
ఐటీ కారిడార్‌లో తొలిసారి క్యాబ్‌లు నడపనున్న మహిళలు
సంగారెడ్డి జిల్లాలో 35 మంది గుర్తింపు.. డ్రైవింగ్‌లో శిక్షణ
క్యాబ్ సేవలు వినియోగించుకునేలా ఐటీ కంపెనీలకు లేఖలు రాయాలని కలెక్టర్ క్రాంతి నిర్ణయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇకపై స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) క్యాబ్ సేవలందించనున్నాయి. నగరానికి అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళలు ఈ క్యాబ్‌లను నడపనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 35 మంది మహిళలను గుర్తించారు. వీరికి ఇప్పటికే కార్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా జారీ చేశారు. వీరు క్యాబ్ కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఒక్కో సభ్యురాలికి రూ.ఐదు లక్షల చొప్పున బ్యాంకు రుణం అందజేయనున్నారు.
హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కంపెనీలకు ఈ క్యాబ్‌లను అనుసంధానం చేస్తారు. ఈ మేరకు కొండాపూర్, హైటెక్ సిటీ, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీలకు లేఖలు రాయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి నిర్ణయించారు.
మహిళా ఉద్యోగులను తరలించేందుకు ఈ ఎస్‌హెచ్‌జీ మహిళల క్యాబ్‌లను వినియోగించుకోవాలని ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. దీంతో ఐటీ ఉద్యోగాలు చేసే మహిళలు అర్ధరాత్రి సైతం సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని భావిస్తున్నారు.
సబ్సిడీ కోసం ప్రతిపాదనలు
స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్షల్లో ధరలుండే కార్లను కొనుగోలు చేయడం ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం. దీనిని అధిగమించేందుకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ వర్తింపచేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కార్ల కొనుగోలుకు అవసరమైన బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ జంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లాలో కొందరు మహిళలకు షీక్యాబ్‌ల పేరుతో రూ.లక్షల్లో సబ్సిడీలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ కార్లు కిరాయికి పెట్టేలా అధికారులు పెద్దగా ప్రోత్సహించలేదు. దీంతో ఆశించిన మేరకు సేవలందించలేదు. ఇప్పుడు అలా కాకుండా ఐటీ కంపెనీలతో మాట్లాడి, స్వయం ఉపాధి కల్పించేలా అడుగులు పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment