గృహజ్యోతి పథకానికి షరతులతో ఈఆర్సీ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే డిస్కంలకు నిధులివ్వాలి
లేనిపక్షంలో జీరో బిల్లుల జారీ ఉండరాదు
ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ చెల్లించాలి
సబ్సిడీ చెల్లింపులపై నివేదికలివ్వాలి
సత్వరంగా టారిఫ్ ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విడుదల చేయాలని.. అలా చేస్తేనే వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం–2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘గృహజ్యోతి’ పథకానికి షరతులతో ఆమోదం తెలిపింది.
ముందుగా ఇవ్వాలి.. లేదా రిఫండ్ చేయాలి..
అర్హులైన పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు జీరో బిల్లుల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం.. ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో.. డిస్కంలు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని వివరించింది.
సకాలంలో రాబట్టుకోవాలి..
గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలను తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కంలు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాల్లో ఇంధన శాఖ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలను కూడా సత్వరమే సమర్పించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment