వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించక తప్పేటట్లు లేదు. ఎలాగైనా విద్యుత్ సంస్కరణలను అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మేరకు ఒత్తిడి తెస్తోంది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు, డిస్కమ్‌లకు కేంద్ర విద్యుత్ కార్పొరేషన్ల నుంచి ప్రతినెలా అందుతున్న రుణాలను తాజాగా నిలిపివేసింది. యథావిధిగా ఈ రుణాలు పొందాలంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని, విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి తేల్చిచెప్పింది. ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే... రైతు వినియోగించిన విద్యుత్తుకు (బిల్లుకు) సమానమైన నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చని కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు– 2020 చెబుతోంది.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగిం చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి పెంచింది. వ్యవ సాయంతో సహా అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అంగీకారం తెలపాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఒత్తిడిని తీవ్రం చేసింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలను గట్టెక్కిం చేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో భారీ ఎత్తున సంస్కరణల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గతేడాది విద్యుత్ సవరణ బిల్లు–2020ను ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీలను అనుమతించడం, వినియోగదారులకు నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా విద్యుత్ రాయితీలు అందించడం, ప్రతి వినియోగదారుడికి విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేయడం, పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులను పెంచడం వంటి సంస్కరణలను ఈ బిల్లు ద్వారా కేంద్రం ప్రతిపాదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును రాష్ట్రంలో అమలు చేయబోమని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ సైతం రాశారు.
మీటర్లతో రుణాలకు మెలిక..
ఈ బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిపిన కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనిని చట్టసభల్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు ఈ బిల్లు అమలు కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే పలు ప్రాజెక్టులకు, డిస్కమ్‌లకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)ల నుంచి ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలు ఆపేసింది. రుణాల చెల్లింపులను పునరుద్ధరించడానికి విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సైతం మీటర్లు ఏర్పాటు చేయాలన్న షరతులను అంగీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కోరినట్టు రాష్ట్ర విద్యుత్ సంస్థల అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
మీటర్ లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదని, ఈ మీటర్లు స్మార్ట్ ప్రీపెయిడ్ అయి ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు ఏవైనా మినహాయింపులు అవసరమైతే తప్పనిసరిగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సరైన కారణాలు తెలిపి అనుమతి పొందాలని ఈ నిబంధనల్లో పొందుపర్చింది. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించక తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి మీటర్లు బిగించడానికి కానున్న వ్యయాన్ని తామే భరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
నగదు బదిలీకి మీటర్ తప్పనిసరి..
ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అవుతున్న ఖర్చును ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీల రూపంలో అందిస్తోంది. వ్యవసాయ విద్యుత్ రాయితీలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు రూ.10 వేల కోట్ల రాయితీలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2020 అమల్లోకి వస్తే నేరుగా ప్రభుత్వం డిస్కంలకు విద్యుత్ రాయితీలు ఇవ్వడానికి వీలు ఉండదు. భవిష్యత్తులో వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి... వారి నుంచి ముందస్తుగా బిల్లులు వసూలు చేయాలని కేంద్రం కోరుతోంది.
ఎంత మొత్తం డబ్బుకు రీచార్జి చేసుకుంటే అంతకు సరిపడా విద్యుత్ సరఫరా అవుతుందన్న మాట. వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న రాయితీలను నేరుగా వారికి నగదు బదిలీ రూపంలో చెల్లించాలని విద్యుత్ బిల్లులో కేంద్రం పేర్కొంది. బిల్లు రాకకు ముందే వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయవచ్చని కేంద్రం ఈ నిబంధనను సమర్థించుకుంటోంది. ఉచిత విద్యుత్ వినియోగించే రైతులు... ఎవరు ఎంత విద్యుత్ వినియోగించారో తెలుసుకుని బిల్లులు వేయాలంటే తప్పనిసరిగా ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు మీటర్‌ను బిగించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అప్పుడే విద్యుత్ బిల్లులోని నిబంధనల ప్రకారం సంబంధిత రైతుల ఖాతాలకు ప్రభుత్వం రాయితీలు బదిలీ చేయడానికి అవకాశం కలగనుంది.
వినియోగం లెక్కలు తేలాలని..
ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌లో 30 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దేనని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి శాస్త్రీయత లేదు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు వ్యవసాయ ఫీడర్లకు సైతం మీటర్లు లేకపోవడంతో వాస్తవానికి వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు ట్రాన్స్‌మిషన్ నష్టాలు, వాణిజ్యపర నష్టాల (ఏటీ అండ్‌సీ)ను తగ్గించి చూపడానికి డిస్కంలు వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ గణాంకాలను అడ్డగోలుగా పెంచేసి చూపుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి ఏటా రూ.వందలు, వేల కోట్ల నష్టాలను వ్యవసాయ విద్యుత్ ఖాతాలో వేసేస్తున్నాయని విమర్శలున్నాయి. ఈ అడ్డగోలు లెక్కలకు అంతం పలకానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు మీటర్‌ను బిగించి... 100 శాతం నెట్ మీటరింగ్ సాధించాలని చాలా కాలంగా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తోంది. తాజాగా గత కొన్నిరోజులుగా ఈ ఒత్తిడి మరింత తీవ్రమైందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment