మోటార్లు.. మీటర్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మున్ముందు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేస్తుందా..? అత్యధికంగా భూగర్భ జలాల వినియోగంపై ఆధారపడిన జిల్లా రైతుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నల్లగొండది రెండోస్థానం. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగంలో 40శాతం వాటా వ్యవసాయ రంగానిదే. ఇక్కడ 3,11,132 విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయి. అంటే, జిల్లా రైతాంగం ఎంతగా విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టును మినహాయిస్తే, పెద్దగా ఇరిగేషన్ సౌకర్యం లేదు. ఈ కారణంగానే బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఏ రకంగా చూసినా, జిల్లా రైతులసాగు పూర్తిగా విద్యుత్‌తో ముడిపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళనకు కారణమవుతోంది. రాజాపేట మండలం రఘునాథపురంలో ఎనిమిది మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వివాదాస్పదమవుతోంది. వర్షాభావ పరిస్థిలకు తోడు విద్యుత్ కోతలు ఇప్పటికే రైతులను వేధిస్తున్నాయి. లోఓల్టేజీ సమస్య సరేసరి. జిల్లాకు కేటాయించింది రోజుకు 17.62మిలియన్ యూనిట్లు కాగా, సోమవారం ఒక్క రోజే 18.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడేశారు. కాగా, వ్యవసాయ పంపుసెట్లపై ఆధారపడి వేసిన మెట్ట పంటలు చేతికి వస్తాయా..? రావా అన్న ఆందోళనా ఉంది. ఇదే తరుణంలో విద్యుత్ అధికారులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెబుతున్న ఉచిత విద్యుత్‌కు అర్థం ఏం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న రైతులు 3,06,588 మంది. కాగా, ఇదే కేటగిరీలో బిల్లులు చెలిస్తున్న రైతులు మరో 4,544 మంది ఉన్నారు. గత ఏడాది ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద రూ.290.78కోట్లు వెచ్చించారు. ఇంతగా ఉచిత విద్యుత్‌పై ఆధారపడిన రైతుల గురించి ఆలోచించకుండా ప్రయోగాత్మకంగానైనా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం విమర్శలపాలైంది. కాగా, ఇరవై నాలుగు గంటల ఫీడర్‌పై కనెక్షన్లుండి, ఎక్కువగా వినియోగిస్తున్నందునే మీట ర్ల బిగించామని విద్యుత్ అధికారులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకే పరిమితం అవుతుందా..? మెల్లమెల్లగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ విస్తరిస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
బిల్లులు చెల్లించాల్సిందే ..!
రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన గంగ లింగయ్య, టి.నర్సింహ, జి.నరహరి, శ్రీరాంరెడ్డి తదితర 8 మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు ఇటీవల ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ మీటర్లు బిగించారు. వీరిలో రైతుల్లో చాలా మంది పశుగ్రాసం వేశారు. మీటర్లు ఎక్కువ విద్యుత్ వినియోగించినట్లు నమోదు చేశాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని.. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తామంటే ఉచిత విద్యుత్ అన్న పదానికి అర్థం ఎక్కడని వీరు ప్రశ్నిస్తున్నారు.