న్యూఢిల్లీ: దేశంలో రూఫ్‌టాప్ సోలార్ (పై కప్పులపై సోలార్ విద్యుదుత్పాదన) సామర్థ్యం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.35 శాతం పెరిగింది. మొదటి మూడు నెలల్లో 485 మెగావాట్ల సామర్థ్యం మేర సోలార్ రూఫ్‌టాఫ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నట్టు మెర్కామ్ ఇండియా తెలిపింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇలా ఏర్పాటైన సామర్థ్యం 456 మెగావాట్లుగా ఉన్నట్టు పేర్కొంది.
2023 మార్చి నాటికి భారత్‌లో మొత్తం రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 9.3 గిగావాట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. 2022 చివరి మూడు నెలల్లో ఏర్పాటైన 483 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంతో పోలిస్తే 0.4 శాతం మేర ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు వివరించింది. ఈ మేరకు ‘క్యూ1, 2023 మెర్కామ్ ఇండియా రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 2023 జనవరి – మార్చి త్రైమాసికంలో ఏర్పాటైన మొత్తం 485 మెగావాట్లలో 58 శాతం గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నదే కావడం గమనార్హం.
పరిశ్రమలపై 28 శాతం, వాణిజ్య వినియోగదారులు ఏర్పాటు చేసుకున్న సామర్థ్యం 14 శాతం చొప్పున ఉంది. దేశంలో మొత్తం సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో రూఫ్‌టాప్ సోలార్ వాటా 26 శాతానికి చేరుకుంది. 2022లో హెచ్చు తగ్గులను చూసిన తర్వాత రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విషయంలో స్థిరమైన పురోగతి కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది.
‘‘విద్యుత్ రేట్లు పెరుగుతుండడంతో రూఫ్‌టాప్ సోలార్ ఆకర్షణీయంగా మారుతోంది. రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుంది’’ మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఏర్పాటైన రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యంలో 70 శాతం వాటా ఆక్రమించాయి. ఇందులో గుజరాత్ వాటా అత్యధికంగా 24 శాతం మేర ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment