తలసరి ‘విద్యుత్‌’లో తెలంగాణకు ఐదో స్థానం.. | Telangana 5th Position In Capita Electricity 2012 Units Per Head | Sakshi
Sakshi News home page

Telangana: తలసరి ‘విద్యుత్‌’లో 5వ స్థానం.. ఒక్కొక్కరు  సగటున 2,012 యూనిట్ల వాడకం

Feb 20 2023 7:52 AM | Updated on Feb 20 2023 3:21 PM

Telangana 5th Position In Capita Electricity 2012 Units Per Head - Sakshi

తలసరి వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రమే టాప్‌.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2020–21 నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వార్షిక తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 3,137 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 2,200 యూనిట్లతో పంజాబ్, 2,131 యూనిట్లతో హరియాణా, 2,048 యూనిట్లతో గుజరాత్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో తలసరి విద్యుత్‌ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది. 2019–20లో భారతదేశ తలసరి విద్యుత్‌ వినియోగం 1,208 యూనిట్లుకాగా.. 2020–21లో 1,161 యూనిట్లకు తగ్గిపోయింది. 2020–21 సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజాగా విడుదల చేసిన ‘అఖిల భారత విద్యుత్‌ గణాంకాలు–2022’నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే.. 10,478 యూనిట్ల తలసరి విద్యుత్‌ వినియోగంతో దాద్రానగర్‌ హవేలీ తొలిస్థానంలో, 5,473 యూనిట్లతో డామన్‌ డయ్యూ రెండో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. 

కరెంటు మరణాలు ఎక్కువ 
విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలన్నింటిలోనూ కలిపి విద్యుత్‌ ప్రమాదాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2020–21లో రాష్ట్రంలో 4,676 ప్రమాదాలు చోటుచేసుకోగా, కర్ణాటకలో 2,935, రాజస్థాన్‌లో 2,726 ప్రమాదాలు జరి­గా­యి. ఇక రాష్ట్రంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదాల్లో 1,241 మంది మృతిచెందగా.. 219 మంది  క్షతగాత్రులయ్యారు. 1,062 మరణాలతో మధ్యప్రదేశ్, 1,038 మరణాలతో మహారాష్ట్ర రెండు, మూ­డో స్థానాల్లో నిలిచాయి. విద్యుత్‌ ప్రమాదాలతో దేశంలో మొత్తంగా 9,021 మంది ప్రాణాలు కో­ల్పోగా, 3,750 మంది క్షతగాత్రులయ్యారు. 

వి­ద్యు­త్‌ ప్రమాదాల్లో మృతిచెందిన పశువుల సంఖ్య తెలంగాణలో (2,876 పశువులు) ఎక్కువగా ఉంది. మొ­త్తం ప్రమాదాల సంఖ్యలో మనుషులు, పశువు­ల మరణాలు/గాయాలు పాలైన ఘటనలు ఉన్నాయి.

వ్యవసాయ విద్యుత్‌లో టాప్‌ 
రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్‌ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్‌ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 
గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా.. 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. 
వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో.. 128.81 యూనిట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. 
హెచ్‌టీ కేటగిరీ కింద పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంలో 1,163.99 యూనిట్లతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా.. తెలంగాణ 299.19 యూనిట్లతో పదో స్థానంలో ఉంది.
చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement