విత్తన ధరలు పైపైకి!
విజయనగరం ఫోర్ట్: ఏటా సాగు ఖర్చులు పెరగడంతో వ్యవసాయం ఏవిధంగా చేపట్టాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విత్తన ధరలు పెరగడంతో వారిలో గుబులు మొదలైంది. «పెరిగిన విత్తన ధరలతో సాగు చేపట్టినా గిట్టుబాటవుతుందో లేదోనని తల్లడిల్లుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. పార్వతీపురం డివిజన్‌లో కొన్ని చోట్ల రైతులు విత్తనాలు కూడా∙వేసేశారు. మిగిలిన ప్రాంతాల్లో విత్తనధరలు చూసి అన్నదాతలు సాగు చేపట్టాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. జిల్లాలో ఈ ఏడాది 1,18,812 హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా.
ఇందుకు 80 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. అయితే 30 కేజీల విత్తనం బస్తా ధర సోసైటీల్లో రూ.780కు విక్రయిస్తుండగా ప్రైవేటు డీలర్లు రూ.800 నుంచి రూ.830 వరకు తీసుకుంటున్నారు. కానీ 80 కేజీల ధాన్యం బస్తాకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.1100మాత్రమే. ఈ ప్రకారం చూస్తే మద్దతు ధర ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 30 కేజీల విత్తనం బస్తాధర, 80 కేజీల ధాన్యం బస్తా ధర ఇంచుమించు ఒకేలా ఉందని రైతులు అంటున్నారు. విత్తనాలకే రూ. వేలల్లో వెచ్చిస్తే ఎరువులు, దుక్కి దున్నడానికి నాట్లు వేయడానికి, కలుపు తదితర ఖర్చులకు ఎంత వెచ్చించాలో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రూ. 1800 వస్తేనే గిట్టుబాటు
ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం 80 కేజీల బస్తాకు మద్దతు ధర కనీసం రూ. 1800లు ఇస్తేగానీ గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు పెరిగిన నేపథ్యంలో రైతులకు కాస్త ఆదాయం రావాలంటే ఆ మేరకు ఇవ్వాలని కోరుతున్నారు.
ఏమీ మిగిలే లేదు
30 కేజీల ధాన్యం బస్తా రూ.800 అయింది. ఎకరాకు 45 కేజీల విత్తనం అవసరం అవుతుంది. నాకు మూడెకరాల పొలం ఉంది. ఈ లెక్కన నాలుగున్నర బస్తాల విత్తనం అవసరం. అంటే విత్తనాలకే రూ. 3600 అవుతుంది. దమ్ము చేయడానికి, నాట్లు వేయడానికి ఎరువులు, కలుపు, కోతకు, నూర్పు చేయడానికి మరో రూ.30 వేలు నుంచి రూ. 32 వేలు ఖర్చవుతుంది. పెట్టుబడులు పెరిగిపోవడం వల్ల ఏమీ మిగలదు.
– కె.అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం