power bill pending
-
TS: ‘పవర్’ నిషేధం ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల విద్యుత్ బకాయిలు, కొనుగోళ్లపై నిషేధం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకుంది. నిర్దేశిత గడువు ముగిసినా.. విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిలు చెల్లించలేదన్న ప్రకటనను వెనక్కి తీసుకుంది. గడువులోగానే చెల్లింపులు చేశామన్న తెలంగాణ వాదనను అంగీకరించింది. ఎనర్జీ ఎక్సేంజ్‌ల ద్వారా విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా రాష్ట్ర డిస్కంలపై విధించిన నిషేధాన్ని శనివారం ఎత్తివేసింది. కేంద్రం నిషేధాన్ని సడలించిందని, ఎనర్జీ ఎక్సేంజ్‌ల నుంచి విద్యుత్ కొనుగోళ్లను పునః ప్రారంభించామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. మూడుసార్లు మాట మార్చి.. నిర్దేశిత గడువు ముగిసినా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదంటూ.. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కంలను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ డిస్కంలు ఎనర్జీ ఎక్స్ఛేంజీల ద్వారా క్రయవిక్రయాలు జరపకుండా గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇందులో తెలంగాణ డిస్కంలు రూ.1,380 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొంది. అయితే తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్రాలు తాము గడువులోగానే బకాయిలు చెల్లించామని కేంద్ర ప్రభుత్వానికి వివరించాయి. దీనితో మరుసటి రోజు శుక్రవారమే ఏపీ సహా పలు రాష్ట్రాలపై నిషేధాన్ని కేంద్రం సడలించింది. తెలంగాణ బకాయిలను పునః సమీక్షించి రూ.52 కోట్లే చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మళ్లీ తెలంగాణ డిస్కంలు సంప్రదింపులు జరిపి, బకాయిలు చెల్లించేసిన ఆధారాలను చూపాయి. తిరిగి పరిశీలన జరిపిన కేంద్రం రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది. ఈ బకాయిని రాష్ట్ర డిస్కంలు వెంటనే చెల్లించేయడంతో నిషేధాన్ని సడలించింది. ప్రైవేటు కంపెనీల కోసం అనవసర జోక్యం! కేంద్ర విద్యుత్ శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం.. డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు 45రోజుల గడువులోగా బిల్లులు చెల్లించాలి. ఆ గడువు దాటి మరో నెల గడిచినా చెల్లించకుంటే.. ఆ తర్వాతి రోజును ‘డిఫాల్ట్ ట్రిగ్గర్ డేట్’గా పరిగణిస్తారు. అంటే ఆ రోజు నుంచి 75 రోజుల్లోగా బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోళ్లు జరపకుండా సదరు డిస్కంలను కట్టడి చేసే నిబంధనను కేంద్రం తెచ్చింది. ఈ అధికారాన్ని జాతీయ గ్రిడ్ నిర్వహణను పర్యవేక్షించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పోసోకో)’కు కట్టబెట్టింది. దీనిని తెలంగాణ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు ప్రయోజనం కల్పించడానికే కేంద్రం ఈ నిబంధనలు తెచ్చిందని ఆరోపిస్తున్నాయి. నిజానికి గడువులోగా బకాయిల చెల్లింపులో డిస్కంలు విఫలమైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని నిబంధనల ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీలు చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కంపెనీలు విద్యుత్ సరఫరాను నిలిపివేయొచ్చని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని, కోర్టుకు వెళ్లవచ్చని అంటోంది. అయినా కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని మండిపడుతోంది. బకాయిల చెల్లింపుతో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్డీసీ)కి ఏ సంబంధం లేకపోయినా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం దానికి కట్టబెట్టడం సరికాదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. చదవండి: ఇవి పార్టీల ఎన్నికలు కావు.. మన బతుకుదెరువు ఎన్నికలు -
పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్)లో విద్యుత్ కొనుగోలు, విక్రయాలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన ‘ప్రాప్తి’ వెబ్ పోర్టల్ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కమ్‌లపై గురువారం కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. బకాయిలను ఏపీ డిస్కమ్‌లు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ ప్రాప్తి పోర్టల్‌లో బకాయిదారుల జాబితాలో చేర్చటాన్ని రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రం దృష్టికి తెచ్చింది. దీంతో పొరపాటును గుర్తించిన కేంద్రం నిషేధిత రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగిస్తూ విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలను యధావిధిగా నిర్వహించేందుకు అనుమతించాలని ఐఈఎక్స్‌ను ఆదేశించింది. తొలి వాయిదా చెల్లించాం.. రెండో దానికి టైముంది కేంద్ర విద్యుత్తు శాఖ ఈ ఏడాది జూన్ 3న లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్పీఎస్) స్కీం కింద బకాయిల వసూలుకు సర్‌చార్జ్ రూల్స్ 2022 రూపొందించింది. విద్యుత్ ఉత్పాదక సంస్థలు, ఇంటర్–స్టేట్ ట్రాన్స్ మిషన్ లైసెన్సీలు, ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ లైసెన్సీల బకాయిలకు ఈ నియమాలు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా డిస్కంలు చెల్లించాలి. లేదంటే విద్యుత్ క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తారు. ఈ నేపథ్యంలో ఎల్పీఎస్ పథకం కింద మే 30 వరకు బకాయిలన్నీ ఏపీ డిస్కంలు చెల్లిస్తున్నాయి. పథకం పరిధిలోకి వచ్చిన బకాయిలు రూ.17,074.90 కోట్లు కాగా ఈ మొత్తాన్నీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)ల ద్వారా 12 వాయిదాలలో చెల్లించేందుకు ఏపీ అంగీకరించింది. మొదటి విడతగా ఈ నెల 5న రూ.1,407 కోట్లను చెల్లించింది. రెండో విడత వాయిదా చెల్లించేందుకు సెప్టెంబర్ 5 వరకు గడువు ఉంది. నిరంతరాయంగా సరఫరా.. నిషేధం విధించే సమయానికి రాష్ట్రంలో డిమాండ్ 211.22 మిలియన్ యూనిట్లు ఉండగా ఆ మేరకు సరిపడా విద్యుత్‌ను ఎటువంటి అంతరాయాలు లేకుండా వినియోగదారులకు అందించారు. ఏపీ జెన్కో థర్మల్ నుంచి 55.94 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో హైడల్ నుంచి 23.46 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్ల నుంచి 44.07 మి.యూ, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి 21.20 మి.యూ, పవన విద్యుత్ 31.87 మి.యూ, సౌర విద్యుత్ 22.27 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరగా ఎనర్జీ ఎక్సేంజ్ ద్వారా 11.96 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.7.69 చొప్పున చెల్లించి రూ.9.52 కోట్లతో కొనుగోలు చేశారు. మన రాష్ట్రం నుంచి ఎక్సేంజ్‌లో 0.41 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించారు. శుక్రవారం 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసి ఆ మేరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. బిహార్‌లో 6.18 మి.యూ, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3.49 మి.యూ, జార్ఖండ్‌లో 2.06 మి.యూ, మధ్యప్రదేశ్‌లో 1.39 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడినప్పటికీ మన రాష్ట్రంలో ఎలాంటి లోటు లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపింది. యధావిధిగా ట్రేడింగ్ ‘‘ఏపీ డిస్కంలు విద్యుదుత్పత్తి దారులకు రూ.412.69 కోట్లు బకాయి ఉన్నట్లు ప్రాప్తి పోర్టల్‌లో పొరపాటుగా చూపడం వల్ల ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక అనుమతిని నియంత్రించింది. వాస్తవానికి ఈ బకాయిలను ఏపీ డిస్కంలు ఇప్పటికే చెల్లించాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి తెచ్చాం. అంతేకాకుండా కొన్ని బకాయిలు ఎల్పీసీ పథకం కింద ఇప్పటికే చెల్లించేశాం. అయినప్పటికీ బకాయిలున్నట్లు చూపడంపై పోర్టల్ అధికారులకు సమాచారం అందించాం. దీంతో యాక్సెస్ పరిమితిని తొలగించారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఏపీ డిస్కంలు ఎనర్జీ ఎక్సేంజీలో ట్రేడింగ్ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తున్నాయి’’ –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చదవండి: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
బిల్లులు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం దృష్ట్యా నిధుల కొరతతో సాగునీటి పథకాలకు పెండింగ్ బిల్లులను చెల్లించలేక ఆ శాఖ సతమతమవుతోంది. మరో వైపు ప్రధాన ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నందున బిల్లులు చెల్లించాల్సిందేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నీటి పారుదల శాఖపై ఒత్తిడి పెంచుతోంది. తమ ఆర్థిక నిర్వహణ, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తక్షణమే రూ.2,728 కోట్లు కట్టాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ బిల్లుల చెల్లింపు ఎలా చేయాలన్న దానిపై నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంటోంది. నిధులకు కటకట.. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ఎత్తిపోతల పథకాలైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి, అలీసాగర్, ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీల ద్వారా మోటార్లను నడిపి నీటిని తాగు, సాగు అవసరాలకు మళ్లిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్ సరఫరాను టీఎస్ఎస్పీడీసీఎల్ చేస్తోంది. వీటి బిల్లులను నీటి పారుదల శాఖ చెల్లించాల్సి ఉంటుంది.ఆర్థిక పరిస్థితి సరిగా లేక కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు సరిపడినన్ని నిధులు లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం కనిపించడమే లేదు. దీంతో మొత్తంగా ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,237.39 కోట్ల మేర బిల్లులు బకాయి పడింది.వీటిని తీర్చే మార్గాలే లేని దుస్థితిలో నీటిపారుదలశాఖ ఉంటే.. బకాయిలు కట్టాల్సిందేనని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ లేఖ రాసింది. బకాయిలు పెరిగాయి.. ‘ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల బకాయిలు గత ఆగస్టు 31 నాటికి రూ.2,728.73 కోట్లకు ఎగబాకాయి. దీర్ఘకాలికంగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతో టీఎస్ఎస్పీడీసీఎల్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఎస్ఎస్పీడీసీఎల్ వివిధ రకాల విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ బిల్లులు చెల్లించేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎత్తిపోతల పథకాల వంటి బల్క్ విద్యుత్ కొనుగోలుదారులు చెల్లించే బిల్లులపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ బిల్లులను నీటి పారుదల శాఖ 2019–20 బడ్జెట్ కేటాయింపుల నుంచి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కదిలిన నీటి పారుదల శాఖ ఈ బకాయిల చెల్లింపునకు వీలుగా ప్రతి నెలా కనిష్టంగా రూ.100 కోట్లయినా తమకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం బకాయిలు 2728,కల్వకుర్తి ఎత్తిపోతల బకాయిలు 1,433,ఎస్ఎల్బీసీ బకాయిలు 637 ,భీమా బకాయిలు 110 ,మిగిలిన బకాయిలు 548(అంకెలు రూ.కోట్లలో) -
పంచాయతీలకు బకాయిల షాక్!
శ్రీకాకుళం ,పాలకొండ రూరల్: పంచాయతీలకు బకాయిల షాక్ తగలనుంది. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుండటంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. నిధులు లేకపోవడంతో వీటిని ఎలా చెల్లించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 2016 నుంచి 2017 ఫిబ్రవరి వరకు సుమారు రూ.56 కోట్ల బకాయిలు పంచాయతీల నుంచి రావాల్సి ఉందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. వీటిపై పలు పంచాయతీలు అప్పట్లో కోర్టులను ఆశ్రయించగా కొంతమేర వెసులుబాటు ఇచ్చిన ఈపీడీసీఎల్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేసే పనిమిలో నిమగ్నమైంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 11 వందల పంచాయతీలకు సంబంధించి పెండింగ్ బకాయిలు రూ.4కోట్ల పైబడి ఉన్నాయి. ఈ బిల్లులను ఈ నెల 20వ తేదీలో చెల్లించాలని విద్యుత్ శాఖ పంచాయతీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తేల్చిచెప్పటంతో పంచాయతీ అధికారులు డైలమాలో పడ్డారు. పండగల సీజన్లో సరఫరా నిలిపివేస్తే పంచాయతీ వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని భావించి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో పంచాయతీ బిల్లులను ప్రభుత్వమే భరించేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాధారణ నిధులతోనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ భారం గ్రామ పంచాయతీలపై పడింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో వార్షిక ఆదాయం తగ్గిపోవటంతో బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీలకు ఒక్క మీటరే ఉండటం, వాడకం పెరిగిన కొద్దీ శ్లాబురేటు పెరగటంతో తెలియకుండానే భారం పెరిగిపోతోంది. వేధిస్తున్న నిధుల కొరత.. జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి నిధుల కొరత వేధిస్తోంది. ఉన్న నిధులు స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తుండగా తాజాగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో అటు పాలకవర్గాలు, కార్యదర్శులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంచాయతీలకు ఆదాయ వనరులుగా ఉన్న ఇంటిపన్నులు, ఆస్తిపన్నులు, కుళాయి పన్నులు గ్రామస్థాయిలో పేరుకుపోవంటతో పంచాయతీ ఆదాయానికి గండి పడింది. సీతంపేట సబ్‌డివిజన్ పరిధిలో.. ఒక్క సీతంపేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో 2017 ఫిబ్రవరికి ముందు ఉన్న బకాయిలిలా ఉన్నాయి.. పాలకొండలో రూ.68 లక్షల 48 వేలు, సీతంపేటలో రూ.142.44 లక్షలు, వీరఘట్టంలో రూ.150.03 లక్షలు, బూర్జలో రూ.28.61 లక్షలు, వంగరలో రూ.76.10 లక్షల వంతున మొత్తం రూ.4కోట్ల 65 లక్షల 66 వరకు బకాయిలు ఉన్నాయి. 2017 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ ఐదు మండలాలు చెల్లించాల్సిన బకాయిలు రూ.56 లక్షల 12వేలు. ఇప్పటివరకు వసూలైన మొత్తం కేవలం రూ.11 లక్షల 30 కావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది బకాయిల వసూలు ఒత్తిడి తెస్తున్నారు. మరోసారి సందేశాలు పంపిస్తున్నాం బకాయిల వసూలుకు కసరత్తు చేస్తున్నాం. జిల్లావ్యాప్తం గా దాదాపు నాలుగు కోట్లు వసూలుకు లక్ష్యాలు విధించుకున్నాం. 2017 ఫిబ్రవరి నుం చి ఆగస్టు వరకు ఉన్న బకా యిల్లో ఇప్పటికి సుమారు రూ.రెండు కోట్లు వసూలైంది. మిగిలిన మొత్తాలు చెల్లించేలా పంచాయతీలకు మరోసారి సందేశాలు పంపిస్తున్నాం. బకాయిలు చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తాం. – దత్తి సత్యనారాయణ, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ఎన్టీఆర్ సుజల స్రవంతికి పవర్ కట్
వినుకొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ గుంటూరు జిల్లాలో మూతపడింది. వినుకొండలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను గురువారం తెరవలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో వినుకొండ ఎలక్ట్రికల్ ఏఈ కరెంటు సరఫరా నిలిపివేయడంతో ప్లాంట్ మూసివేశారు. దీంతో మంచి నీరు దొరక్క స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ప్లాంట్‌కు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.