![Huge Outstanding electricity bills due from electricity consumers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/power.jpg.webp?itok=C9WUxhXC)
ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్, టారిఫ్ నివేదికలో డిస్కంల వెల్లడి
వాటిలో ప్రభుత్వ శాఖల బకాయిలే రూ. 28 వేల కోట్లపైన..!
విద్యుదాఘాతంతో 316 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లకు విద్యుత్ వినియోగదారుల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు గతేడాది సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా రూ. 30,777 కోట్లకు ఎగబాకాయి. రూ. 50 వేలు, ఆపై కరెంట్ బిల్లులు బకాయిపడిన వినియోగదారుల నుంచి రావాల్సిన బకాయిలివి. అందులో టీజీఎస్పీడీసీఎల్‌కు రావాల్సిన బకాయిలు రూ. 17,405.04 కోట్లకాగా టీజీఎన్పిడీసీఎల్‌కు రావాల్సిన బకాయిలు రూ. 13,372.61 కోట్లుగా ఉన్నాయి.
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్) 2025–26లో ఈ విషయాన్ని డిస్కంలు వెల్లడించాయి. ఎల్టీ కేటగిరీ వినియోగదారుల నుంచి టీజీఎస్పీడీసీఎల్‌కు రూ. 630.05 కోట్లు, టీజీఎన్పిడీసీఎల్‌కు రూ.320.66 కోట్లు కలిపి మొత్తం రూ.950.71 కోట్ల బాకాయిలు రావాల్సి ఉంది. ఇక హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్‌కు రూ.16,774.98 కోట్లు, టీజీఎన్పిడీసీఎల్ రూ.13,051.95 కోట్లు కలిపి మొత్తం రూ.29,826.93 కోట్లు బకాయిపడ్డారు.
సర్కారు వారి బకాయిలే అత్యధికం..
మొత్తం బకాయిల్లో రూ. 29,826.93 కోట్లు హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులవే. వాటిలో అత్యధిక బకాయిలు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే డిస్కంలకు వివిధ ప్రభుత్వ శాఖలు రూ. 28 వేల కోట్లపైనే బకాయిపడ్డాయి.
కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకాలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో ఏటేటా బకాయిలు పెరిగిపోయాయి.
టపటపా పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు
గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 52,202 డిస్త్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమయ్యాయి. కేవలం 6 నెలల్లోనే 50 వేలకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధం కావడం ఓవర్‌లోడ్ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 28,996 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా.. టీజీఎన్పిడీసీఎల్ పరిధిలో మొత్తం 24,132 ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమయ్యాయి. మరోవైపు అదే కాలానికి విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన మొత్తం 2,79,939 విద్యుత్ మీటర్లు దగ్ధం కావడం లేదా పాడయ్యాయి.
6 నెలల్లో 316 మంది బలి
గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రాష్ట్రంలో విద్యుదాఘాతంతో 316 మంది మృతిచెందగా 105 మంది గాయపడ్డారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 99 మంది, టీజీఎన్పిడీసీఎల్ పరిధిలో 217 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 34, కామరెడ్డిలో 20, మహబూబాబాద్, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చెరో 19 మంది మరణించారు.
పాత కేసులు కలుపుకుని ఈ కాలంలో టీజీఎస్పీడీసీఎల్ 138 మంది, టీజీఎన్పిడీసీఎల్ 165 మంది మృతుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాయి. ఇక విద్యుత్ సరఫరా అంతరాయాలకు సంబంధించి మొత్తం 5,23,762 ఫిర్యాదులను రెండు డిస్కంలు అందుకున్నాయి. మరోవైపు 53,633 విద్యుత్ చౌర్యం కేసులు నమోదవగా అందుకు సంబంధించి రూ. 65.04 కోట్ల జరిమానాలను డిస్కంలు విధించాయి.
28లోగా అభ్యంతరాలు తెలపండి: టీజీఈఆర్సీ
డిస్కంల ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలపై ఈ నెల 28లోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని టీజీఈఆర్సీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. మార్చి 19న హన్మకొండలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందీరంలో, 21న హైదరాబాద్‌లోని టీజీఈఆర్సీ కార్యాలయం(విద్యుత్ నిలయం)లో బహిరంగ విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment