Irriagation department
-
'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. స్వల్పంగా విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్‌కుమార్ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు. మదనాపురం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది. శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,455, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
బిల్లులు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం దృష్ట్యా నిధుల కొరతతో సాగునీటి పథకాలకు పెండింగ్ బిల్లులను చెల్లించలేక ఆ శాఖ సతమతమవుతోంది. మరో వైపు ప్రధాన ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నందున బిల్లులు చెల్లించాల్సిందేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నీటి పారుదల శాఖపై ఒత్తిడి పెంచుతోంది. తమ ఆర్థిక నిర్వహణ, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తక్షణమే రూ.2,728 కోట్లు కట్టాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ బిల్లుల చెల్లింపు ఎలా చేయాలన్న దానిపై నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంటోంది. నిధులకు కటకట.. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ఎత్తిపోతల పథకాలైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి, అలీసాగర్, ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీల ద్వారా మోటార్లను నడిపి నీటిని తాగు, సాగు అవసరాలకు మళ్లిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్ సరఫరాను టీఎస్ఎస్పీడీసీఎల్ చేస్తోంది. వీటి బిల్లులను నీటి పారుదల శాఖ చెల్లించాల్సి ఉంటుంది.ఆర్థిక పరిస్థితి సరిగా లేక కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు సరిపడినన్ని నిధులు లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం కనిపించడమే లేదు. దీంతో మొత్తంగా ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,237.39 కోట్ల మేర బిల్లులు బకాయి పడింది.వీటిని తీర్చే మార్గాలే లేని దుస్థితిలో నీటిపారుదలశాఖ ఉంటే.. బకాయిలు కట్టాల్సిందేనని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ లేఖ రాసింది. బకాయిలు పెరిగాయి.. ‘ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల బకాయిలు గత ఆగస్టు 31 నాటికి రూ.2,728.73 కోట్లకు ఎగబాకాయి. దీర్ఘకాలికంగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతో టీఎస్ఎస్పీడీసీఎల్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఎస్ఎస్పీడీసీఎల్ వివిధ రకాల విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ బిల్లులు చెల్లించేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎత్తిపోతల పథకాల వంటి బల్క్ విద్యుత్ కొనుగోలుదారులు చెల్లించే బిల్లులపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ బిల్లులను నీటి పారుదల శాఖ 2019–20 బడ్జెట్ కేటాయింపుల నుంచి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కదిలిన నీటి పారుదల శాఖ ఈ బకాయిల చెల్లింపునకు వీలుగా ప్రతి నెలా కనిష్టంగా రూ.100 కోట్లయినా తమకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం బకాయిలు 2728,కల్వకుర్తి ఎత్తిపోతల బకాయిలు 1,433,ఎస్ఎల్బీసీ బకాయిలు 637 ,భీమా బకాయిలు 110 ,మిగిలిన బకాయిలు 548(అంకెలు రూ.కోట్లలో) -
ఇరిగేషన్ శాఖలో ‘హై అలర్ట్’
- మంత్రి హరీశ్ ప్రత్యేక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హైఅలర్ట్ ప్రకటించారు. అధికారులంతా అప్రమత్తం గా ఉండాలని ఆదివారం ప్రత్యేక ఆదేశాలిచ్చారు. సీఈలు, ఎస్ఈలు అంతా ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నీటి ప్రవాహ ఉధృతిని ఎప్పటికప్పుడు వాట్సప్ గ్రూపుల్లో అప్డేట్ చేయాలని, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసు కుంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుతున్నాయని, పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నా అధికారులు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎల్లంపల్లి, జూరాల ప్రాజెక్టుల్లో వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉందని, సీనియర్ అధికారులంతా అందుబాటులో ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. -
‘పెన్నా’ కబ్జా
విడవలూరు : మండల పరిధిలోని పెన్నాతీరం ఆక్రమణలకు గురవుతోంది. వందలాది ఎకరాలు ఆక్రమించి ఆక్వా సాగుకు గుంతలు సిద్ధం చేసున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని ఊటుకూరు పల్లెపాళెం వద్ద పెన్నానది నీటి ప్రవాహం కలుస్తుంది. ఈ ప్రాంతం ఆక్వా సాగుకు అనుకూలంగా ఉండటంతో కబ్జాదారుల కన్ను పెన్నా తీరంపై పడింది. యథేచ్ఛగా పెన్నానది, పెన్నాపోర్లుకట్టలను దర్జాగా దున్నేసి ఆక్వా సాగుకు గుంతలను మార్చేసుకుంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలను కబ్జా చేసేశారు. దీంతో పెన్నానది పూర్తిగా కుంచించుకుపోయి రూపురేఖలు మారిపోయింది. ఈ పరిస్థితితో భారీ వర్షాలు పడే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలోకి కాకుండా సమీపంలోని కాలనీని ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఆక్వా గుంతల్లోని వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు కొందరు దర్జాగా యంత్రాలను వినియోగించి కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిద్రలో రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖలు : పెన్నానదిలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఏం మాత్రం పట్టించుకోవడంలేదు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వందల ఎకరాలను కబ్జాలు చేసి అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేయడం పట్ల సంబంధిత శాఖ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మా దృష్టికి రాలేదు : పెన్నా తీరం వెంబడి కబ్జా జరిగిన విషయం మా దృష్టికి రాలేదు. పెన్నా తీరాన్ని కబ్జా చేసి ఆక్వాసాగు చేస్తోంటే పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. - బషీర్, తహశీల్దార్ అనుమతులు లేవు: పెన్నానది సమీపంలో సాగు చేస్తున్న ఆక్వా గుంతలకు తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతుల లేవు. ఇలా అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో సాగు చేస్తున్న ఆక్వా గుంతలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా త్వరలోనే నోటీస్‌లను జారీ చేస్తాం. -చాన్‌బాషా, మత్స్యశాఖ అధికారి