బిల్లులు కట్టాల్సిందే! | TSSPDCL Puts Pressure On Irrigation Department Over Debt | Sakshi
Sakshi News home page

బిల్లులు కట్టాల్సిందే!

Published Mon, Oct 21 2019 3:13 AM | Last Updated on Mon, Oct 21 2019 3:13 AM

TSSPDCL Puts Pressure On Irrigation Department Over Debt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం దృష్ట్యా నిధుల కొరతతో సాగునీటి పథకాలకు పెండింగ్‌ బిల్లులను చెల్లించలేక ఆ శాఖ సతమతమవుతోంది. మరో వైపు ప్రధాన ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నందున బిల్లులు చెల్లించాల్సిందేనని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) నీటి పారుదల శాఖపై ఒత్తిడి పెంచుతోంది. తమ ఆర్థిక నిర్వహణ, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా తక్షణమే రూ.2,728 కోట్లు కట్టాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ బిల్లుల చెల్లింపు ఎలా చేయాలన్న దానిపై నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంటోంది.

నిధులకు కటకట..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ఎత్తిపోతల పథకాలైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి, అలీసాగర్, ఏఎంఆర్‌ ఎస్‌ఎల్‌బీసీల ద్వారా మోటార్లను నడిపి నీటిని తాగు, సాగు అవసరాలకు మళ్లిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్‌ సరఫరాను టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చేస్తోంది. వీటి బిల్లులను నీటి పారుదల శాఖ చెల్లించాల్సి ఉంటుంది.ఆర్థిక పరిస్థితి సరిగా లేక కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు సరిపడినన్ని నిధులు లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవకాశం కనిపించడమే లేదు. దీంతో మొత్తంగా ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,237.39 కోట్ల మేర బిల్లులు బకాయి పడింది.వీటిని తీర్చే మార్గాలే లేని దుస్థితిలో నీటిపారుదలశాఖ ఉంటే.. బకాయిలు కట్టాల్సిందేనని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ లేఖ రాసింది.

బకాయిలు పెరిగాయి..
‘ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ బిల్లుల బకాయిలు గత ఆగస్టు 31 నాటికి రూ.2,728.73 కోట్లకు ఎగబాకాయి. దీర్ఘకాలికంగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ వివిధ రకాల విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ బిల్లులు చెల్లించేందుకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఎత్తిపోతల పథకాల వంటి బల్క్‌ విద్యుత్‌ కొనుగోలుదారులు చెల్లించే బిల్లులపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ బిల్లులను నీటి పారుదల శాఖ 2019–20 బడ్జెట్‌ కేటాయింపుల నుంచి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కదిలిన నీటి పారుదల శాఖ ఈ బకాయిల చెల్లింపునకు వీలుగా ప్రతి నెలా కనిష్టంగా రూ.100 కోట్లయినా తమకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

మొత్తం బకాయిలు 2728,కల్వకుర్తి ఎత్తిపోతల బకాయిలు 1,433,ఎస్‌ఎల్‌బీసీ బకాయిలు 637 ,భీమా బకాయిలు 110 ,మిగిలిన బకాయిలు 548(అంకెలు రూ.కోట్లలో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement