విడవలూరు : మండల పరిధిలోని పెన్నాతీరం ఆక్రమణలకు గురవుతోంది. వందలాది ఎకరాలు ఆక్రమించి ఆక్వా సాగుకు గుంతలు సిద్ధం చేసున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని ఊటుకూరు పల్లెపాళెం వద్ద పెన్నానది నీటి ప్రవాహం కలుస్తుంది. ఈ ప్రాంతం ఆక్వా సాగుకు అనుకూలంగా ఉండటంతో కబ్జాదారుల కన్ను పెన్నా తీరంపై పడింది. యథేచ్ఛగా పెన్నానది, పెన్నాపోర్లుకట్టలను దర్జాగా దున్నేసి ఆక్వా సాగుకు గుంతలను మార్చేసుకుంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలను కబ్జా చేసేశారు.
దీంతో పెన్నానది పూర్తిగా కుంచించుకుపోయి రూపురేఖలు మారిపోయింది. ఈ పరిస్థితితో భారీ వర్షాలు పడే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలోకి కాకుండా సమీపంలోని కాలనీని ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఆక్వా గుంతల్లోని వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు కొందరు దర్జాగా యంత్రాలను వినియోగించి కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
నిద్రలో రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖలు :
పెన్నానదిలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఏం మాత్రం పట్టించుకోవడంలేదు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వందల ఎకరాలను కబ్జాలు చేసి అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేయడం పట్ల సంబంధిత శాఖ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మా దృష్టికి రాలేదు :
పెన్నా తీరం వెంబడి కబ్జా జరిగిన విషయం మా దృష్టికి రాలేదు. పెన్నా తీరాన్ని కబ్జా చేసి ఆక్వాసాగు చేస్తోంటే పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
- బషీర్, తహశీల్దార్
అనుమతులు లేవు:
పెన్నానది సమీపంలో సాగు చేస్తున్న ఆక్వా గుంతలకు తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతుల లేవు. ఇలా అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో సాగు చేస్తున్న ఆక్వా గుంతలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా త్వరలోనే నోటీస్‌లను జారీ చేస్తాం.
-చాన్‌బాషా, మత్స్యశాఖ అధికారి
‘పెన్నా’ కబ్జా
Published Fri, Jul 10 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement