
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు సోయాబీన్ విత్తనాలను కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో క్వింటా సోయాబీన్ విత్తనాల ధర రూ.3,200లోపు ఉండగా బయట నుంచి రూ.5,500 కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి క్వింటా రూ.5,200 కొనుగోలు చేయాలని నిర్ణయిం చగా, ఎవరూ ముందుకు రావడం లేదంటూ దానిని రూ.5,500 పెంచినట్లు తెలిసింది. అవసరమైతే ఇంకా పెంచే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఫైల్‌ను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పం పింది.
ఒకవేళ విత్తనాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,800కు మించి ధర ఉండదంటున్నా రు. అధికధరకు కొనుగోలు చేస్తే ఆ మేరకు వ్యాపారులకు లాభం చేసినట్లు అవుతుంది. గత ఏడాది క్వింటా సోయాబీన్ విత్తనానికి రూ.5,475 నిర్ణయించగా ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 33.33 శాతంగా ఉంది. వ్యవసాయ శాఖ రూ.5,500కు కొనుగోలు చేస్తే రైతులతోపాటు ప్రభుత్వంపై కూడా భారం పడ నుంది. దీంతో విత్తన ధరలు పెంచే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే వానాకాలానికి 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. 2015 వానాకాలంలో 6.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సోయాబీన్ సాగైతే, 2017 వానాకాలంలో 4.07 లక్షల ఎకరాలకు పడిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి సోయా విత్తనాలను సేకరించే యోచనలో వ్యవసాయశాఖ ఉంది.