క్వింటాలుకు రూ.వెయ్యికిపైగా పెరిగిన విత్తనం ధర
ఎకరానికి రూ.8 వేల వరకు అదనపు సాగు ఖర్చు
సబ్సిడీపై విత్తనం పంపిణీ చేయాలని రైతుల డిమాండ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆలూ రైతులపై విత్తన భారం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు విత్తనాల ధరలను అమాంతం పెంచడంతో ఈ పంట సాగుచేసే రైతులకు సాగు ఖర్చు తడిసిమోపెడవుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,400 వరకు ఉన్న ఆలు విత్తనం ఇప్పుడు ఏకంగా రూ.3,500 దాటింది. క్వింటాలుపై సుమారు రూ.వెయ్యికిపైగా ధర పెరిగింది. ఎకరానికి కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు విత్తన దశలోనే సాగు ఖర్చు రూ.8 వేలు పెరుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట కావడం, దీనికి తోడు విత్తన భారం పెరగడంతో ఆలురైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది.
తెరపైకి సబ్సిడీ సీడ్ డిమాండ్
పెరిగిన ఆలూ విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గతంలో రెండుసార్లు ఈ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సబ్సిడీపై ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిందని, ఈసారి కూడా సబ్సిడీ విత్తన పంపిణీని పునరుద్ధరించాలని ఆలూ రైతులు కోరుతున్నారు.
పంజాబ్ నుంచి కొనుగోలు..
ఏటా రైతులు పంజాబ్‌లోని జలంధర్, యూపీలోని ఆగ్రా నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. పెద్ద రైతులైతే స్వయంగా అక్కడి వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే ఆలూ విత్తన వ్యాపారులు ధరను అమాంతం పెంచారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆలుగడ్డల ధర కాస్త ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు విత్తన రూపంలో మాత్రం భారం తప్పడం లేదు. ఏటా రైతులు సెపె్టంబర్ చివరి వారం నుంచి ఆలూను విత్తుకోవడం ప్రారంభిస్తారు. ఈ విత్తనాల కోసం రైతులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు.
రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో ఆలుగడ్డలు అత్యధికగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌తో పాటు, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. ఇక్కడి నేలతో పాటు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావడంతో ఈ పంటకు మంచి దిగుబడి వస్తుంది.
విత్తనాన్ని సబ్సిడీపై అందించాలి
ఆలూ విత్తనం రేటు పెరిగినందున ప్రభు త్వం సబ్సిడీపై రైతులకు అందించాలి. గతేడాది ఆలూ విత్తనం క్వింటాల్ రూ.2,400 – రూ.2,600 ఉండగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.3 వేలు – రూ.3,500 పలుకుతోంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని అందిస్తే బాగుంటుంది. – దిలీప్‌కుమార్, రైతు, అత్నూర్
ఆలూ సాగు ఖర్చు పెరిగింది
ఆలుగడ్డ విత్తనం ధర భారీగా పెంచారు. విత్తన ఖర్చు ఎకరానికి 8 వేల వరకు అదనంగా అవుతోంది. గతంలో మాదిరిగా ఆలూ విత్తనాన్ని సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆలూ విత్తనం సబ్సిడీపై ఇచ్చేవారు. దీన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఎం.ఏసురత్నం, ఆలూ రైతు, మాచిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లా
సబ్సిడీ విత్తన సరఫరా పథకం లేదు
ప్రస్తుతం సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం లేదు. గతంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినట్లు నాకు తెలియదు. ఉద్యానవనశాఖ కిందకు వచ్చే ఈ పంటకు సబ్సిడీ వర్తించదు. ఒకవేళ సబ్సిడీ కిందకు చేరిస్తే రైతులకు సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం వీలవుతుంది. – సోమేశ్వర్‌రావు, డిప్యూటీ డైరెక్టర్, హారి్టకల్చర్
Comments
Please login to add a commentAdd a comment