seed prices
-
ఆలూ.. సబ్సిడీ ఇస్తే మేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆలూ రైతులపై విత్తన భారం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు విత్తనాల ధరలను అమాంతం పెంచడంతో ఈ పంట సాగుచేసే రైతులకు సాగు ఖర్చు తడిసిమోపెడవుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,400 వరకు ఉన్న ఆలు విత్తనం ఇప్పుడు ఏకంగా రూ.3,500 దాటింది. క్వింటాలుపై సుమారు రూ.వెయ్యికిపైగా ధర పెరిగింది. ఎకరానికి కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు విత్తన దశలోనే సాగు ఖర్చు రూ.8 వేలు పెరుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట కావడం, దీనికి తోడు విత్తన భారం పెరగడంతో ఆలురైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తెరపైకి సబ్సిడీ సీడ్ డిమాండ్ పెరిగిన ఆలూ విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గతంలో రెండుసార్లు ఈ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సబ్సిడీపై ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిందని, ఈసారి కూడా సబ్సిడీ విత్తన పంపిణీని పునరుద్ధరించాలని ఆలూ రైతులు కోరుతున్నారు.పంజాబ్ నుంచి కొనుగోలు.. ఏటా రైతులు పంజాబ్‌లోని జలంధర్, యూపీలోని ఆగ్రా నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. పెద్ద రైతులైతే స్వయంగా అక్కడి వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే ఆలూ విత్తన వ్యాపారులు ధరను అమాంతం పెంచారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆలుగడ్డల ధర కాస్త ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు విత్తన రూపంలో మాత్రం భారం తప్పడం లేదు. ఏటా రైతులు సెపె్టంబర్ చివరి వారం నుంచి ఆలూను విత్తుకోవడం ప్రారంభిస్తారు. ఈ విత్తనాల కోసం రైతులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఆలుగడ్డలు అత్యధికగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌తో పాటు, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. ఇక్కడి నేలతో పాటు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావడంతో ఈ పంటకు మంచి దిగుబడి వస్తుంది.విత్తనాన్ని సబ్సిడీపై అందించాలి ఆలూ విత్తనం రేటు పెరిగినందున ప్రభు త్వం సబ్సిడీపై రైతులకు అందించాలి. గతేడాది ఆలూ విత్తనం క్వింటాల్ రూ.2,400 – రూ.2,600 ఉండగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.3 వేలు – రూ.3,500 పలుకుతోంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని అందిస్తే బాగుంటుంది. – దిలీప్‌కుమార్, రైతు, అత్నూర్ఆలూ సాగు ఖర్చు పెరిగింది ఆలుగడ్డ విత్తనం ధర భారీగా పెంచారు. విత్తన ఖర్చు ఎకరానికి 8 వేల వరకు అదనంగా అవుతోంది. గతంలో మాదిరిగా ఆలూ విత్తనాన్ని సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆలూ విత్తనం సబ్సిడీపై ఇచ్చేవారు. దీన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఎం.ఏసురత్నం, ఆలూ రైతు, మాచిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లాసబ్సిడీ విత్తన సరఫరా పథకం లేదు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం లేదు. గతంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినట్లు నాకు తెలియదు. ఉద్యానవనశాఖ కిందకు వచ్చే ఈ పంటకు సబ్సిడీ వర్తించదు. ఒకవేళ సబ్సిడీ కిందకు చేరిస్తే రైతులకు సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం వీలవుతుంది. – సోమేశ్వర్రావు, డిప్యూటీ డైరెక్టర్, హారి్టకల్చర్ -
సోయాబీన్ విత్తన ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు సోయాబీన్ విత్తనాలను కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో క్వింటా సోయాబీన్ విత్తనాల ధర రూ.3,200లోపు ఉండగా బయట నుంచి రూ.5,500 కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి క్వింటా రూ.5,200 కొనుగోలు చేయాలని నిర్ణయిం చగా, ఎవరూ ముందుకు రావడం లేదంటూ దానిని రూ.5,500 పెంచినట్లు తెలిసింది. అవసరమైతే ఇంకా పెంచే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఫైల్‌ను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పం పింది. ఒకవేళ విత్తనాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,800కు మించి ధర ఉండదంటున్నా రు. అధికధరకు కొనుగోలు చేస్తే ఆ మేరకు వ్యాపారులకు లాభం చేసినట్లు అవుతుంది. గత ఏడాది క్వింటా సోయాబీన్ విత్తనానికి రూ.5,475 నిర్ణయించగా ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 33.33 శాతంగా ఉంది. వ్యవసాయ శాఖ రూ.5,500కు కొనుగోలు చేస్తే రైతులతోపాటు ప్రభుత్వంపై కూడా భారం పడ నుంది. దీంతో విత్తన ధరలు పెంచే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే వానాకాలానికి 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. 2015 వానాకాలంలో 6.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సోయాబీన్ సాగైతే, 2017 వానాకాలంలో 4.07 లక్షల ఎకరాలకు పడిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి సోయా విత్తనాలను సేకరించే యోచనలో వ్యవసాయశాఖ ఉంది. -
రైతులపై విత్తన భారం
శనగ, వేరుశనగ విత్తన ధరలు భారీగా పెంపు సాక్షి, హైదరాబాద్: యాసంగిలో సరఫరా చేసే విత్తనాలను తక్కువ ధరకు సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ మార్కెట్ ధరలకంటే అధిక రేటుకు విక్రయించేందుకు పూనుకుంది. శనగ, వేరుశనగ విత్తనాల ధరలను భారీగా పెంచింది. మంగళవారం ఈ మేరకు వచ్చే యాసంగికి 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 1.33 లక్షల క్వింటాళ్ల శనగ,1.64 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో శనగల ధర క్వింటాలుకు రూ.6,100 వరకు ఉండగా, వ్యవసాయ శాఖ శనగ విత్తనాలను రూ.8,680కు ఖరారు చేసింది. ఇందులో 33 శాతం సబ్సిడీ రూ.2,865 పోను రూ.5,815 రైతులు చెల్లించాలని తెలిపింది. శనగలను విత్తనాలుగా ప్రాసెసింగ్ చేసేందుకు క్వింటాలుకు రూ.వెయ్యి అదనం అనుకున్నా రూ.7,100కు మించి కాదని నిపుణులు అంటు న్నారు. అంటే అదనంగా రూ.1,500కు పైనే ఖరారు చేశారు. మార్కెట్ ప్రకారం చూస్తే 33 శాతం సబ్సిడీతో రూ.4,757కే ఇచ్చే అవకాశముంది. వేరుశనగ ధర మార్కెట్లో క్వింటాలు రూ.5 వేలే. కానీ శాఖ రూ.7,600 ఖరారు చేసింది. వాటికి 40 శాతం సబ్సిడీ రూ.3,040 పోను రూ.4,560 రైతు చెల్లించాలి. వేరుశనగలను ప్రాసెసింగ్ చేసేందుకు రూ.వెయ్యి అదనం అనుకున్నా రూ.6వేలకు మించి ఉండాల్సిన పనిలేదు. కానీ రూ.1,600 అదనంగా ఖరారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్ధసారథి, కమిషనర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన ధరలు పైపైకి!
విజయనగరం ఫోర్ట్: ఏటా సాగు ఖర్చులు పెరగడంతో వ్యవసాయం ఏవిధంగా చేపట్టాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విత్తన ధరలు పెరగడంతో వారిలో గుబులు మొదలైంది. «పెరిగిన విత్తన ధరలతో సాగు చేపట్టినా గిట్టుబాటవుతుందో లేదోనని తల్లడిల్లుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. పార్వతీపురం డివిజన్లో కొన్ని చోట్ల రైతులు విత్తనాలు కూడా∙వేసేశారు. మిగిలిన ప్రాంతాల్లో విత్తనధరలు చూసి అన్నదాతలు సాగు చేపట్టాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. జిల్లాలో ఈ ఏడాది 1,18,812 హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా. ఇందుకు 80 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. అయితే 30 కేజీల విత్తనం బస్తా ధర సోసైటీల్లో రూ.780కు విక్రయిస్తుండగా ప్రైవేటు డీలర్లు రూ.800 నుంచి రూ.830 వరకు తీసుకుంటున్నారు. కానీ 80 కేజీల ధాన్యం బస్తాకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.1100మాత్రమే. ఈ ప్రకారం చూస్తే మద్దతు ధర ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 30 కేజీల విత్తనం బస్తాధర, 80 కేజీల ధాన్యం బస్తా ధర ఇంచుమించు ఒకేలా ఉందని రైతులు అంటున్నారు. విత్తనాలకే రూ. వేలల్లో వెచ్చిస్తే ఎరువులు, దుక్కి దున్నడానికి నాట్లు వేయడానికి, కలుపు తదితర ఖర్చులకు ఎంత వెచ్చించాలో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ. 1800 వస్తేనే గిట్టుబాటు ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం 80 కేజీల బస్తాకు మద్దతు ధర కనీసం రూ. 1800లు ఇస్తేగానీ గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు పెరిగిన నేపథ్యంలో రైతులకు కాస్త ఆదాయం రావాలంటే ఆ మేరకు ఇవ్వాలని కోరుతున్నారు. ఏమీ మిగిలే లేదు 30 కేజీల ధాన్యం బస్తా రూ.800 అయింది. ఎకరాకు 45 కేజీల విత్తనం అవసరం అవుతుంది. నాకు మూడెకరాల పొలం ఉంది. ఈ లెక్కన నాలుగున్నర బస్తాల విత్తనం అవసరం. అంటే విత్తనాలకే రూ. 3600 అవుతుంది. దమ్ము చేయడానికి, నాట్లు వేయడానికి ఎరువులు, కలుపు, కోతకు, నూర్పు చేయడానికి మరో రూ.30 వేలు నుంచి రూ. 32 వేలు ఖర్చవుతుంది. పెట్టుబడులు పెరిగిపోవడం వల్ల ఏమీ మిగలదు. – కె.అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం -
పత్తి@రూ.5,425
► నిర్మల్ మార్కెట్లో రికార్డు ధర ►ఈ సీజన్ లో అదే అత్యధికం! ► క్యాండీ, సీడ్ ధరలు అమాంతం పెరగడంతోనే.. ► అన్నదాతల్లో ఆనందం సాక్షి, నిర్మల్ : ఈ ఏడాది పత్తి కొనుగోలు సీజన్ లో నిర్మల్ మార్కెట్లో రికార్డు ధర నమోదైంది. శనివారం ఈ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5,425 ధర పలికింది. వారం రోజుల కిందటి వరకు రూ.5,100 నుంచి రూ.5,200 పలుకగా రెండు రోజులుగా రూ.5,400 పైబడి వెచ్చించి ట్రేడర్స్ కొనుగోలు చేస్తుండడం గమనార్హం. భైంసా మార్కెట్లో శనివారం రూ.5,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో క్యాండీ(365 కిలోల దూది ఘటాన్ ), కాటన్ సీడ్ రేటు భారీగా పెరుగడంతోనే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతుల నుంచి చేజారిన తరువాత.. నిర్మల్ జిల్లా మార్కెట్లో పత్తి కొనుగోలు అధికారికంగా గతేడాది నవంబర్ 1వ తేదీన ప్రారంభమైనప్పటికీ అనధికారికంగా అక్టోబర్ నెలలో మధ్య నుంచే కొనుగోలు ప్రారంభమయ్యాయి. పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.4,160 కాగా, భైంసా మార్కెట్లో ప్రారంభ ధర క్వింటాలుకు రూ.4,725 ఇచ్చారు. ఖరీఫ్ కొనుగోలు ప్రారంభమైనప్పటీ నుంచి ధర పడిపోవడం మాటేమో కానీ పైపెచ్చు ధర పెరుగుతూనే వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కనీస మద్దతు ధరతోనే కొనుగోలు చేయాల్సి రావడంతో మార్కెట్ ధరకు వాణిజ్య కొనుగోలుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 51 వేల 657 హెక్టార్లలో పత్తి సాగు కాగా 7 లక్షల 74 వేల 855 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు మార్కెట్లో 4 లక్షల 50 వేల క్వింటాల పత్తి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రైతు చేతి నుంచి అత్యధికంగా పత్తి చేజారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజుల నుంచి పత్తి ధర సుమారు రూ.200 పైబడి పెరిగింది. పత్తిని అమ్ముకున్న రైతులకు ఇది నష్టం చేకూరుస్తుండగా, ఇంకా చేతిలో పత్తి ఉన్న రైతు మాత్రం ఇప్పుడే పత్తిని అమ్మేందుకు ముందుకు రావడం లేదు. మరింత ధర పెరుగుతుందని పత్తిని నిల్వ ఉంచుతున్నారు. పెరిగిన ధర మాత్రం వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పత్తిని కొనుగోలు చేసిన తరువాత జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ చేస్తారు. జిన్నింగ్ చేసినప్పుడు పత్తి నుంచి గింజలు వేరై పక్కకు చేరుతాయి. ఆ తరువాత గింజ నుంచి వేరు చేసిన పత్తిని దూది అంటారు. దూదిని ప్రెస్సింగ్ చేయ డం ద్వారా బెల్, క్యాండీలుగా(దూది ఘటాన్లు) తయారు చేసి జాతీయం, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇటు క్యాండీ అటూ పత్తి గింజలు (సీడ్) ధరలు అమాంతం పెరగడంతో వ్యాపారులకు రెండు వి«ధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. క్యాండీ : రూ.42 వేలు దేశీయ మార్కెట్లో ప్రస్తుతం క్యాండీ రేటు రూ.40 వేల నుంచి రూ.42వేలు పలుకుతున్నట్లు మార్కెట్ మిర్రర్ తెలియజేస్తోంది. పత్తి సీజన్ మొదట్లో రూ.37 వేలు క్యాండీ ధర పలుకగా ఇప్పుడు భారీగా పెరిగింది. అదే సమయంలో పత్తి గింజల ద్వారా 100 కిలోలకు రూ.2,450 నుంచి రూ.2,750 వరకు పలుకుతున్నట్లు తెలుపుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో పత్తి ధర ఇంకా పెరిగే అవకాశాలు విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో పత్తి ధర ప్రస్తుతం రూ.5,200 నుంచి రూ.5,750 పలుకుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రూ.4,900 నుంచి రూ.5,500 వరకు, కర్ణాటకలో రూ.5,800 వరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.5,000 నుంచి రూ.5,900 వరకు పలుకుతున్నట్లు మిర్రర్ స్పష్టం చేస్తోంది.