సాగు 'పవర్' తగ్గింది! | Demand for electricity is significantly reduced. | Sakshi
Sakshi News home page

సాగు 'పవర్' తగ్గింది!

Published Mon, May 2 2016 2:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాగు 'పవర్' తగ్గింది! - Sakshi

సాగు 'పవర్' తగ్గింది!

కుప్పకూలిన వ్యవసాయ రంగం.. దారుణంగా పడిపోయిన విద్యుత్ డిమాండ్
ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ అంచనా.. 170- 180 (మిలియన్ యూనిట్లు)
వాస్తవ డిమాండ్.. 130- 150 (మిలియన్ యూనిట్లు)
గతేడాది కంటే ఈ వేసవిలో తగ్గిపోయిన వినియోగం
సాగుకు 9 గంటల కరెంటిచ్చినా పిసరంతైనా పెరగని డిమాండ్
రబీని తుడిచిపెట్టేసిన కరువు.. గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం

 
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి.. బయట సంగతి దేవుడెరుగు ఇంట్లో ఉన్నా ముచ్చెమటలు కక్కిస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు.. తదితరాల వినియోగం అమాంతం పెరుగుతుంది.. విద్యుత్ వినియోగం పతాకస్థాయికి చేరుతుంది.. కానీ ఈసారి అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ గత వేసవి కన్నా బాగా పడిపోయింది..!! ఎందుకు?? రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలడమే ఇందుకు కారణం! కరువు కరాళనృత్యానికి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. ఒకప్పుడు కనుచూపు మేర పచ్చని పంటపొలాలతో కనిపించిన ప్రాంతాలన్నీ ఇప్పుడు ఎడారులను తలపిస్తున్నాయి. దీంతో సాగుకు అసలు కరెంటు అవసరమే లేకుండా పోయింది.

ఫలితంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. వాస్తవానికి ఈ వేసవిలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 170-180 మిలియన్ యూనిట్లు (ఎం.యు.) ఉంటుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఒక్క మార్చిలోనే 172.78 ఎం.యు.ల డిమాండ్ ఉంటుందని ప్రభుత్వానికి నివేదించింది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు గత నెల 5న నమోదైన 155.1 ఎం.యు. డిమాండే ఈ వేసవిలో అత్యధికం కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌లో విద్యుత్ డిమాండ్ కేవలం 132-155 ఎం.యు.లకే పరిమితమైంది. ఏప్రిల్ 30న అయితే అత్యల్పంగా 132 ఎంయూలకు డిమాండ్ పడిపోయింది. ఇప్పటిదాకా ఈ వేసవిలో 14 రోజులు మాత్రమే విద్యుత్ డిమాండ్  150 ఎంయూల మార్క్‌ను చేరుకోవడం గమనార్హం.
 
సాగుకు 9 గంటల విద్యుత్ ఇచ్చినా..
రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌లో 25-30 శాతాన్ని వ్యవసాయ రంగమే వినియోగించుకుంటోంది. ఖరీఫ్, రబీలలో ఇది 40 శాతం వరకు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో వ్యవసాయానికి రోజూ సుమారు 50-60 ఎంయూల డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పాతానికి దిగజారిపోయాయి. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద ఏటా రెండు కార్లు పండించే అన్నదాతలు గత రబీలో పంటలు వేసే సాహసం చేయలేదు. అక్కడక్కడ వేసినా ఎండిపోయాయి. దీంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ విద్యుత్ సరఫరాను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచినట్లు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకున్నా... విద్యుత్ డిమాండ్ పిసరంత  కూడా పెరగకపోవడం సాగు సంక్షోభానికి అద్దంపడుతోంది.
 
గత వేసవి కన్నా తక్కువగా..
ఏటా కనీసం 8 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ దీనికి విరుద్ధంగా డిమాండ్ పెరగకపోగా తగ్గిపోయింది. ఈ వేసవిలో అత్యధిక డిమాండ్ 155 ఎంయూలకు పరిమితం కాగా.. 2015 వేసవిలో అత్యధికంగా మార్చి 26న 157.89 ఎంయూ, మార్చి 28న 156.67 ఎంయూల డిమాండ్ నమోదైంది.
 
వ్యవసాయం లేని ‘గ్రేటర్’లోనే డిమాండ్
రాష్ట్రంలో మూడో వంతు విద్యుత్ వినియోగం వ్యవసాయం లేని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే జరుగుతోంది. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 130-150 ఎంయూలు ఉండగా.. అందులో 48-56 ఎంయూలు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు వినియోగిస్తున్నారు. మిగిలిన 9 జిల్లాల్లో డిమాండ్ 80-90 ఎంయూ మధ్య ఉంటోంది.
 
రబీపై కరువు పంజా..
కరువు నేపథ్యంలో రాష్ట్రంలో సాగురంగం కోలుకోలేని విధంగా కుప్పకూలిందని వ్యవసాయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. రెండేళ్లుగా రబీ పంటల సాగు విస్తీర్ణం ప్రమాదకర రీతిలో పడిపోవడమే ఇందుకు నిదర్శనం. బోరుబావుల కింద సాగు చేసే వరి పంట విస్తీర్ణం మరింత తగ్గిపోయింది. రబీలో ప్రధానంగా జలాశయాలు, బోర్లు, బావుల కిందే పంటలు వేస్తారు. జలాశయాల్లో నీళ్లు అడుగంటడం, భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడంతో పరిస్థితి తలకిందులైంది. ఇతర పంటల కంటే వరి పరిస్థితి దారుణంగా మారింది. 2014-15 రబీలో సాగు విస్తీర్ణం 77 శాతానికి పడిపోయింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 32.72 లక్షల ఎకరాలు కాగా కేవలం 25.15 లక్షల ఎకరాల్లోనే పంటలు (77%) వేశారు. ఇందులో 4.25 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి. 26.02 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. కేవలం 19.62 లక్షల ఎకరాలకే (75%) పరిమితమైంది. వరి కేవలం 66 శాతమే సాగైంది.
 
ఈసారి మరీ దారుణం..
2015-16 రబీలో పరిస్థితులు మరింత దిగజారి కేవలం 57 శాతం పంటలే సాగ య్యాయి. సాధారణ సాగు విస్తీర్ణం 31.32 లక్షల ఎకరాలు కాగా... కేవలం 17.87 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో 5.10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వరి సాధారణ విస్తీర్ణం 16.12 లక్షల ఎకరాలు కాగా.. 6.3 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లో 1.07 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా.. 2014-15 ఖరీఫ్, రబీ సీజన్‌లో కేవలం 68.63 లక్షల టన్నుల ఆహార ధాన్యాలే ఉత్పత్తి  అయ్యాయి. అంతే ఏకంగా 38.37 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు తగ్గాయి. అందులో బియ్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2013-14లో బియ్యం ఉత్పత్తి 66.22 లక్షల టన్నులు కాగా.. 2014-15లో 43.22 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2015-16 ఖరీఫ్, రబీల్లో 49.35 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement