పారిశ్రామిక సంఘాల అభ్యంతరాలు
28న కొత్త టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించనున్న ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ డిమాండ్‌పై అశాస్త్రీయ, అవాస్తవిక అంచనాల ఆధారంగా గతంలో అడ్డగోలుగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. ఈ పీపీఏల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండబోతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లలో కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాద విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.
2024–25లో 24వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండనున్న మిగులు విద్యుత్.. 2028–29 నాటికి 43 వేల ఎంయూలకు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నివేదించాయని గుర్తు చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తయితే మిగులు విద్యుత్ ఇంకా పెరిగిపోతుందన్నారు. కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మిగులు విద్యుత్ మరింతగా పెరిగి రాష్ట్ర ప్రజలపై అనవసర భారం పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పీపీఏలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) అనుమతిచ్చిందని, ఇకపై కొత్త పీపీఏలకు అనుమతి విషయంలో పునరాలోచించాలని సూచించారు.
2024–25లో రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పీడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్) పై బుధవారం విద్యుత్ నియంత్రణ్ భవన్‌లో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో పెద్ద సంఖ్యలో వక్తలు పాల్గొని మాట్లాడారు. పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలతో ప్రయోజనాలతోపాటే దుష్పరిణామాలూ ఉంటాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు తెలిపారు.
అవసరానికి మించి ఈ ఒప్పందాలు చేసుకుంటే జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించడం/పూర్తిగా నిలుపుదల చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఒప్పందాలతో ఇప్పటికే రాష్ట్రానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 2022–23లో ఏకంగా రూ.5596 కోట్ల చార్జీలను పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించిందన్నారు. వాస్తవానికి ఏటా రూ.3వేల కోట్లకు పైనే చార్జీలు పెరుగుతాయన్నారు. జెన్‌కో థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలకు మరమ్మతు లేక ఉత్పత్తి తగ్గిందన్నారు.
ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య ముందు తొలుత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తమ ప్రతిపాదనలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 28న ఈఆర్సీ కొత్త టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
ఇలా అయితే పరిశ్రమలు తరలిపోతాయి
హెచ్‌టీ కేటగిరీలోని 33 కేవీ, 133 కేవీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను 11 కేవీ వినియోగదారులతో సమానంగా పెంపుతోపాటు కొత్తగా స్టాండ్‌బై చార్జీలు, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు, అన్‌బ్లాకింగ్ చార్జీల ప్రతిపాదనలను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ), తెలంగాణ ఐరన్, స్టీల్ మ్యానుఫాక్టర్స్ అసోసియేషన్, ఏపీ, టీజీ ప్లాస్టింగ్ మాన్యుఫాక్టరింగ్ అసోసియేషన్‌లు వ్యతిరేకించాయి.
ఇలా అయితే రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్‌కు సమానంగా తమ విద్యుత్ చార్జీలను తగ్గించాలని దక్షిణమధ్య రైల్వే సీఈ కె.థౌర్య విజ్ఞప్తి చేశారు.
రైతుల ఇబ్బందులపై వక్తల ఆగ్రహం
వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతుల కోసం రవాణా చేసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై భారతీయ కిసాన్ సంఘ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది రాకపోవడంతో రైతులే మరమ్మ తులకు ప్రయత్నించి విద్యుదాఘాతంతో మరణిస్తున్నా రన్నారు.
విద్యుత్ సిబ్బంది అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. పాడి పరిశ్రమను వ్యవసాయ కేటగిరీ కింద చేర్చి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు.
చార్జీల పెంపును వ్యతిరేకిస్తాం: మధుసూదనాచారి
తెలంగాణలో 2015–23 మధ్య కాలం కరెంట్ విషయంలో స్వర్ణ యుగమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గత ప్రభుత్వం చార్జీలు పెంచలేదన్నారు. చార్జీల పెంపుతో పరిశ్రమలు తరలిపోతాయని, మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1220 కోట్ల చార్జీలను పెంచకుండా ప్రభుత్వమే అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నారు.
అక్కడికక్కడే ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత
వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జైన్ తిరుమలాపూర్‌లో పొలం వద్ద విద్యుదాఘాతంతో 2022 మార్చి 28న పరగోల యాదయ్య చనిపోయాడు. బహిరంగ విచారణలో ఫిర్యాదు రాగా, అక్కడిక్కడే సీఎండీ రూ.5 లక్షల చెక్‌ను యాదయ్య భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు, సభ్యులు మనోహర్, కృష్ణయ్య, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment