బాల్కొండ, న్యూస్‌లైన్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి జలాశయా లు నిండుకుండలా మారాయి. విద్యుత్ ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో జరుగుతోంది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం కూడా అంతగా లేదు. అయినా అధికారులు గ్రామాలలో గృహావసరాలకు అధికారికంగా కోతలు విధిస్తున్నారు. సబ్‌స్టేషన్ ఉన్న గ్రామాలలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8.30 వరకు, ఇతర గ్రామాలలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుం చి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు కోతలు విధిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో ప్రాజెక్ట్‌లకు అనుబంధం గా ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరిగితే వేసవి వరకు కోతలు ఉండవని భావించిన గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరాశే ఎదురైంది. వర్షాకాలంలోనే కోతలు ఈ విధంగా ఉంటే వేసవిలో ఎన్ని తంటాలు పడవలసి వస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొత్తగూడెంలో రెండు యూనిట్లు, రామగుండంలో ఒక యూనిట్ మరమ్మతులకు రావడంతో కోతలు విధించాల్సి వస్తోందని కొందరు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుంచే కోతలు ప్రారంభమయ్యాయని మరికొందరు చెబుతున్నారు.
డిమాండ్ పెరగకుండానే..
సాగుకు ప్రస్తుతం నీరు అవసరం లేదు. విద్యుత్తు మోటార్ల ద్వారా నీటి సరఫరాను చేపట్టడం లేదు. దీంతో వ్యవసాయనికి అంతగా విద్యుత్తు డిమాండ్ లేదు. అయినా గృహ అవసరాలకు కోతలు విధిస్తున్నారు. వానాకాలం ముగిసిన తర్వాత సాగుకు విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు గ్రామాలలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటీర పరిశ్రమలు మళ్లీ కుదేలయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. సాగుకు కూడ ఏడు గంటల కరెంట్ సరఫరా కష్టంగానే కనిపి స్తోందని ట్రాన్స్‌కో అధికారులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్తు కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో విద్యుత్తు కోతలు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కోతలు అమలు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలలో గృహాలకు కోతలు విధిస్తున్నారు.
-నరేందర్‌గౌడ్, ట్రాన్స్‌కో ఏఈ, బాల్కొండ