power usage
-
ఏపీలో ఆల్‌టైం హై విద్యుత్ వినియోగం!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైం హై రికార్డును తాకింది. ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలోనే వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు అంచనాకి వచ్చారు. గడిచిన మూడు రోజుల్లో కరెంట్‌ను ప్రజలు విపరీతంగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బుధవారం 253 మిలియన్ యూనిట్లు, గురువారం 259 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ రోజు రికార్డుస్ధాయిలో 260 మిలియన్ యానిట్ల దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ 219 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక గత ఎనిమిదేళ్లలో మే నెలలో రికార్డు స్ధాయి విద్యుత్ వినియోగం ఇదే కావడం మరో విశేషం. ఎన్నడూ లేని విధంగా 13231 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కంటే 26 శాతం అధికంగా విద్యుత్ డిమాండ్ నెలకొనడం ఇంకో విశేషం. ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తగడిచిన మూడు రోజులుగా ఏపీలో కరెంట్ కాలుతోంది. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. డిమాండ్ పీక్‌లో ఉన్న టైంలోనూ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కారణంగా యూనిట్ విద్యుత్ రూ.7లకే కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.15 కోట్లతో 22 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తోంది ఏపీ విద్యుత్ శాఖ. -
పెరిగిపోతున్న సామర్ధ్యం.. 9.3 గిగా వాట్లకు రూఫ్‌టాప్ సోలార్
న్యూఢిల్లీ: దేశంలో రూఫ్‌టాప్ సోలార్ (పై కప్పులపై సోలార్ విద్యుదుత్పాదన) సామర్థ్యం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.35 శాతం పెరిగింది. మొదటి మూడు నెలల్లో 485 మెగావాట్ల సామర్థ్యం మేర సోలార్ రూఫ్టాఫ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నట్టు మెర్కామ్ ఇండియా తెలిపింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇలా ఏర్పాటైన సామర్థ్యం 456 మెగావాట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2023 మార్చి నాటికి భారత్‌లో మొత్తం రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 9.3 గిగావాట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. 2022 చివరి మూడు నెలల్లో ఏర్పాటైన 483 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంతో పోలిస్తే 0.4 శాతం మేర ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు వివరించింది. ఈ మేరకు ‘క్యూ1, 2023 మెర్కామ్ ఇండియా రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 2023 జనవరి – మార్చి త్రైమాసికంలో ఏర్పాటైన మొత్తం 485 మెగావాట్లలో 58 శాతం గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నదే కావడం గమనార్హం. పరిశ్రమలపై 28 శాతం, వాణిజ్య వినియోగదారులు ఏర్పాటు చేసుకున్న సామర్థ్యం 14 శాతం చొప్పున ఉంది. దేశంలో మొత్తం సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో రూఫ్‌టాప్ సోలార్ వాటా 26 శాతానికి చేరుకుంది. 2022లో హెచ్చు తగ్గులను చూసిన తర్వాత రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విషయంలో స్థిరమైన పురోగతి కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘విద్యుత్ రేట్లు పెరుగుతుండడంతో రూఫ్‌టాప్ సోలార్ ఆకర్షణీయంగా మారుతోంది. రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుంది’’ మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఏర్పాటైన రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యంలో 70 శాతం వాటా ఆక్రమించాయి. ఇందులో గుజరాత్ వాటా అత్యధికంగా 24 శాతం మేర ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి. -
తలసరి ‘విద్యుత్’లో తెలంగాణకు ఐదో స్థానం..
సాక్షి, హైదరాబాద్: వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 3,137 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 2,200 యూనిట్లతో పంజాబ్, 2,131 యూనిట్లతో హరియాణా, 2,048 యూనిట్లతో గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది. 2019–20లో భారతదేశ తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లుకాగా.. 2020–21లో 1,161 యూనిట్లకు తగ్గిపోయింది. 2020–21 సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజాగా విడుదల చేసిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే.. 10,478 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దాద్రానగర్ హవేలీ తొలిస్థానంలో, 5,473 యూనిట్లతో డామన్ డయ్యూ రెండో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. కరెంటు మరణాలు ఎక్కువ విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలన్నింటిలోనూ కలిపి విద్యుత్ ప్రమాదాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2020–21లో రాష్ట్రంలో 4,676 ప్రమాదాలు చోటుచేసుకోగా, కర్ణాటకలో 2,935, రాజస్థాన్‌లో 2,726 ప్రమాదాలు జరిగాయి. ఇక రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 1,241 మంది మృతిచెందగా.. 219 మంది క్షతగాత్రులయ్యారు. 1,062 మరణాలతో మధ్యప్రదేశ్, 1,038 మరణాలతో మహారాష్ట్ర రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. విద్యుత్ ప్రమాదాలతో దేశంలో మొత్తంగా 9,021 మంది ప్రాణాలు కోల్పోగా, 3,750 మంది క్షతగాత్రులయ్యారు. విద్యుత్ ప్రమాదాల్లో మృతిచెందిన పశువుల సంఖ్య తెలంగాణలో (2,876 పశువులు) ఎక్కువగా ఉంది. మొత్తం ప్రమాదాల సంఖ్యలో మనుషులు, పశువుల మరణాలు/గాయాలు పాలైన ఘటనలు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్‌లో టాప్ ► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ► గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా.. 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ► వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో.. 128.81 యూనిట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. ► హెచ్‌టీ కేటగిరీ కింద పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో 1,163.99 యూనిట్లతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా.. తెలంగాణ 299.19 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం -
భారత్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు టెస్ల పవర్ యూఎస్ఏ వెల్లడించింది. పవర్ యాజ్ ఏ సర్వీస్ (పాస్) కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు సంస్థ చైర్మన్ జాన్ హెచ్ రట్సినస్ తెలిపారు. భారత్‌లో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీ వినియోగదారులకు బ్యాటరీలు, విద్యుత్ స్టోరేజీ సొల్యూషన్స్ అందించేందుకు ’పాస్’ విధానం ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ’మిషన్ 1,000’ కార్యాచరణ ప్రణాళికను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2022–23లో రూ. 1,000 కోట్ల టర్నోవరు, 1,000 క్లయింట్లు, అదే స్థాయిలో ఎక్స్‌క్లూజివ్ టెస్లా షాప్స్ (సేల్స్, సర్వీస్ సెంటర్లు) ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు టెస్లా పవర్ యూఎస్ఏ ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు. -
సిటీ హీట్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండుతున్నాయి. తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. నగరంలో శుక్రవారం 42డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా శివారులోని శామీర్‌పేట, కీసరలలో 43.9, ఘట్కేసర్లో 43.4, మేడ్చల్‌లో 43.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక సిటీ పరిధిలో అత్యధికంగా బహదూర్‌పురాలో 42.8, సైదాబాద్‌లో 42.3, బండ్లగూడలో 42.2, ఖైరతాబాద్‌లో 42.1, ముషీరాబాద్‌లో 41.9, అమీర్‌పేట్‌లో 41.8, సరూర్‌నగర్‌లో 41.7, హిమాయత్‌నగర్‌లో 41.4, ఉప్పల్‌లో 41.4, శేరిలింగంపల్లిలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ సీజన్లో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా... సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 2010 మే 12న 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 2018 మే 2న 42.5, 2017 మే 25న 43.2, 2016 మే 1న 42.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా నగరంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 3,102 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది. డిస్కం చరిత్రలో ఇదే అత్యధికం. 2018 మే 30న 2,958 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. అధిక విద్యుత్ వినియోగంతో పలు ఫీడర్లు ట్రిప్ అవుతున్నా.. 5–10 నిమిషాల్లో సరఫరా పునరుద్ధరిస్తున్నామని డిస్కం అధికారులు తెలిపారు. -
ఆపరేషన్ విద్యుత్!
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది ఎండలు ఫిబ్రవరి రెండోవారం నుంచే మండు వేసవిని తలపించాయి. మార్చి, ఏప్రిల్ నెలలో మరింత ముదిరే అవకాశం ఉంది. ఎండల వేడి, ఉక్కపోతను తట్టుకునేందుకు సిటీజన్లు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో విద్యుత్ కూడా అధికంగా పెరగడం ఖాయం. వేసవిలో రోజురోజుకూ పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గ్రేటర్‌లోని సబ్స్టేషన్లు, ఫీడర్లపై భారం పడకుండా ఉండేందుకు శివారు ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల పునరుద్ధరణపై దృష్టి సారించింది. ఔటర్‌కు రెండు వైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు ఊపందుకోవడం, కొత్త వాణిజ్య సంస్థలు వెలుస్తుండటంతో గ్రేటర్ పరిధి శరవేగంగా విస్తరిస్తోంది. కోర్ సిటీలోని సబ్స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించేందుకు శివార్లలోని సబ్స్టేషన్ల నుంచి సరఫరా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తుగా ఆయా ప్రాంతాల్లోని లైన్లను ఆధునికీకరించాలని భావించింది. ఇందుకోసం ట్రాన్స్మిషన్డిష్ట్రిబ్యూషన్ స్కీం నిధుల నుంచి రూ.228 కోట్లతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా 12 సబ్స్టేషన్లు (33/11కేవీ), 62 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 188 కిలో మీటర్ల 11 కేవీ లైన్లు, 29 పవర్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీని పెంచాలని విద్యుత్‌శాఖ అధికారులు నిర్ణయించి ఆయా ప్రాంతాల్లో పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతుండటం, త్వరలోనే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే మరోవైపు ఈ పనులు పూర్తి చేస్తుండటం గమనార్హం. రోజుకో ‘ఎంయూ’ చొప్పున పైపైకి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది విద్యుత్ సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 54.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 44.60 లక్షల గృహ, 6.95 వాణిజ్య, 41,807 పారిశ్రామిక, 7,321 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్ ప్రజల సగటు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ధనవంతుల నివాసాల్లో మాత్రమే కనిపించే ఏసీలు, రిఫిజ్రిరేటర్లు, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, హీటర్లు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారం వరకు చలి ఉండటం వల్ల ఏసీ, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెద్దగా లేదు. తర్వాత పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పాటు ఉక్కపోత వల్ల ఫ్యాన్లు, ఏసీల వాడకం కూడా పెరిగి.. ఆమేరకు విద్యుత్ వినియోగం రెట్టింపయింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు రోజువారి సగటు విద్యుత్ వినియోగం 42 మిలియన్ యూనిట్(ఎంయూ) దాటలేదు. తర్వాత వాతావరణంలో మార్పుల వల్ల రోజుకో మిలియన్ యూనిట్ చొప్పున ప్రస్తుతం రోజువారి సగటు విద్యుత్ వినియోగం 55 మిలియన్ యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. 68 ఎంయూలకు చేరవచ్చు గతేడాది మే 30న మధ్యాహ్నం 3.42 గంటలకు గ్రేటర్లో అత్యధికంగా 62.83 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. దాంతో పోలిస్తే ప్రస్తుతం వినియోగంతో పాటు కొత్త కనెక్షన్ల సంఖ్య 20 శాతం పెరిగాయి. త్వరలో ఈ వినియోగం 65 నుంచి 68 ఎంయూలకు చేరుతదుందని అంచనా. ఇప్పటికే గ్రేటర్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేశాం. వార్షిక పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఓ వైపు పునరుద్ధరణ పనులు చేపడుతూనే.. మరోవైపు అంతరాయాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. – శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్ -
కోతల వెనుక... మత్ లబ్
బాల్కొండ, న్యూస్‌లైన్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి జలాశయా లు నిండుకుండలా మారాయి. విద్యుత్ ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో జరుగుతోంది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం కూడా అంతగా లేదు. అయినా అధికారులు గ్రామాలలో గృహావసరాలకు అధికారికంగా కోతలు విధిస్తున్నారు. సబ్‌స్టేషన్ ఉన్న గ్రామాలలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8.30 వరకు, ఇతర గ్రామాలలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుం చి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు కోతలు విధిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో ప్రాజెక్ట్‌లకు అనుబంధం గా ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరిగితే వేసవి వరకు కోతలు ఉండవని భావించిన గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరాశే ఎదురైంది. వర్షాకాలంలోనే కోతలు ఈ విధంగా ఉంటే వేసవిలో ఎన్ని తంటాలు పడవలసి వస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొత్తగూడెంలో రెండు యూనిట్లు, రామగుండంలో ఒక యూనిట్ మరమ్మతులకు రావడంతో కోతలు విధించాల్సి వస్తోందని కొందరు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుంచే కోతలు ప్రారంభమయ్యాయని మరికొందరు చెబుతున్నారు. డిమాండ్ పెరగకుండానే.. సాగుకు ప్రస్తుతం నీరు అవసరం లేదు. విద్యుత్తు మోటార్ల ద్వారా నీటి సరఫరాను చేపట్టడం లేదు. దీంతో వ్యవసాయనికి అంతగా విద్యుత్తు డిమాండ్ లేదు. అయినా గృహ అవసరాలకు కోతలు విధిస్తున్నారు. వానాకాలం ముగిసిన తర్వాత సాగుకు విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు గ్రామాలలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటీర పరిశ్రమలు మళ్లీ కుదేలయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. సాగుకు కూడ ఏడు గంటల కరెంట్ సరఫరా కష్టంగానే కనిపి స్తోందని ట్రాన్స్‌కో అధికారులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్తు కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో విద్యుత్తు కోతలు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కోతలు అమలు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలలో గృహాలకు కోతలు విధిస్తున్నారు. -నరేందర్‌గౌడ్, ట్రాన్స్‌కో ఏఈ, బాల్కొండ