
విద్యుత్ సంస్కరణల పథకంలో చేరికపై స్పష్టతనిచ్చిన
ఉప ముఖ్యమంత్రి.. విద్యుత్‌పై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్‌ఎస్)లో రాష్ట్రం చేరనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం రాత్రి ప్రజాభవన్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలను, సాధించిన పురోగతిని వివరించారు.
కేంద్రం 2021 ఆగస్టు 17న ప్రవేశపెట్టిన ఆర్డీఎస్‌ఎస్ పథకంలో రాష్ట్రం చేరినా, కేంద్రం పెట్టే షరతుల్లో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే ప్రసక్తే లేదన్నారు. రామగుండంలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. గతంలో తాము పేర్కొన్నట్టు ఇందులో సింగరేణి సంస్థ భాగస్వామ్యం ఉండదన్నారు. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని, రాష్ట్రం 21,398 మెగావాట్ల గరిష్ట విద్యుత్ సరఫరా సామరŠాధ్యన్ని కలిగి ఉండడంతో ఇబ్బంది ఉండదన్నారు.
రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 2030 నాటికి 24 వేల మెగావాట్లు, 2035 నాటికి 31,809 మెగావాట్లకు పెరగనుందని అంచనా వేశామని చెప్పారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకుగాను ఇటీవల న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించామన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీల కింద గతేడాది డిస్కంలకు 18,615 కోట్లను చెల్లించినట్టు భట్టి వెల్లడించారు.